ఈదురుగాలుల బీభత్సం.. కూలిన గోడ
వర్షంలో తడువకుండా రేకుల షెడ్డులోకి వెళ్లడంతోనే ొ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో విషాద ఘటన
మృతుల్లో తండ్రీకొడుకులు.. రైతు కుటుంబాలను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ రాస్తారోకో
నల్లగొండలో వలసకూలీ మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యానికి రక్షణగా వెళ్లిన రైతులు మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి బలయ్యారు. వర్షానికి తడవకుండా ఉండేందుకు పక్కనే ఉన్న రేకుల షెడ్డులో తలదాచుకోగా ఒక్క సారిగా గోడ కూలడంతో నలుగురు రైతులు మృతి చెందారు. మరి కొంతమందికి గాయాలయ్యాయి.ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో చోటుచేసుకుంది.
నవతెలంగాణ-లక్షెట్టిపేట
కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు వెంకటేష్(24)తో పాటు మరో ఐదుగురు రేకుల షెడ్డులో తలదాచుకోగా ఒక్కసారిగా గోడ కూలడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ప్రమాదంలో దండేపల్లి మండలం ముత్యం పేటకు చెందిన నెల్కి లచ్చన్న(55) సైతం మృతి చెందాడు. ఆయన తన కుమారుడిని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు లక్షెట్టిపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా భారీ వర్షంతో ఆ రేకుల షెడ్డులో తలదాచుకున్నాడు. ఈదురుగాలులకు గోడ కూలడంతో లచ్చన్న ప్రణాలు కోల్పోయాడు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. రక్షణ కోసం వెళ్తే ప్రాణాలు పోయాయంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
తండ్రీ కొడుకులు మృతి
మండలంలోని గంపలపల్లి గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు తనుగుల నాగరాజు, అభిరామ్ కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్ కవర్ కప్పేందుకు వెళ్లారు. వర్షం ఎక్కువవడంతో పక్కనే ఉన్న రేకులషెడ్డులోకి వెళ్లారు. ఈదురుగాలుల ధాటికి రేకులషెడ్డు కూలి తనుగుల అభిరాం(22) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన నాగరాజు(50)ను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
రైతుల మృతి బాధాకరం : ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
లక్షెట్టిపేట మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు రైతులు మృతి చెందడం విషాదకరమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. ప్రమాదంలో చనిపోయిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి తన తరపున రూ.2లక్షల తక్షణ సాయం అందిస్తున్నానని, క్షతగాత్రులకు ప్రభుత్వం తరుపున మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. ప్రభుత్వం తరపున బాధిత రైతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.
ఉత్కూర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ రాస్తారోకో
గోడ కూలి మృతి చెందిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్‌ఎస్ నాయకులు బాధిత రైతు కుటుంబ సభ్యులతో కలిసి ఊత్కూర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. ముందుగా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్‌రావుతో కలిసి రైతుల మృతదేహాలను సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ పంటలను కొనుగోలు చేయకపోవడం వల్ల జరిగిన ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంచిర్యాల ఎమ్మెల్యే, జిల్లా అధికారుల అనాలోచిత చర్య వల్లే ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు వెంటనే రూ.50లక్షల ఎక్స్‌్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌లో విషయం తెలియజేయగా మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. సుమారు 6గంటల పాటు రాస్తారోకో చేశారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్, అదనపు కలెక్టర్ రాములు ధర్నా స్థలానికి చేరుకుని మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరపున సాయం అందించేలా కృషి చేస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. 6గంటలకుపైగా రాస్తారోకో జరగడంతో కరీంనగర్, ఆదిలాబాద్ వైపు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
తిప్పర్తిలో వలస కూలీ మృతి
రెండ్రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి గోడ కూలి వలసకూలీ మృతి చెందాడు. మరో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… జార్ఖండ్‌కు చెందిన వలస కూలీలు నల్లగొండ పట్టణంలోని మాన్యం చెల్కలో నివాసం ఉంటున్నారు. రెండ్రోజుల క్రితం గాలి వాన సమయంలో వలస కూలీలు తిప్పర్తి మండల కేంద్రంలో గోడ కింద ఆశ్రయం తీసుకున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా కూలీలపై ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎండి సోను (25) హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు కూలీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది.
పోస్ట్‌మార్టంపై గందరగోళం
గోడ కూలి మృతిచెందిన వలసకూలీ పోస్టు మార్టం అఫ్జల్‌గంజ్ పోలీసుల పరిధిలోనా లేక తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోనా అనేది అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో కుటుంబ సభ్యులు అయోమయంలో ఉన్నారు. కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.



