Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధికి సాంకేతిక చిక్కు

ఉపాధికి సాంకేతిక చిక్కు

- Advertisement -

యాప్ ఫోటోల కోసం గంటల కొద్దీ నిరీక్షణ!
నవతెలంగాణ – పరకాల 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం సాంకేతిక సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. క్షేత్రస్థాయిలో కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పథకం అసలు ఉద్దేశాన్నే దెబ్బతీస్తున్నాయి. మంగళవారం నవతెలంగాణ పత్రిక ప్రతినిధి పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో గ్రామంలోని వంకాయ కుంట వద్ద జరుగుతున్న పని ప్రదేశాన్ని పరిశీలించగా, కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్‌ఎన్‌ఎంఎస్ యాప్ కూలీలకు శాపంగా మారింది. గతంలో పని ప్రదేశంలో ఎక్కడైనా హాజరు నమోదు చేసుకునే వెసులుబాటు ఉండగా, ప్రస్తుతం భువన్ యాప్ అనుసంధానంతో నిర్దిష్ట లొకేషన్‌లో మాత్రమే ఫోటో తీయాల్సి రావడం గమనార్హం. సిగ్నల్ సమస్యల వల్ల ఒకే చోట గంటల తరబడి నిలబడాల్సి రావడంతో, పని కంటే హాజరుకే ఎక్కువ సమయం వృథా అవుతోందని కూలీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐరిష్, ఫేస్ రికగ్నైజేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక లోపాల వల్ల ఒక్కొక్కరితో ఫోటో తీయడం భారంగా మారింది.

గ్రామంలో మొత్తం 767 జాబ్ కార్డులు ఉండగా, ఈ రోజు కేవలం 26 మంది మాత్రమే పనికి రావడం పథకం పట్ల కూలీల్లో తగ్గుతున్న ఆసక్తిని సూచిస్తోంది. వేసవి ఎండలు మండుతున్నా పని ప్రదేశంలో కనీస మెడికల్ కిట్లు, నీడ వంటి సదుపాయాలు సరిగా లేకపోవడం గమనార్హం. వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యం కూలీల నడ్డి విరుస్తోంది. గతంలో 15 రోజుల్లోపే అందే వేతనాలు, ప్రస్తుతం మూడు నాలుగు నెలలవుతున్నా చేతికందడం లేదు. నూటెంకి బిక్షపతి, మారేబోయిన అశోక్ వంటి కూలీలు గతంలో 15 రోజులు పని చేసినా నేటికీ పైసా రాలేదని వాపోతున్నారు. దీనికి తోడు ఆధార్ ఆధారిత చెల్లింపుల (ఎంబిపిఎస్) గందరగోళం మరో సమస్యగా మారింది. కూలీలకు తాము రెగ్యులర్‌గా వాడే బ్యాంకు ఖాతాలో కాకుండా, ఏ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయో తెలియక బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 6 కుటుంబాలు మాత్రమే 100 రోజుల పని దినాలను పూర్తి చేసుకోగలిగాయి. ఏప్రిల్ మాసంలో 500 మంది వరకు పని చేసినా, ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పడిపోవడానికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఈ ఇబ్బందులే కారణమని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సాంకేతిక లోపాలను సరిచేసి, నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలో సకాలంలో వేతనాలు పడేలా చూడాలని వెల్లంపల్లి కూలీలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -