Wednesday, May 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ అభివృద్ధి

యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ అభివృద్ధి

- Advertisement -

రాష్ట్ర ఐటి శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు

యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షలతో కలిసి మంథనిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలను పెంపొందించాలనే లక్ష్యంతో టాస్క్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మల్టీమీడియా, ఆడియో విజువల్ రంగాల్లో శిక్షణ అందించబడుతుందని పేర్కొన్నారు.కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ ఎస్ డేటా సెంటర్ సంస్థ సహకారంతో యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌కు దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంథని వంటి ప్రాంతాలకు పరిశ్రమలను తీసుకురావడం సవాలుతో కూడుకున్నదని, ఇక్కడి యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు టాస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనిని సాధించడానికి యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి అకడమిక్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ పరిశ్రమలకు అవసరమైన కొన్ని నైపుణ్యాలలో లోపాలు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించామని తెలిపారు. మంథనిలోని టాస్క్ కేంద్రం కూడా ఇదే విధంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంపొందించి వారికి ఉద్యోగాలకు సిద్ధం చేస్తుందని వివరించారు. టాస్క్‌లో నమోదు చేసుకుని పలు శిక్షణ కోర్సులు పూర్తి చేసిన అనేక మంది విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించారని తెలిపారు.

ఇక్కడ మంచి కంపెనీలు శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని, యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జేఎన్టీయూ మంథనిని ఈ ప్రాంతానికి తీసుకువచ్చిందని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు తన బాధ్యతగా భావిస్తున్నానని, క్రమశిక్షణతో శిక్షణ పొందాలని సూచించారు. అలాగే మహిళల కోసం కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందగలరని అన్నారు. గంగాపురిలో రూ.7.3 కోట్ల వ్యయంతో ప్లగ్ అండ్ ప్లే గార్మెంట్స్ యూనిట్‌కు ఈరోజు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇది పూర్తయిన తర్వాత ఒకేసారి 400 మంది మహిళలకు శిక్షణ అందించవచ్చని, ఇది విజయవంతమైతే మరో యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడుగడ్డం వంశీకృష్ణ మాట్లాడారు ప్రతి నిరుద్యోగ యువకుడు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని, కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలు సాధ్యమవుతాయని గుర్తుంచుకోవాలని సూచించారు. మంథని పట్టణానికి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కూడిన శిక్షణ కేంద్రాలను తీసుకురావడమే లక్ష్యంగా టాస్క్ అడ్వాన్స్‌డ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అనేక ఉద్యోగాలు మార్పులకు లోనవుతున్నాయని, మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే యువత తప్పనిసరిగా ఏఐ వంటి ఆధునిక నైపుణ్యాలను అభ్యసిస్తూ కొత్త సాంకేతికతలను స్వీకరించాలని సూచించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ టాస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, మినిమమ్ వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, టాస్క్ చైర్మన్ నితిన్ కుమార్ రెడ్డి, కంట్రోల్  ఎస్ డేటా సెంటర్ సంస్థ డైరెక్టర్ రాజీవ్ త్రీవేది,ఏఎంసీ చైర్మన్ కె.వెంకన్న,ప్రజాప్రతినిధులు, అధికారులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -