Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిశ్వనగరానికి 'పచ్చని' కిరీటం

విశ్వనగరానికి ‘పచ్చని’ కిరీటం

- Advertisement -

ప్రకృతి ఒడిలో భాగ్యనగరం
ఈ ఏడాది 4.5కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
మొక్కల మనుగడపై ప్రత్యేక నిఘా..
హుస్సేన్ సాగర్ తీరానికి కొత్త శోభ
ఓఆర్ఆర్ వెంట అదనపు డ్రిప్ లైన్లు
అతిపెద్ద ఏవియరీతో కొత్వాల్‌‌గూడ ఎకో పార్క్
213 అర్బన్ పార్కుల అభివృద్ధికి పక్కా ప్రణాళిక
హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి గోపిడీ
నవతెలంగాణ-సిటీబ్యూరో

‌హైదరాబాద్‌ ‌నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ వింగ్ అడుగులు వేస్తోంది. కొన్నేండ్లుగా పచ్చదనం పెంపునకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ క్రమంలో తన విభాగం సాధించిన విజయాలను, భవిష్యత్‌ ప్రణాళికలను బుధవారం హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి గోపిడీ వివరించారు. ఆయనతో జరిగిన ప్రత్యేక ముఖాముఖి సారాంశం ఇలా ఉంది..

​రికార్డు స్థాయిలో పచ్చదనం
గతేడాది(2025-26) మేము 4.5 కోట్ల మొక్కల నాటడమే లక్ష్యంగా పెట్టుకోగా, 3కోట్ల 25 లక్షల 32 వేల మొక్కలను నాటినట్టు డైరెక్టర్‌ ‌రోహిత్‌‌రెడ్డి తెలిపారు. వాటి సంరక్షణ బాధ్యతను కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. ‘‘2026-27 సంవత్సరానికిగాను 4.5కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నాం. నగరవ్యాప్తంగా తమ 42 నర్సరీల్లో ప్రస్తుతం 4.5 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కేవలం అడవుల్లోనే కాకుండా, ఇనిస్టిట్యూషనల్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, సెంట్రల్ మీడియన్ల కోసం ఉపయోగపడుతున్నాయి. నగర శివార్లలో 26 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను ‘లంగ్ స్పేసెస్’గా తీర్చిదిద్దుతున్నాం..’’ అని తెలిపారు.

​పార్కుల ఆధునీకరణ
‘కొత్వాల్‌‌గూడ ఎకో పార్క్ మా విభాగం సాధించిన అతి పెద్ద విజయం. ఆసియాలోనే అతిపెద్ద పక్షుల ప్రదర్శనశాల (ఏవియరీ) ఇక్కడ ఉంది. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్దది కావడం విశేషం. మొత్తం 4.8 ఎకరాల్లో విస్తరించిన ఇందులో 25 జాతులకు చెందిన 7వేల పక్షులు ఉన్నాయి.188 రకాల స్వదేశీ, విదేశీ వృక్ష జాతులతో దీనిని తీర్చిదిద్దాం’ అని డైరెక్టర్‌ వివరించారు. కోర్ ఏరియాలో 213 పార్కులను గుర్తించగా, అందులో 23 ప్రధాన పార్కులను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది.. ఇప్పటికే 18 పార్కులు పూర్తయ్యాయి.. మిగిలిన 5 పార్కుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కాగా, ఐరా రియల్టీ, వారధి ట్రస్ట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి సంస్థల సహకారంతో 5 ప్రధాన పార్కుల నిర్వహణ చేపడుతున్నామని, దీనివల్ల ప్రభుత్వానికి సుమారు రూ.5.79 కోట్ల మేర ఖర్చు తగ్గుతుందని వివరించారు. నిజాంపేట్, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో చెరువుల సుందరీకరణ చేపట్టామని చెప్పారు.

​ట్రాన్స్‌‌లోకేషన్‌‌లో మెరుగైన ఫలితాలు
ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ సమయంలో చెట్లను నరకకుండా ట్రాన్స్‌లోకేషన్ చేస్తున్నామని డైరెక్టర్‌ ‌రోహిత్‌‌రెడ్డి తెలిపారు. ఎన్‌హెచ్-44, ఎస్‌హెచ్-1 పరిధిలో తరలించాల్సిన 4,200 చెట్లలో ఇప్పటికే 1,520 చెట్లను విజయవంతంగా మరో ప్రాంతాల్లో నాటామని చెప్పారు.

​అంతర్జాతీయ గుర్తింపులు.. అవార్డుల పంట
హైదరాబాద్ నగరం వరుసగా ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏఐపీహెచ్ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు-2022తో పాటు, గార్డెన్ ఫెస్టివల్-2024లో 8అవార్డులను హెచ్ఎండీఏ గెలుచుకుందని, ఇది మా బృందం కృషికి దక్కిన గౌరవమని చెప్పారు.
​సాగర్ తీరానికి కొత్త కళ
హుస్సేన్ సాగర్ ప్రక్షాళనపై ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఉన్న సంజీవయ్య పార్కు, లుంబినీ పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు, రోజ్ గార్డెన్, క్యాక్టస్ గార్డెన్లలో కొత్త మొక్కలు నాటుతున్నామన్నారు. హుస్సేన్ సాగర్ నీటిని శుద్ధి చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వాడబోతున్నట్టు తెలిపారు. సైక్లింగ్ ట్రాక్స్, బోర్డ్వక్స్ తో సాగర్ తీరాన్ని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు.​​ఓఆర్ఆర్‌‌పై ట్యాంకర్ల
ఇబ్బందుల తొలగింపు
ఓఆర్ఆర్ వెంట 158 కిలోమీటర్ల గ్రీన్ కారిడార్ నిర్వహణలో భాగంగా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని డైరెక్టర్‌ తెలిపారు. నీటి ట్యాంకర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అదనంగా రెండు డ్రిప్ లైన్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రస్తుతం 93 సంపుల ద్వారా ప్రతిరోజూ సుమారు కోటి లీటర్ల నీటిని డ్రిప్ విధానంలో మొక్కలకు అందిస్తు న్నామని వెల్లడించారు. నీటి కొరతను అధిగమించేందుకు కోకాకోలా కంపెనీ తమ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తామనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -