Thursday, May 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్ కు గడ్డు కాలం

కాంగ్రెస్ కు గడ్డు కాలం

- Advertisement -

సంతృప్తినివ్వని కేరళం విజయంఇతర రాష్ట్రాల్లో 
ఘోర పరాజయాలుపార్టీ నాయకత్వంపై అసంతృప్తులుబలహీనమైన వ్యవస్థ.. 
అంతర్గత విభేదాలుదేశవ్యాప్తంగా క్షీణిస్తున్న పట్టు.. సంక్షోభంలోకి హస్తం పార్టీపార్టీ పునరుద్ధరణకు ఆత్మ పరిశీలన అవసరం : రాజకీయ నిపుణులు

న్యూఢిల్లీ : ఈనెల 4న ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్ని కల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్.. కేరళంలో అధికారంలోకి రాగలిగింది. అయితే అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలలో మాత్రం దారుణంగా విఫలమైంది. అక్కడ ఆ పార్టీ గణనీయమైన స్థానాలను దక్కించుకోలేక చతికలపడిపోయింది. దీంతో కేరళంలో విజయం సాధించామన్న ఆనందం కూడా ఆ పార్టీకి లేకుండా పోయిందని విశ్లేషకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులకు ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయని చెప్తున్నారు.

వందేండ్లకు పైగా చరిత్ర కలిగి, ఒకప్పుడు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్ప్పుడు అనేక రాష్ట్రాల్లో ఉనికి కోసం పాకులాడుతోంది. ఇందుకు ఆయా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార బీజేపీకి ధీటుగా ఎదుర్కోలేకపోవడం, అంతర్గత విభేదాలు, పార్టీ నాయకత్వంపై పెరుగుతున్న విమర్శలు.. దేశవ్యాప్తంగా హస్తం పార్టీని మరింత కుచించుకుపోయేలా చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. కేరళంలో యూడీఎఫ్ విజయం సాధించిన కొద్దిసేపటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించారు. పార్టీ కార్యకర్తలను అభినందించారు. కానీ ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి సంతోషానివ్వలేకపోయిందనిని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్, పవన్ ఖేరా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా రద్దు కావడం.. ఇతర రాష్ట్రాల్లో నిరాశాజనక ఫలితాలే దీనికి నిదర్శనమని అంటున్నారు.

ఆ మూడింటిలో సింగిల్ డిజిట్‌కే..
పశ్చిమ బెంగాల్(2), తమిళనాడు(5), పుదుచ్చేరి(1)లలో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమమైంది. అసోం (19)లో ఆశించిన స్థాయిలో ప్రదర్శనను కనబర్చలేకపోయింది. ఇక కేరళంలో వచ్చిన విజయం కూడా కాంగ్రెస్ పార్టీ బలంతో రాలేదనీ, సిట్టింగ్ ప్రభుత్వాలపై సహజంగానే ప్రజలలో వ్యతిరేకత ఉంటుందనీ, ఇదే హస్తం పార్టీకి కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాగా కేరళంను.. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ సర్కారు 2016 నుంచి వరుసగా రెండు సార్లు పాలించి రికార్డు సృష్టించిన విషయం విదితమే. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇండియా బ్లాక్‌లో విభేదాలు, బలహీనమైన సంస్థాగత నిర్మాణం, అంతర్గత పోటీ, విశ్వసనీయత లోపించడం వంటివి కాంగ్రెస్ పార్టీ స్థితిని దెబ్బతీస్తున్నాయని వివరిస్తున్నారు.

లోక్‌సభ ఊపును కొనసాగించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ
2024 లోక్‌సభ ఎన్ని కల్లో ఇండియా బ్లాక్ ఐక్యత బీజేపీని నిలువరించడంలో విజయం సాధించింది. కమలం పార్టీఁ 240 స్థానాల వరకే పరిమితం చేయగలిగింది. 99 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఇందులో కీలక పాత్ర పోషించింది. ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ) కాగలిగాడు. అయితే 2024 లోక్‌సభ ఎన్ని కల్లో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ.. అదే ఊపును దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కొనసాగించలేపోయింది.

పలు రాష్ట్రాల్లో విఫలం
అధికార బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ.. హర్యానాలో అధికారంలోకి రావడానికి హస్తం పార్టీ సరైన ప్రణాళికలు రచించలేకపోయింది. మహారాష్ట్రలో గణనీయమైన సంఖ్యలో లోక్‌సభ స్థానాలను సొంతం చేసుకున్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్ని కల్లో మాత్రం విఫలమైంది. బీహార్‌లో జేడీ(యూ) చీఫ్, ఆ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇండియా బ్లాక్‌ను వీడటంతో ఇక్కడి అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశాలను కోల్పోయింది. ఢిల్లీ, ఒడిశా, ఏపీలో కాంగ్రెస్ ప్రభావం దాదాపు లేదనే చెప్పాలి.

పార్టీపై సొంత నేతల అసంతృప్తులు
ఒక సీనియర్ కాంగ్రెస్ నేత అభిప్రాయం ప్రకారం.. రాహుల్ గాంధీకి వెళ్లే సమాచారం వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందని విమర్శించారు. కొంత మంది నాయకులు నిజమైన ఫీడ్‌బ్యాక్‌ను ఆయనకు చేరకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. “ ఎన్ని కలు గెలవడం అంటే ప్రజలతో సంబంధం, బలమైన వ్యవస్థ అవసరం. ప్రస్తుతం ఈ రెండూ కాంగ్రెస్‌లో లేవు” అని ఆయన చెప్పారు.

‘దక్షిణ భారత పార్టీ’గా ముద్ర!
ఒకప్ప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాలను ఏలిన కాంగ్రెస్ ప్రస్తుతం కర్నాటక, కేరళం, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లలో మాత్రమే అధికారంలో ఉంది. దీంతో పార్టీ ‘దక్షిణ భారత పార్టీ’గా మారిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఒక సమగ్ర జాతీయ శక్తిగా కాకుండా.. రాష్ట్ర యూనిట్ల సముహంగా మారిందఁ నిపుణులు అంటున్నారు.

కేరళంలో పరిస్థితి
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గానూ యూడీఎఫ్ 102 సీట్లు గెలిచింది. ఇందులో కాంగ్రెస్ 63 సీట్లు సాధించింది. ఈ విజయం ప్రధానంగా ప్రజలు మార్పును కోరిన ఫలితంగా వచ్చిందిగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవిపై పార్టీలో అంతర్గత పోటీ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ కర్నాటక తరహా పరిస్థితులే ఏర్పడే ప్రమాదం ఉందని చెప్తున్నారు.

అసోంలో ప్రతిపక్షానికే పరిమితం
అసోంలో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. అక్కడ గౌరవ్ గొగోయ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తెచ్చినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. వివిధ ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టినప్పటికీ.. వ్యూహం అమలులో విఫలమైందఁ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో దారుణం
ఇక్కడ ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మరింత వెనుకబడింది. మమతా బెనర్జీతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇండియా బ్లాక్‌లోని ఇతర పార్టీలు మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి మద్దతు ఇవ్వగా.. కాంగ్రెస్ మాత్రం ఒంటరైంది.

తమిళనాడులో ఐదు సీట్లే..!
234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో హస్తం పార్టీ ఐదు సీట్లకే పరిమితమైంది. అధికార డీఎంకే కూటమిలో ఉన్నప్పటికీ.. తమిళ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే రాకతో అక్కడి సమీకరణాలు మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మారుతన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ డీఎంకేతో ఉంటుందా? లేదా టీవీకేతో చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటు వైపు పావులు కదుపుతుందా అనేది వేచి చూడాలి. మోడీ నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం తప్పక అవసరమనీ, ఇందుకు లోతైన ఆత్మపరీశీలన చేసుకోవాలని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -