కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోడౌన్లకు తరలించాలి
డిప్యూటీ సీఎం వైఖరి పై మండిపడ్డ అన్నదాతలు
సంఘటన స్థలానికి చేరుకున్న మండల అధికారులు
ఆందోళనకారులతో అధికారులు చర్చల విఫలం
అదనప కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన నున్నా నాగేశ్వరరావు
రెండు గంటల అనంతరం అదనపు కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో అగ్నికి ఆహుతైన పంట బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే తరలించాలని, మృత్యువాత పడిన గొర్రె బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ చింతకాని మండల పరిధిలోనే బోనకల్ – ఖమ్మం ప్రధాన రహదారిపై నాగలవంచ బస్టాండ్ వద్ద రెండు గంటలపాటు నాగులవంచ, పాతర్లపాడు గ్రామాలకు చెందిన రైతులు సీపీఐ(ఎం), బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆందోళనకు దిగటంతో ఖమ్మం – బోనకల్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన అనంతరం ఓ గంట తర్వాత చింతకాని తహసిల్దార్ బాబ్జి ప్రసాద్, ఎంపీడీవో సుంచు శ్రీనివాసరావు వైరా సీఐ టి వెంకట ప్రసాద్, చింతకాని ఎస్ఐ ఎన్ వీరేందర్ ఆందోళనకారుల వద్దకు వెళ్లారు.
ఆందోళనకారులతో తహసిల్దార్ చర్చలు జరిపారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు లేదా ఉన్నతాధికారులు వచ్చేంతవరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. తహసిల్దార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్నికి ఆహుతైన పంటను, మృత్యువాత పడిన గొర్రెలను తాను ఎంపీడీవో కలిసి ఇప్పుడే చూసి వస్తున్నామని చాలా బాధాకరమన్నారు. ఈ సంఘటన జరగకూడదని తాము కూడా ఎంతో బాధపడుతున్నామని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ల దృష్టికి ఆదివారం రాత్రి తీసుకెళ్ళినట్లు తెలిపారు. మా సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపించి నష్టం అంచనా వేయిస్తున్నామని ఆందోళన విరమించాలని కోరారు. అందుకు రైతులు, సీపీఐ(ఎం) నాయకులు తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, బోనకల్ మండల కార్యదర్శి కిలారు సురేష్ అధికారులతో చర్చలు జరిపారు. కానీ పంట నష్టం పై అంచనా వేస్తున్నామని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని పదేపదే తహసిల్దార్ చెప్పటం పట్ల సీపీఐ(ఎం) నాయకుల, రైతుల తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు.
దాదాపు అధికారులకు సీపీఐ(ఎం) నాయకులకు మధ్య గంట పాటు చర్చలు సాగాయి. చివరకు తహసిల్దార్ బాబ్జి ప్రసాద్ జిల్లా అదనప కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి సమస్య తీవ్రతను వివరించారు. అయినా శ్రీనివాస్ రెడ్డి నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరకు తహసిల్దార్ ఫోన్ ను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కు ఇచ్చారు. దీంతో నున్న నాగేశ్వరరావు జిల్లా అదనపు కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. రైతుల డిమాండ్లను శ్రీనివాసరెడ్డికి వివరించారు. నున్నా నాగేశ్వరరావు వివరించిన షరతులకు తొలుత శ్రీనివాస్ రెడ్డి అంగీకరించలేదు. తాను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి చెబుతానని జిల్లా అదనపు కలెక్టర్ నున్న నాగేశ్వరరావుకి సమాధానం చెప్పారు. అనంతరం కొద్దిసేపు తర్వాత అదనపు కలెక్టర్ ఫోన్ చేసి నున్నా నాగేశ్వరరావు తో మాట్లాడారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను రెండు రోజులలో తరలిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు.
అదేవిధంగా రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తామని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోతే రెండు రోజులు అనంతరం మరల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం నాయకులు, రైతులు హెచ్చరించారు. అనంతరం రైతులు తమ ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీపీఐ(ఎం) నాయకులు వత్సవాయి జానకి రాములు, రౌతు అప్పారావు, ఓబినబోయిన అచ్చయ్య, కొండ్రు జానకి రాములు, తోటకూర వెంకట నరసయ్య, ఆలస్యం రవి, సామినేని అప్పారావు, దేశబోయిన ఉపేందర్, బోనకల్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బంధం శ్రీనివాసరావు, గడ్డం కోటేశ్వరరావు, కందరబోయిన కొండలరావు, బిఆర్ఎస్ నాయకులు మంకెన రమేష్, సాధినేని అప్పారావు, బండి వెంకట రామారావు, పాతర్లపాడు నాగలవంచ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



