Monday, May 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వాస్పత్రి వైద్యులు సమయపాలన పాటించాలి 

ప్రభుత్వాస్పత్రి వైద్యులు సమయపాలన పాటించాలి 

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరుటౌన్ 
ఆలేరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. అత్యవసర వైద్య సేవలకోసం వచ్చే రోగులు, గర్భిణీలు, సాధారణ క్షతగాత్రులు ఇలా చాలా మంది సకాలంలో వైద్యులు ఆస్పత్రిలో లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా సోమవారం, గురువారం ప్రభుత్వాస్పత్రికి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు వైద్య పరీక్షల నిమిత్తం వస్తుంటారు. వారికి ఆ ప్రత్యేక రోజుల్లోనే చూస్తుంటారు. అప్పుడు కూడా డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదని గర్భిణీలు వాపోతున్నారు. పరీక్షల నిమిత్తం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వస్తుందని గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయని, దానివల్ల ఎక్కువ సేపు వేచి ఉండలేకపోతున్నామని, నీరసం ఎక్కువవుతోందని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే వైద్య పరీక్షలు చేసుకున్న రిపోర్టులు కూడా సకాలంలో అందడంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కానింగ్ వారానికి రెండుసార్లు కాకుండా రెగ్యులర్గా చెయ్యాలని, రిపోర్టులు ఇవ్వాలని గర్భిణిలు కోరారు. 

సోమవారం ఉదయం 10:45 కు  గర్భిణీ స్త్రీలను చూసే గైనకాలజిస్ట్, డాక్టర్ లేక ఆస్పత్రి వరండాలో గర్భిణీలు వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. మే, జూన్ నెలలలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు 8:00 కి వచ్చి వైద్య సేవలు అందించాలని, గర్భిణీ స్త్రీలు ఇతర వైద్య చికిత్స కొరకు వచ్చే స్థానికులు కోరుతున్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ సకాలంలో హాజరు కావాలని, స్కానింగ్ మిషన్ రిపోర్టు రోజువారీగా ఇవ్వాలని కోరుతూ నవతెలంగాణ దినపత్రిక రిపోర్టర్ యేలుగల కుమార స్వామి ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్ని వివరణ కోరగా.. తను ప్రత్యేక పరిస్థితుల్లో సెలవులో ఉన్నానని, గైనకాలజిస్ట్, ఇతర వైద్యులు అలసత్వం లేకుండా, సకాలంలో హాజరు అయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. ఎక్స్ రే మిషన్ గురించి మాట్లాడుతూ.. కొంతమందికి ఎక్స్ రే తీయగానే సాంకేతిక లోపం ఏర్పడుతుందని, నూతన మిషన్ కు ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు. త్వరలోనే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -