Tuesday, May 5, 2026
E-PAPER
Homeఆటలుముంబయి మురిసెన్‌

ముంబయి మురిసెన్‌

- Advertisement -

6 వికెట్ల తేడాతో లక్నోపై గెలుపు
ఛేదనలో రోహిత్‌, రికెల్టన్‌ ధనాధన్‌
లక్నో 228/5 ముంబయి 229/4
నవతెలంగాణ-ముంబయి

ఏడు ఓటములతో ప్లే ఆఫ్స్‌ ఆశలను దాదాపు ఆవిరి చేసుకున్న ముంబయి ఇండియన్స్‌.. వాంఖడెలో సోమవారం లక్నో సూపర్‌జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ నమోదు చేసింది. 229 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (84, 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), రియాన్‌ రికెల్టన్‌ (83, 32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) సునామీ సృష్టించారు. సూపర్‌జెయింట్స్‌ బౌలర్లపై పంజా విసిరిన ఓపెనర్లు 10.5 ఓవర్లలోనే 143 పరుగులు జోడించారు. రోహిత్‌, రికెల్టన్‌ దెబ్బకు పది ఓవర్లలోనే మ్యాచ్‌పై సూపర్‌జెయింట్స్‌ పట్టు కోల్పోయింది. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 22 బంతుల్లోనే రికెల్టన్‌ అర్థ సెంచరీ అందుకోగా.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 27 బంతుల్లో రోహిత్‌ ఫిఫ్టీ సాధించాడు. ఈ ఇద్దరి జోరుతో భారీ లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్‌ అలవోకగా ఛేదించింది. తిలక్‌ వర్మ (11), సూర్యకుమార్‌ యాదవ్‌ (12) నిరాశపరిచినా.. నమన్‌ ధిర్‌ (23 నాటౌట్‌), విల్‌ జాక్స్‌ (10 నాటౌట్‌) లాంఛనం ముగించారు. మరో 8 బంతులు ఉండగానే ముంబయి ఇండియన్స్‌ లాంఛనం ముగించింది.

అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు చేసింది. నికోలస్‌ పూరన్‌ (63, 21 బంతుల్లో 1 ఫోర్‌, 8 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 8 సిక్స్‌లు, ఓ ఫోర్‌తో ఏకంగా 300 స్ట్రయిక్‌రేట్‌తో విరుచుకుపడిన పూరన్‌.. సూపర్‌జెయింట్స్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (44, 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (31 నాటౌట్‌, 25 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), హిమ్మత్‌ సింగ్‌ (40, 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (15), జోశ్‌ ఇంగ్లిశ్‌ (13) విఫలమయ్యారు. పూరన్‌ దంచికొట్టుడుతో ఓ దశలో సూపర్‌జెయింట్స్‌ 250పైచిలుకు పరుగులు చేస్తుందని అనుకున్నా.. మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో 228 పరుగులకే పరిమితమైంది. ఇక, ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్‌కు పది మ్యాచ్‌ల్లో ఇది మూడో విజయం కాగా.. సూపర్‌జెయింట్స్‌కు 9 మ్యాచ్‌ల్లో ఇది ఏడో పరాజయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -