Tuesday, May 5, 2026
E-PAPER
Homeఆటలురేసు రసవత్తరం

రేసు రసవత్తరం

- Advertisement -

ఆసక్తికరంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు 12 పాయింట్లతో నాలుగు జట్లు ఇతర జట్లు సైతం పోటీలోనే..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌ లీగ్‌ దశలో 47 మ్యాచ్‌లు ముగిశాయి. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఎవరి సొంతమయ్యేది తేల్చేందుకు మరో 23 మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఐదు జట్లు 12 ప్లస్‌ పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేసులో ముందంజలో కొనసాగుతుండగా..ఇతర జట్లు ఆశలు వదులుకోలేదు. దీంతో లీగ్‌ దశ మ్యాచ్‌లు అభిమానుల్లో ఆసక్తి రేపుతుండగా, ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారింది.
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఐపీఎల్‌లో చాలా తక్కువ సీజన్లలో లీగ్‌ దశలో ఓ 45-47 మ్యాచ్‌లు ముగియగానే ఏకంగా 5 జట్లు 12 పాయింట్లు సాధించాయి. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో అటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఓ దశలో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు అయినట్టే అనిపించినా, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్లు ఓటమి బాట పడుతుండగా.. ఇతర జట్లు వరుస విజయాలతో రేసులోకి వస్తున్నాయి. ఊహించని మలుపులకు ఐపీఎల్‌లో కొదవ లేదు. దీంతో అభిమానులతో పాటు ప్రాంఛైజీలు సైతం ప్లే ఆఫ్స్‌ రేసును ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. సోమవారంతో ఐపీఎల్‌ లీగ్‌ దశలో 47 మ్యాచ్‌లు ముగిశాయి. మరో 23 మ్యాచ్‌లో లీగ్‌ దశలో మిగిలి ఉన్నాయి. దీంతో లీగ్‌ దశ ఆఖరు రెండు వారాల ఆటపై అన్ని జట్లు దృష్టి పెడుతున్నాయి. ఆరంభంలో అదరగొట్టిన జట్లు కీలక దశలో తడబడినా టాప్‌-4లో చోటు గల్లంతయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

ఆ 4 నిలుస్తాయా?
ఐపీఎల్‌19లో ప్రస్తుతం ఐదు జట్లు 12 పాయింట్లు సాధించాయి. పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌లు పాయింట్ల పట్టికలో టాప్‌-5లో కొనసాగుతున్నాయి. పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తున్నాయి. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరంభంలో మెరిసినా.. తర్వాత నెమ్మదించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరంభంలో తడబడినా వరుస విజయాలతో టాప్‌-4లోకి వచ్చింది. టాప్‌-4లో నిలిచిన జట్లు వరుసగా ఓటములు చవిచూడటానికి తోడు హ్యాట్రిక్‌ విజయాలతో గుజరాత్‌ టైటాన్స్‌ సత్తా చాటింది. 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో టైటాన్స్‌ సైతం 12 పాయింట్లు సాధించింది. ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం 14 పాయింట్లు అవసరం. పోటీ ఎక్కువగా ఉంటే కనీసం 16 పాయింట్లు కావాలి. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం 12 పాయింట్లతో నిలిచిన జట్లు కనీసం మరో రెండు విజయాలు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌తో సంతృప్తి చెందని జట్లు.. టాప్‌-2లో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. 12 పాయింట్లతో నిలిచిన ఐదు జట్లు ఇప్పుడు టాప్‌-4తో పాటు టాప్‌-2లో నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఆశలు ఆవిరి కాలేదు!
ఏడు ఓటములతో ముంబయి ఇండియన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ దాదాపుగా ప్లే ఆఫ్స్‌ రేసులో ఆశలు ఆవిరి చేసుకున్నాయి!. సాంకేతికంగా మాత్రమే ఈ రెండు జట్లు ఇంకా రేసులో కొనసాగుతున్నాయి. మరో ఓటమి ఎదురైతే రేసు నుంచి నిష్క్రమించినట్టే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించి జోరందుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ నాలుగేసి విజయాలు సాధించాయి. సూపర్‌కింగ్స్‌, క్యాపిటల్స్‌, నైట్‌రైడర్స్‌ మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించినా.. ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించినా అవకాశాలు తక్కువే. ప్రతి మ్యాచ్‌ కీలకమే కావటంతో ఐపీఎల్‌ లీగ్‌ దశ ఆఖరు మ్యాచ్‌లు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -