కర్నాటక, తమిళనాడులో చేతబడి పూజలు
కరువు రావాలని, రైతులు నష్టపోవాలని కోరుతున్నారు చెట్లకు కట్టేసి కొట్టాలి
బడుగు, బలహీనవర్గాలను గొర్రెలు, బర్రెలు పెంచుకోమన్నారు
సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం : విగ్రహావిష్కరణలో సీఎం ఏ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
పదేండ్లు రాష్ర్టాన్ని పరిపాలించిన వాళ్లు తమ దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. వారి ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదని తెలిసి, రాష్ర్టంలో కరువు రావాలని, రైతులు నష్టపోవాలని అఘోరా రావు చేతబడి పూజలు చేయించి వచ్చాడని విమర్శించారు. అధికారం కోసం ఇంతకు దిగజారుతారా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో చేతబడి చేసేవాళ్లను చెట్లకు కట్టేసి కొడతారని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ర్టంలోని బడుగు, బలహీన వర్గాల యువతను బర్రెలు, గొర్రెలు పెంచుకోవాలనీ, చెప్పులు కుడుతూ, చేపలు పట్టుకోండని చెప్పిందని గుర్తుచేశారు. కానీ తాము ఆ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని కాంక్షిస్తున్నామనీ, రాష్ర్టాభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని వివరించారు. మంగళవారంనాడిక్కడి ట్యాంక్‌బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలో బహుజనుల తెలంగాణ.
సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఉందని నిరూపించామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని చూసి, ప్రజలు పోరాట స్ఫూర్తి పొందాలన్నారు. ఆయన బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారని చరిత్రను గుర్తుచేశారు. మహారాష్ట్రలో శివాజీ విగ్రహానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో, తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యత ఇస్తారనీ, బ్రిటిష్ లైబ్రరీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విశేషాలు ఉన్నాయనీ, అక్కడి నుంచే మనం ఆయన చరిత్రను తెలుసుకున్నామని వివరించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం స్థాయిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పాలమూరు జిల్లాలో పండుగ సాయన్న పోరాటం, పౌరుషం అందరికీ తెలుసుననీ. అక్టోబర్ 22న ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. 2029 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ నేతృత్వంలోనే మళ్లీ అధికా రంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుం దనీ, గ్రామాల్లో అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ పింఛన్లు వచ్చేలా యువకులు సహకారాన్ని అం దించాలని కోరారు. ప్రభుత్వ పొలాలు, కాల్వ గట్లు, నీటిపా రుదల ప్రాజెక్టుల వద్ద ఈత, తాటి చెట్లు నాటేలా చూస్తామనీ, కులవృత్తులు చేసుకుంటూనే, తమ పిల్లల్ని బాగా చదివించి, వైద్యులు, న్యాయవాదులు, ఐఏఎస్‌లుగా మార్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాముల్ని చేయాలని కోరారు.
పిల్లల తలరాతలను విద్యమాత్రమే మార్చగలుగుతుందన్నారు. ఉన్నతమైన విద్య, ఆకలి లేని చదువును అందించే బాధ్యత తనదేనని చెప్పారు. గౌడ కులస్తుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఇప్పటి వరకు వారికి యాభై వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామనీ, ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. రెండోసారి 117 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య పరిపాలనలో ఉన్న వ్యత్యాసాన్ని సభికులకు వివరిం చారు. గత పాలకులది కుటుంబ న్యాయం అనీ, తమది సామాజిక న్యాయం అని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ ప్రభుత్వం అందరిదీ అనీ, ఎలాంటి లోటుపాట్లుఉన్నా మాట్లాడుకుని ముందుకు వెళ్దామని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, ఎంపీలు పాల్గొన్నారు.



