తీవ్రతరం అవుతున్న సంక్షోభంతో కారుమేఘాలు దేశ గగనతలంపై కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగం, వేతనాల ప్రతిష్టంభన జంట సంక్షోభాలై వుండగా అదనంగా ధరల పెరుగుదల అంచనాలు హడలగొడు తున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని గొలుసుకట్టు ప్రభావం కనిపిస్తున్నాయి. ఇంధనం, ఎరువుల ధరలు మండిపోతుంటే ఆహార సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమై అవీ ధరలు పెరుగుతున్నాయి. వీటి ఛాయలు ఇప్పటికే ఇండియాపై పడ్డాయి. మోడీ సర్కారు అమెరికా-ఇజ్రాయిల్ కూటమితో ఇప్పటికే సన్నిహితమై పోయింది. ఇరాన్‌పై దాడి మొదలవనున్న తరుణంలోనే మోడీ ఆ దేశ పర్యటన జరపడం ద్వారా తొలి దాడి నేరంలో పాలుపంచుకోవడమైంది. ఎందుకంటే యుద్ధానికి పూర్తి బాధ్యత అమెరికా, ఇజ్రాయిల్ లదేనని అందరికీ అర్థమైంది. చౌకగా లభించే రష్యా చమురు సహజ వాయువు కొనవద్దని ట్రంప్ తెచ్చిన ఒత్తిడికి ప్రభుత్వం అంతకు ముందే లొంగిపోయింది. కనుక ఇప్పుడు సామాన్య ప్రజల కడగండ్లు మోడీ ప్రభుత్వ లొంగుబాటు విదేశాంగ విధానం వల్ల మరింత తీవ్రతరమయ్యాయని చెప్పాలి. మలి దశలో అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణకు అంటకాగడం దాని కొనసాగింపా?
ఎన్నికలు కాగానే వేటు
పెట్రోలియం ఉత్పత్తులపై తాను విధించిన దారుణ సుంకాలను మోడీ ప్రభుత్వం కేవలం రూ.10 మాత్రమే తగ్గించింది. అది చాలావరకూ చమురు కంపెనీలకే మేలు చేస్తుంది. ఈ నెలలో వాణిజ్య ఎల్.పి.జి సిలిండర్ ధర రూ.933కు పెంచగా గృహావసర ఎల్.పి.జి సిలిండర్ రేటు మార్చిలో 60 రూపాయలు పెంచబడింది. అయితే అక్రమ నిల్వలు, నల్ల బజార్‌పై కనీస నిఘా లేకపోవడంతో గృహావసర సిలిండర్లను అక్రమంగా రూ.3వేలు-రూ.4వేల వరకూ అమ్ముతున్నారు. గత 44 నెలల్లో ముడి వస్తువుల ధరలు అత్యంత వేగంగా పెరిగాయని పరిశ్రమల నిపుణులు చెబుతున్నారు. ఇక తుది ఉత్పత్తి సరుకుల ధరలు ఆరు నెలల్లో అందుకోలేనంత వేగంగా పెరిగిపోయాయి. శాసనసభల ఎన్నికలు ముగిసేవరకూ మోడీ ప్రభుత్వం వివిధ రకాల ధరల పెంపును పక్కన పెట్టింది. ఇప్పుడు ఆ ఫలితాలు వెలువడ్డాయి గనక ద్రవ్యోల్బణం చుక్కలు తాకొచ్చు. ఈ ఏడాది చివరి దశలో ఎలనినో దెబ్బ వుండొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దానివల్ల ఆహార పంటలకు ఆటంకాలు కలగొచ్చు. ఇప్పటికే వీటి ప్రభావం ఎక్కువగానే గోచరిస్తున్నన్నది. మోడీ, ఆయన మంత్రిబృందం ఈ విషయం తెలియనంత అజ్ఞానంలో లేరు. కాకపోతే వారికి పొంచివున్న ముప్పు ఏమాత్రం పట్టలేదు.
దారుణ నిరుద్యోగం
దేశంలో ఉద్యోగాల లేమి ఉధృతి వల్ల ద్రవ్యోల్బణం కుటుంబాలకు మరింత ప్రాణాంతకంగా పరిణమించింది. వర్తమాన ఉద్యోగ లెక్కలు పరిశీలించే మాసపత్రిక చెప్పే ప్రకారం ఈ ఏడాది నిరుద్యోగ రేటు గత ఏడాది లాగే 5.1 శాతం వుంది. పట్టణ ప్రాంతాలలో ఇది 6.8 శాతంగా వుంది. ఇప్పుడు వారాల ప్రకారం వేసే ఉద్యోగ లెక్కలలో గతవారం ఒక గంట పనిచేసి వుంటే ఉద్యోగం వున్నట్టే భావించాలి. ఈ రోజున వున్న నిరుద్యోగ సేనను బాగా కుదించి చూపేందుకే హాస్యాస్పదమైన ఈ నిర్వచన పద్ధతి తీసుకొచ్చారు. దేశంలో పట్టభద్రులైన తాజా ఉద్యోగ పరిస్థితి గురించి అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ రూపొందించిన నివేదిక ప్రకారమైతే ఈ వివరాలు చాలా ఆందోళనకరంగా వున్నాయి. 15-25 ఏళ్ల మధ్య వారిలో 40 శాతం, 25-29 ఏళ్ల మధ్య వారిలో 20 శాతం నిరుద్యోగులుగా వున్నారు. యువ శ్రామిక బలగం ఎక్కువగావుండటం ఎంతో లాభదాయకమంటూ టముకు వేసుకుంటున్న ప్రచారాల బండారాన్ని ఈ నివేదిక చావుదెబ్బ కొట్టింది. 2030తో ఇది తారాస్థాయికి చేరుతుందనీ తర్వాత శ్రమ చేసే వయస్కుల నిష్పత్తి తగ్గుదల మొదలవుతుందని అది హెచ్చరిస్తోంది. దీనివల్ల కలగాల్సిన ప్రయోజనాలను చేజార్చుకోవడానికి పూర్తి బాధ్యత, నేరపూరిత నిర్లక్ష్యం పూర్తిగా మోడీ సర్కారుదే. ఉద్యోగ కల్పనను ఈ సర్కారు ఘోరంగా ఉపేక్షించింది.
ఆదాయాల క్షీణత
ఇక ఆర్థిక సౌభాగ్యాఁకి సంబంధించిన మరింత ప్రాథమికమైన అంశం ఆర్జనలు, ఆదాయాలు క్షీణించి పోవడం. 2025కు సంబంధించి అదే పి.ఎల్.ఎఫ్.ఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం శ్రామిక బలగంలో పాతిక శాతం కన్నా కొంచెం తక్కువ (ఖచ్చితంగా చెప్పాలంటే 23.4 శాతం)గా నిర్ణీత ఉపాధి పొందుతున్నారు. అంటే వారికి క్రమబద్ధమైన జీతం, వేతనం వుంటాయి. కాని ప్రజలలో అత్యధిక భాగం (56.2 శాతం) స్వయం ఉపాధిలో వున్నారు. వీరిలో వ్యవసాయ కార్మికులు, సర్వీసు రంగంలో శ్రమను అమ్ముకునే లక్షలాది మంది చేరి వున్నారు. 20 శాతం కన్నా కాస్త ఎక్కువ మంది క్యాజువల్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ మూడు రకాల శ్రమ జీవులకు సగటున లభించే ఆదాయం ఎంతో తెలుసా? ఒక లెక్క ప్రకారం పనిచేసే వారిలో 64 శాతం కన్నా ఎక్కువ మంది కనీస వేతనాలు పొందలేకపోతున్నారు. 2022-25 మధ్య క్రమబద్ధమైన వేతనాలు, జీతాలు 1.2 శాతం పెరుగుదల మాత్రమే వార్షిక పెరుగుదల నమోదైంది.
అదే క్యాజువల్ కార్మికులకైతే కేవలం 0.5 శాతం పెరుగుదల మాత్రమే వుంది. స్వయం ఉపాధిలో వారికి ఒక శాతం పెరిగింది. మోడీ ప్రభుత్వ పన్ను రాయితీ పందేరాలు, ప్రోత్సాహకాలు, రుణాల మాఫీల వల్ల ఒక వైపున కార్పొరేట్ ప్రపంచం అలవిమాలిన లాభాలు పోగేసుకుంటుంటే, బిలియనీర్ల సంఖ్య పెరిగిపోతుంటే మరోవైపున తక్కువ ఆదాయాలు లేక అసలు ఆదాయమే లేకపోవడం భారతీయ కార్మికులకు భారంగా మారింది. బహుశా ఈ సంక్షోభంలో అత్యంత విషాదకరమైంది, ఆగ్రహం తెప్పించేది ఏమంటే…ప్రజల కష్టనష్టాల పట్ల, బాధల పట్ల ప్రస్తుత ప్రభుత్వ నిర్లిప్త వైఖరి. దాని అధికార దాహం, సంపన్నులకు అంకితమైన దాని సేవలు ఎంత తీవ్రంగా వున్నాయంటే…దేశ, విదేశీ కార్పొరేట్ ఆసాముల మెప్పు కోసం దేశ రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను ధ్వంసం చేసి ప్రజాస్వామిక హక్కులు కాలరాచి వేసేంత. ఈ క్రమంలో అది విద్వేషం, విభజన బీజాలు నాటుతున్నది. అవి దేశ సామాజిక చట్రాన్ని చిద్రం చేసే ప్రమాదం పొంచి వుంది. భారత దేశ గతం, ప్రస్తుతం, భవిష్యత్తులను కాపాడాలంటే అది ప్రజల సమైక్య శక్తి ద్వారానే సాధ్యమవుతుంది. (మే 6 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
భయానక ఆర్థిక సంక్షోభం – సర్కారు నిర్లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



