Tuesday, May 5, 2026
E-PAPER
Homeజాతీయంపీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీం విఫలం

పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీం విఫలం

- Advertisement -

భారీ లక్ష్యాలతో ప్రారంభమైన పథకం
గణనీయమైన లోపాలు బహిర్గతం
కేటాయించిన నిధుల్లో 1.5 శాతమే ఖర్చు
కేంద్రం తీరుపై మేధావులు, విద్యావేత్తల ఆందోళన
లక్ష్యాలకు దూరంగా అమలు తీరు
నిధుల వినియోగం అత్యల్పం

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం (పీఎంఐఎస్‌) అమలు తీరు చాలా దారుణంగా ఉంది. అది నిర్దేశించిన లక్ష్యాలను కూడా సాధించలేకపోతోంది. నిధుల వినియోగం అత్యల్పంగా ఉండగటం, అమలులో గణనీయమైన లోపాలు వంటివి పథకం పనితీరుపై ఆందోళనను కలిగిస్తోంది. భారీ బడ్జెట్‌ కేటాయింపులున్నప్పటికీ.. చాలా తక్కువ నిధులు వినియోగం కావడం, ఇంటర్న్‌షిప్‌లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఈ పథకం వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని మేధావులు, విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. 2024-25 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఈ పథకం ద్వారా ఐదేండ్లలో ఒక కోటి మంది యువత(విద్యార్థులు, ఉద్యోగార్థులు, పని అనుభవాన్ని కోరుకునేవారు)కు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెలకు రూ.5000 స్టైపెండ్‌, రూ.6వేలు ఒకసారి సహాయంగా కూడా ఇవ్వాలని ప్రకటించారు. ప్రధాని మోడీ ఈ పథకాన్ని యువతకు ఉద్యోగ అనుభవం కల్పించే ఒక ముందడుగుగా ప్రచారం చేశారు.

నిధుల వినియోగం చాలా తక్కువ

కేంద్రం 2024-25లో రూ.2000 కేటాయించింది. అయితే అందులో రూ.29.29 కోట్లు (సుమారు 1.5 శాతం) మాత్రమే ఖర్చయ్యాయి. ఇక 2025-26లో రూ.10,831 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.87.46 కోట్లు మాత్రమే వినియోగించారు. అంటే ఒక శాతం మాత్రమే ఖర్చు చేశారు. కేటాయింపులు భారీ మొత్తంలో జరుగుతోన్నా.. అందులో చాలా తక్కువగా ఖర్చు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఇంటర్న్‌షిప్‌లలో భారీ డ్రాపౌట్‌
మొదటి దశలో 1.27 లక్షల అవకాశాలను ఆఫర్‌ చేశారు. కానీ 28 వేల మంది (22 శాతం) మాత్రమే అంగీకారం తెలిపి.. 8,700 (7 శాతం) మంది చేరారు. ఇంటర్న్‌షిప్‌లలో చేరిన వీరిలో 4,705 మంది మధ్యలోనే విడిచిపెట్టి వెళ్లారు. చివరకు 3,995 మంది (3.1 శాతం) మాత్రమే ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేశారు. ఇక రెండో దశలో 1.18 లక్షల అవకాశాలుంటే.. 7300 మంది (6 శాతం) మాత్రమే చేరారు. 2,648 మంది డ్రాపౌట్‌ కాగా.. 4,652 మంది ఇంటర్న్‌షిప్‌ కొనసాగింపు లేదా పూర్తి చేశారు. మొత్తంగా చూస్తే 2.45 లక్షల అవాకాశాల్లో దాదాపు పదివేల మంది మాత్రమే ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేశారు.

లక్ష్యాలకు దూరంగా పథకం
మొదటి రెండేండ్లలో 30 లక్షల ఇంటర్న్‌షిప్‌లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు 2.45 లక్షల అవకాశాలను మాత్రమే ఇచ్చారు. ఇందులో పూర్తయినవి 0.3 శాతమే కావడం గమనార్హం. అంటే ప్రకటించిన లక్ష్యంతో పోలిస్తే అమలు పది రెట్లు కాదు.. వంద రెట్లు తక్కువ స్థాయిలో ఉంది.

పార్లమెంటరీ కమిటీ ఆందోళన
పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఈ పథకం పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చేరికలు, ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేసేవారి సంఖ్యలు చాలా తక్కువగా ఉన్నాయని వివరించింది. మహిళల భద్రత, రిలొకేషన్‌ సమస్యలు వంటి కారణాలను ఎత్తి చూపింది. స్టైపెండ్‌ పెంచాలనీ, ట్రావెల్‌, హాస్టల్‌ సౌకర్యాలు కల్పించాలని సూచించింది.

యువతకు సరిపోని స్టైఫండ్‌
ఈ పథకం కింద లభించే స్టైఫండ్‌ యువతకు సరిపోవడం లేదు. ఈ కారణంగానే వారు ఇంటర్న్‌షిప్‌లో చేరిన తర్వాత దానిని మధ్యలోనే వదిలి బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని సర్వేలు, రిపోర్టుల ప్రకారం.. ప్రభుత్వం అందించే రూ.5000 స్టైఫండ్‌ సరిపోవడం లేదు. ట్రావెల్‌, నివాస ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక ఇతర ఉద్యోగాలు లేదా చదువు వైపు చూడటం కూడా ఒక కారణంగా ఉంది. ఇక కంపెనీల నుంచి సరైన కమ్యూనికేషన్‌ ఉండటం లేదు. ఈ కారణాలతో నెల రోజుల వ్యవధిలోనే చాలా మంది ఇంటర్న్‌షిప్‌ను మధ్యలోనే వదిలేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి : సీపీఐ(ఎం) నేత జాన్‌ బ్రిట్టాస్‌

ఇక మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం విఫలం కావటం పట్ల రాజకీయంగానూ విమర్శలు పెరిగాయి. సీపీఐ(ఎం) నేత జాన్‌బ్రిట్టాస్‌ ఈ పరిస్థితిని పూర్తి వ్యవస్థ వైఫల్యంగా అభివర్ణించారు. ఈ విషయంలో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. మొత్తానికి భారీ ప్రచారం, లక్ష్యాలతో ప్రారంభమైన పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం అమలులో గణనీయమైన లోపాలు ఎదుర్కొంటోంది. నిధుల వినియోగం తక్కువగా ఉండటం, యువత పాల్గొనకపోవడం, డ్రాపౌట్‌లు అధికంగా ఉండటం వంటి అంశాలు పథకం ప్రభావాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. కేంద్రం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి పార్లమెంటరీ కమిటీ సూచనలను పాటించాలని మేధావులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. సరైన సవరణలు లేకపోతే.. ఈ పథకం లక్ష్యాలను చేరుకోవడం కష్టమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -