సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ లేపింది. సొంతగడ్డపై నాల్గో విజయం సాధించిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించింది. పరుగుల వరద పారిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 33 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. 236 పరుగుల రికార్డు ఛేదనలో కూపర్ కానొలి (107 నాటౌట్) అజేయ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా పంజాబ్ కింగ్స్ 202 పరుగులే చేసింది. క్లాసెన్ (69), ఇషాన్ కిషన్ (55) అర్థ సెంచరీలతో కదం తొక్కటంతో సన్‌రైర్స్ హైదరాబాద్ తొలుత 235 పరుగుల భారీ స్కోరు చేసింది. సీజన్లో 11 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు ఇది ఏడో విజయం కాగా.. పది మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్‌కు హ్యాట్రిక్ పరాజయం.
పంజాబ్ కింగ్స్‌పై భారీ విజయం
రాణించిన క్లాసెన్, ఇషాన్ కిషన్
ఛేదనలో కూపర్ అజేయ సెంచరీ వృథా
హైదరాబాద్
235/4,
పంజాబ్ కింగ్స్
202/7
నవతెలంగాణ-హైదరాబాద్
పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజా విసిరింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించటంతో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 236 పరుగుల ఛేదనలో కూపర్ కానొలి (107 నాటౌట్, 59 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. సన్‌రైజర్స్ బౌలర్లు విజృంభించటంతో 63/4తో తొలి పది ఓవర్లలోనే ఓటమి కోరల్లో కూరుకున్న పంజాబ్ కింగ్స్‌ను కూపర్ ఆదుకున్నాడు. ప్రియాన్షు ఆర్య (1), ప్రభుసిమ్రన్ సింగ్ (3), శ్రేయస్ అయ్యర్ (5) నిరాశపరిచారు. 20 ఓవర్లలో 7 వికెట్లకు పంజాబ్ కింగ్స్ 202 పరుగులే చేసింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (69, 43 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (55, 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. అభిషేక్ శర్మ (35, 13 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్‌లు), ట్రావిశ్ హెడ్ (38, 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీశ్ కుమార్ రెడ్డ (29 నాటౌట్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో కదంతొక్కారు. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
పంజాబ్ చతికిల
ఐపీఎల్‌లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన ఘనత పంజాబ్ కింగ్స్ సొంతం. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌పై 220 పరుగుల లక్ష్యాన్ని సైతం అలవోకగా ఊదేసింది. దీంతో 236 పరుగుల లక్ష్యం పంజాబ్ కింగ్స్‌కు పెద్ద కష్టమేమీ కాదనే అంచనాలు. కానీ సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇన్నింగ్స్ ఆరో బంతికే బ్రేక్ అందించాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రియాన్షు ఆర్య (1)ను అవుట్ చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి..తన తొలి ఓవర్లో ప్రభుసిమ్రన్ సింగ్ (3)ను అవుట్ చేశాడు. దీంతో 4 పరుగులకే పంజాబ్ కింగ్స్ ఓపెనర్లను కోల్పోయింది. ఈషన్ మలింగ సైతం వికెట్ల వేట మొదలెట్టగా శ్రేయష్ అయ్యర్ (5) డగౌట్‌కు చేరుకున్నాడు. 23/3తో పంజాబ్ కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో మార్కస్ స్టోయినిస్ (28), కూపర్ కానొలి పవర్‌ప్లేలో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. సకిబ్ హుస్సేన్‌పై విరుచుకుపడిన స్టోయినిస్ అతడి ఓవర్లో 19 పరుగులు పిండుకున్నాడు. శివాంగ్ కుమార్‌పై ఓ భారీ సిక్సర్ బాది.. అతడికే వికెట్ కోల్పోయాడు. అప్పటికి పంజాబ్ కింగ్స్ స్కోరు 63/4.
కూపర్ అజేయ సెంచరీ
భారీ లక్ష్యం. సహచర బ్యాటర్లు అందరూ నిష్క్రమించారు. సాధించాల్సిన్ రన్‌రేట్ ఆకాశంలో ఉంది. ఈ సమయంలో కూపర్ కానొలి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. గెలుపు అవకాశాలు లేకపోయినా.. బాధ్యతాయుత అర్థ సెంచరీతో పంజాబ్ కింగ్స్ నెట్‌రన్‌రేట్ వెనుకంజ వేయకుండా చూశాడు. ఓ దశలో 26 బంతుల్లో 40 పరుగులు చేసిన కూపర్.. ఆ తర్వాత సింగిల్స్‌కు పరిమితం అయ్యాడు. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 బంతుల్లో కూపర్ అర్థ సెంచరీ సాధించాడు. సూర్యాన్షు షెడ్జె (25), శశాంక్ సింగ్ (4) నిరాశపరిచారు. 119/6తో నిలిచిన పంజాబ్ కింగ్స్‌ను కూపర్ ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లాడు. ఫీల్డర్లు క్యాచ్‌లు నేలపాలు చేయటం కూపర్‌కు కలిసొచ్చింది. 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 57 బంతుల్లో కూపర్ సెంచరీ సాధించాడు. కూపర్ శతక షోతో పంజాబ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్, పాట్ కమిన్స్, ఈషన్ మలింగ, నితీశ్ కుమార్ రాణించారు.
ఓపెనర్ల శుభారంభం
ఉప్పల్ పిచ్‌పై టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (35), ట్రావిశ్ హెడ్ (38) అదిరే ఆరంభం అందించారు. సిక్సర్‌తో ఖాతా తెరిచిన అభిషేక్ శర్మ.. అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్‌లపై విరుచుకుపడ్డాడు. యాన్సెన్ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో దండయాత్ర చేశాడు. అర్ష్‌దీప్ సింగ్‌పై ట్రావిశ్ హెడ్ చెలరేగాడు. అతడి ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో మెరిశాడు. లాకీ ఫెర్గుసన్‌కు సిక్సర్‌తో స్వాగతం పలికిన అభిషేక్ శర్మ అతడి ఓవర్లోకి బంతిని గాల్లోకి లేపి నిష్ర్కమించాడు. 3.3 ఓవర్లలో 54 పరుగులకు సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ట్రావిశ్ హెడ్ మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో జోరందుకున్నా చాహల్ మాయకు వికెట్ కోల్పోయాడు. అప్పటికి సన్‌రైజర్స్ స్కోరు 6.4 ఓవర్లలో 84 పరుగులు.
క్లాసెన్, కిషన్
ఖతర్నాక్ షో
ఓపెనర్లు శుభారంభం అందించగా, ఇషాన్ కిషన్ (55), హెన్రిచ్ క్లాసెన్ (69) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. కిషన్, క్లాసెన్ జోడీ మూడో వికెట్‌కు 48 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. ఇషాన్ కిషన్‌కు పలుమార్లు జీవనదానం లభించింది. అవకాశాలను సద్వినియోగం చేసుకున్న కిషన్ కీలక భాగస్వామ్యం నిర్మించాడు. విజయ్ కుమార్ వైశాక్ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు. ఫైన్‌లెగ్, స్ట్రయిట్‌డౌన్, లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్లు సంధించి 28 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. క్లాసెన్ కాస్త నెమ్మదిగా మొదలెట్టినా.. మరో ఎండ్‌లో కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి (29 నాటౌట్) స్వేచ్ఛగా ఆడేలా చేశాడు. అర్థ సెంచరీ తర్వాత కిషన్ అవుటైనా.. నితీశ్ కలిసి క్లాసెన్ జోరు కొనసాగించాడు. నాల్గో వికెట్‌కు 32 బంతుల్లోనే 63 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 32 బంతుల్లో క్లాసెన్ అర్థ సెంచరీ సాధించాడు. నితీశ్ కుమార్ రెడ్డి.. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటర్లు అందరూ సమిష్టిగా మెరవటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గుసన్, యుజ్వెంద్ర చాహల్ తలా ఓ వికెట్ పడగొట్టారు. మార్కో యాన్సెన్ 4 ఓవర్లలో 61 పరుగులు ఇవ్వగా.. విజయ్‌కుమార్ 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
సన్‌రైజర్స్ హైదరాబాద్ : 235/4 (హెన్రిచ్ క్లాసెన్ 69, ఇషాన్ కిషన్ 55, ట్రావిశ్ హెడ్ 38, యుజ్వెంద్ర చాహల్ 1/32)
పంజాబ్ కింగ్స్ : 202/7 (కూపర్ కానొలి 107, మార్కస్ స్టోయినిస్ 28, పాట్ కమిన్స్ 2/34, శివాంగ్ కుమార్ 2/45)
…………………
పంజాబ్ చెత్త ఫీల్డింగ్!
పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో ముందంజలో కొనసాగుతున్నా.. పేలవ ఫీల్డింగ్ ఆ జట్టును తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఐపీఎల్19లో ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ ఏకంగా 16 క్యాచ్‌లు నేలపాలు చేసింది. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు పంజాబ్ కింగ్స్ మూడు సార్లు జీవనదానం అందించింది. చాహల్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో కిషన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను కూపర్ వదిలేశాడు. చాహల్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో లాకీ ఫెర్గుసన్ ఓ క్యాచ్ నేలపాలు చేయగా.. అదే ఓవర్లో వికెట్ కీపర్ ప్రభుసిమ్రన్ సింగ్ సింపుల్ స్టంపౌట్ అవకాశాన్ని జారవిడిచాడు. మిస్‌ఫీల్డింగ్, క్యాచ్‌లు నేలపాలు కావటం ‘ వైరస్’లా వ్యాపిస్తుందని ఆ జట్టు చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ అసహనం వ్యక్తం చేశాడు.



