జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు ప్రయోజనం శూన్యం
వ్యవసాయంపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పోరాటంతోనే కొనుగోలు కేంద్రాల ప్రారంభం :
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు ొ కొనుగోలు కేంద్రాల పరిశీలన
నవతెలంగాణ – బోనకల్
రైతులు పండించిన పంటను సమయా నికి కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు మండిపడ్డారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు ప్రయోజనం ఉండటం లేదన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం, రావి నూతల సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్న మొక్కజొన్న బస్తాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, సంఘం నేతలతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోవిం దాపురం, రావినూతల ప్రాంతాల రైతులు తమ సమస్యలను వివరించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ,పంటల కొనుగోలుపై ప్రభుత్వ నిర్లక్ష్యం పంటను కొనుగోలు చేయకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. బస్తాలు, లారీలు కూడా తామే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ రైతుల పోరాట ఫలితంగానే బోనకల్ మండలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు.
కానీ ప్రభుత్వం ప్రకటించినట్లుగా ప్రతి గింజను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారని అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే రైతుల పరిస్థితి ఇలా ఉండటం ఆందోళనకరమన్నారు. రైతులే బస్తాలు కొనుగోలు చేసుకుని, లారీలు కిరాయి చెల్లించి పంట తరలించాల్సి రావడం దౌర్భాగ్యకరమని అన్నారు. ఒకవైపు వాతావరణ హెచ్చరికలు వస్తుండగా, మరోవైపు బస్తాలు కల్లాలలో నిల్వ ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. యూరియా కొరత, కొనుగోలు కేంద్రాల లోపం, పరిమితులు విధించడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని విమర్శించారు. రైతులు కదిలితేనే కొనుగోలు కేంద్రాలు వచ్చాయని, అదే విధంగా మళ్లీ కదిలితేనే బస్తాల తరలింపు జరుగుతుందని అన్నారు.
తీవ్రమైన ఎండలు, వడగాల్పులు, పొలాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో రైతుల జీవనం దినదిన గండంగా మారిందనితెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలను గోదాములకు ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించారు. 8 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడానికి మాయమాటలు చెబితే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా చూడాలని కోరారు. లారీలను పంపకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల నిర్వహణను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీలు మడిపల్లి గోపాలరావు, గుడ్డురి ఉమ, మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, డివిజన్ నాయకులు కిలారు సురేష్, గోవిందాపురం ఎల్ సర్పంచ్ మంద కరుణ, మాజీ సర్పంచ్ కొమ్ము కమలమ్మ, రైతులు మాదినేని వీరభద్రరావు, జొన్నలగడ్డ సునీత, ఏడునూతల లక్ష్మణరావు, దొండపాటి సత్యనారాయణ, జోనిబోయిన గురవయ్య, ఎర్రగాని నాగరాజు, షేక్ నన్నేసాహెబ్, గుగులోత్ నరేష్, పసుపులేటి నరేష్, గుడ్డురి వెంకట నరసయ్య, పత్తి రాధాకష్ణ, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



