నవతెలంగాణ-జగిత్యాల టౌన్
ధర్మపురి గోదావరి నది పుష్కర ఘాట్ నుండి నదిలో కాలినడకన దాదాపు 8 కిలోమీటర్లు వెళితే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కాసిపేట, నంబాల, కొండాపూర్, ద్వారక గ్రామాలు వస్తాయి. అవి దాటితే మంచిర్యాల, జన్నారం నిర్మల్ ఖానాపూర్ వెళ్లే రోడ్డు వస్తుంది. ఆ రోడ్డుపై తాళ్ల పేట అటవీశాఖ చెక్ పోస్ట్ కవ్వాల రిజర్వ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ నిరంతరం తనిఖీలు ఉంటాయి.
ఈ నేపథ్యంలో దొంగలు గోదావరి నది దాటి ఈ దారిని ఎంచుకునే అవకాశం లేకపోవచ్చు. మంచిర్యాల జిల్లా దండేపల్లి ప్రాంత పరిధిలో తీరంలో వదిలిన బైక్, హెల్మెట్ గోదావరి నదిలో వదిలి, నక్కల పేట, దోనూర్, బీర్పూర్ తుంగూర్, తాళ్ల ధర్మారం కమ్మనూరు కలమడుగు బ్రిడ్జి నుండి మరో వాహనంలో పారిపోవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. కలమడుగు నుండి జన్నారం వైపు వెళ్లకుండా ఎడమ వైపు రోడ్డు గుండా దస్తురాబాద్ ఖానాపూర్, నిర్మల్ వైపు పారిపోవచ్చు అనేది వాదన.
ధర్మపురిలో సీసీ ఫుటేజ్ లు స్వాధీనం ?
నిన్న సాయంత్రం ప్రత్యేక పోలీస్ బలగాలు ధర్మపురి పట్టణానికి చేరుకొని ప్రధాన కూడళ్లలో, ఆర్యవైశ్య సత్రం, బ్రాహ్మణ సంఘ భవనం పరిసరాలలోని తెనుగువాడ తదితర ప్రదేశాలలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ లను స్వాధీన పరుచుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు పోలీస్ శాఖ విచారణ అనంతరం బహిర్గతం చేసే అవకాశం ఉంది.



