Thursday, May 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపంటల కొనుగోళ్ల ఆలస్యంపై

పంటల కొనుగోళ్ల ఆలస్యంపై

- Advertisement -

రైతుల ఆగ్రహం
లారీలు రాక.. మిల్లులకు వెళ్లని ధాన్యం
వర్షానికి తడిసి ముద్దయిన పంట
తడిసిన ధాన్యం వెంటనే కొనాలని డిమాండ్‌
కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రాస్తారోకోలు

నవతెలంగాణ-భిక్కనూర్‌/ జగదేవపూర్‌
ధాన్యం కాంటాలు వేయడమే ఆలస్యమంటే.. లారీలు లేక కాంటా వేసిన పంటనూ తరలించడం లేదని, అకాల వర్షంతో పంటంతా తడిసి ముద్దవుతోందని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. వెంటనే సరిపడా లారీలు ఏర్పాటు చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ బుధవారం కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రాస్తారోకోలు చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలం కాచాపూర్‌ గ్రామంలో వారం రోజుల నుంచి తూకం వేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేపట్టారు. లారీల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, తూకం వేసిన ధాన్యం బస్తాలను రైస్‌ మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు గ్రామానికి చేరుకొని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే రైస్‌ మిల్లుకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఆందోళన చెందొద్దని రైతులకు నచ్చజెప్పారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం.. తడిసి ముద్దయిన ధాన్యం
ధాన్యం కొనుగోళ్లు జరపడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమ ధాన్యం తడిసి ముద్ద అయిందని.. ఇప్పటికైనా వెంటనే కొనుగోలు చేయాలంటూ సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం చాట్లపల్లి గ్రామ రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు.. మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తడిసిముద్దయిందన్నారు. 20 రోజులుగా కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది వర్షానికి పూర్తిగా తడిసి పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు జంబుల శ్రీనివాస్‌ రెడ్డి, దుర్గయ్య మద్దతు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -