ఒక మనిషి ఈ దేశానికి చెందినవాడని నిర్ణయించేది ఏమిటి? ఒక పత్రమా? లేక అతని జీవితమా?” ఈ ప్రశ్న కేవలం తాత్వికమైనది కాదు. నేడు భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన ప్రశ్నల్లో ఒకటి. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రారంభమైన నేపథ్యంలో ఈ ప్రశ్న మరింత ప్రాసంగికంగా మారింది. ఎన్నికల జాబితాలో కచ్చితత్వాన్ని నిర్ధారించడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, ఒకటి కంటే ఎక్కువ నమోదులను సరిచేయడం, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం… ఇవి ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన రాజ్యాంగ బద్ధమైన బాధ్యతలే. ఆ బాధ్యతను ఎవరూ ప్రశ్నించరు. అయితే ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ న్యాయబద్ధతను దాని ఉద్దేశం మాత్రమే నిర్ణయించదు. ఆ ప్రక్రియ అమలు వల్ల ఎవరి హక్కులు పరిరక్షించబడుతున్నాయి? ఎవరు నష్టపోతున్నారు? అనేదే నిర్దారిస్తుంది. ఇక్కడే SIRపై చర్చ పరిపాలనా అంశం నుంచి రాజ్యాంగ పరమైనదిగా మారుతుంది. ఎన్నికల జాబితా కేవలం ఓట్ల లెక్క కాదు. అది ఈ గణతంత్ర రాజకీయ సమాజంలో భాగస్వాములైన పౌరుల జాబితా.
అందుకే ఓటరు జాబితా నుంచి పేరు తొలగిపోవడం ఒక సాధారణమైన చర్య కాదు, ఒక పౌరుడి రాజకీయ ఉనికిని ప్రభావితం చేసే చర్య. ఇదే కారణంగా ప్రతి ప్రజాస్వామ్యం ఒక మౌలిక ప్రశ్నను ఎదుర్కొంటుంది. రాజ్యం తన పౌరులను గుర్తిస్తుందా? లేక వారిని నిరంతరం తమను తాము నిరూపించుకోవాలని కోరుతుందా? ఆధునిక పరిపాలనలో పత్రాల అవసరాన్ని ఎవరూ తిరస్కరించలేరు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్టు, భూ రికార్డులు… ఇవి లేకుండా కోట్లాది మంది ప్రజలకు సేవలు అందించడం కష్టమే. అందుకే సాంకేతికత పెరిగిన కొద్దీ పరిపాలన మరింత డేటా ఆధారితమవు తోంది. కానీ ఒక ప్రమాదం కూడా అదే వేగంతో పెరుగుతోంది. మనిషిని గుర్తించడానికి సృష్టించిన పత్రాలే, క్రమంగా మనిషి ఉనికిని నిర్ణయించే ప్రమాణాలుగా మారుతున్నాయి. ఇదే ఇప్పుడు మన ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన మలుపు. భారతదేశం ఒకే రకమైన సమాజం కాదు. ఈ దేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితాలు ప్రభుత్వ రికార్డుల్లా క్రమబద్ధంగా ఉండవు. ఇక్కడ ఇప్పటికీ జనన నమోదు జరగకుండానే పెద్దవారైన వారు అసంఖ్యాకులుగా ఉన్నారు. వరదల్లో, అగ్నిప్రమాదాల్లో, నిర్వాసిత జీవితాల్లో పత్రాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి. ఉపాధి కోసం గ్రామం నుంచి నగరానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్లే లక్షలాది కార్మికులు ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో అధికారిక రికార్డుల చరిత్రే ఆలస్యంగా ప్రారంభమైంది. దేశ జనాభాలో దాదాపు సగం మందికి తమ పుట్టిన తేదీ ఖచ్చితంగా తెలియని పరిస్థితులు ఇప్పటికీ కనిపిస్తాయి. మహిళల జీవితంలో వివాహంతో పాటు పేరు, చిరునామా, కుటుంబ గుర్తింపు మారడం సహజం.
ఈ వాస్తవాలను విస్మరించి ప్రతి వ్యక్తి జీవితం ఒకే రకమైన పత్రాలతో నిరూపించ బడాలని ఆశించడం, భారత సమాజాన్ని అర్థం చేసుకోలేకపోవడమే. ఎందుకంటే మనిషి జీవితం ఎప్పుడూ ఒక ఫైల్‌లో ఇమడదు. ఒక రైతు భూమి రికార్డులో అతని పేరు తప్పుగా ఉండొచ్చు. కానీ ఆ పొలంలో అతని అడుగుజాడలు తప్పుగా ఉండవు. ఒక కార్మికుడి చిరునామా మారి ఉండొచ్చు. కానీ అతని శ్రమ ఈ దేశ అభివృద్ధిలో భాగం కావడం మారదు. ఒక ఆదివాసీ కుటుంబం వద్ద పూర్తి పత్రాలు లేకపోవచ్చు. కానీ ఆ అడవితో వారి అనుబంధాన్ని ఏ కార్యాలయ రికార్డూ సృష్టించలేదు, అది జీవితం నిర్మించిన బంధం. ఒక వృద్ధురాలు జనన ధ్రువీకరణ పత్రం చూపించలేకపోవచ్చు. కానీ ఆమె జీవితం ఆ గ్రామానికే సాక్ష్యం. అందువల్ల, పత్రాలు కేవలం ప్రభుత్వానికి అవసరమైన పరిపాలనా సాధనాలు మాత్రమే. పౌరుడి హక్కులకు మూలం కావు. పౌరసత్వం అనేది ప్రభుత్వం ప్రసాదించే బహుమతి కాదు. అది ఈ దేశ ప్రజల రాజ్యాంగబద్ధమైన రాజకీయ హోదా. అందుకే భారత రాజ్యాంగం పౌరుడిని అధికార యంత్రాంగం ఎదుట నిలబడి తన ఉనికిని వేడుకోవాల్సిన వ్యక్తిగా చూడలేదు. హక్కులు కలిగిన వ్యక్తిగా చూసింది. రాజ్యాంగం చెప్పిన సమానత్వం అంటే అందరినీ ఒకే విధంగా చూడడం మాత్రమే కాదు.
జీవిత వాస్తవాలను అర్థం చేసుకుంటూ, ఎవరూ అన్యాయానికి గురికాకుండా చూడటం కూడా. గౌరవ ప్రదంగా గడపడమంటే కేవలం బతకడం కాదు, అవమానకరమైన అనుమానాల మధ్య తన ఉనికిని నిరూపించుకో వాల్సిన పరిస్థితి రాకుండా జీవించడం కూడా. అందుకే పరిపాలనలో ఒక మౌలిక సూత్రం ఉండాలి. ముందుగా మనిషి… తరువాతే పత్రం. దీనికి విరుద్ధంగా వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తే, పరిపాలనా సామర్థ్యం పెరుగుతుందేమోగానీ, ప్రజాస్వామ్యం నాణ్యత తగ్గిపోతుంది. ప్రజాస్వామ్యం రికార్డుల కచ్చితత్వం మీద కాదు, ప్రజల విశ్వాసం మీద నిలబడుతుంది. ఈ డిజిటల్ యుగంలో ప్రతి మనిషిని ఒక సంఖ్యగా, ఒక డేటాబేస్ ఎంట్రీగా మార్చడం సులభమే. ఇవన్నీ పరిపాలనకు ఉపయోగ కరమే. కానీ ఒక వ్యక్తి ఉనికి, విలువ అతని డేటాలో కాదు, అతని జీవితంలో ఉంటుంది. తెలంగాణ వాస్తవికతను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం వేలాది కుటుంబాలు అద్దె ఇళ్లు మారుతుంటాయి. నిర్మాణ రంగంలో, హోటళ్లలో, చిన్న పరిశ్రమల్లో, గృహ సేవల్లో పనిచేసే కార్మికులకు శాశ్వత చిరునామా అనేది అరుదైన విషయం. ఉత్తర తెలంగాణ నుంచి నగరాలకు వచ్చే యువకులు, పాలమూరు ప్రాంతం నుంచి ఉపాధి కోసం వలస వెళ్లే కుటుంబాలు, గిరిజన తండాల్లో నివసించే ప్రజలు, పాతబస్తీల్లో నివసించే పేదలు… వీరి జీవితాలను ఒకే పరిపాలనా నమునాలో బంధించడం సాధ్యం కాదు.
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుడి జీవితాన్ని ఊహించండి. ఈ రోజు ఒక నిర్మాణ స్థలంలో పని. మూడు నెలల తర్వాత మరో చోట. అద్దె ఇల్లు మారుతుంది. చిరునామా మారుతుంది. మొబైల్ నంబర్ మారుతుంది. కానీ అతని పౌరసత్వం మారదు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో అతని పాత్ర మారదు. అతని రాజ్యాంగబద్ధమైన హక్కులు మారవు.
అదే విధంగా ఒక ఆదివాసీ గ్రామాన్ని ఊహించండి. తరతరాలుగా ఒకే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు. కానీ అధికారిక రికార్డులు అసంపూర్ణంగా ఉన్నాయి. కారణం వారి నిర్లక్ష్యం కాదు, చారిత్రకంగా ప్రభుత్వ సేవలు ఆలస్యంగా చేరడం. ఇప్పుడు ఆ చారిత్రక లోటును వారి మీదే మోపడం న్యాయమా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకకుండా, కేవలం పత్రాల భాషలోనే పరిపాలన మాట్లాడితే, అత్యంత బలహీన వర్గాలే మొదట ఇబ్బందులు పడతాయి. చరిత్ర కూడా ఇదే చెబుతోంది. ప్రతి కఠిన పరిపాలనా వ్యవస్థలో ముందుగా వెలుపలికి నెట్టబడేది పెద్దోడు కాదు, పేదోడే. అందుకే ప్రజాస్వామ్యంలో సమర్థత (Efficiency) ఒక్కటే విలువ కాదు. న్యాయం (Justice) కూడా అంతే ముఖ్యమైన విలువ. ఎన్నికల జాబితాలు కచ్చితంగా ఉండాలి. ఇది అవసరం. అక్రమ నమోదులు తొలగించాలి. ఇది కూడా అవసరం. ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం ఉండాలి. ఇది మరింత అవసరం. కానీ ఈ మూడు లక్ష్యాలను సాధించే ప్రక్రియలో ఒక నాలుగో లక్ష్యం ఎప్పుడూ మరవకూడదు.
నిజమైన పౌరుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవస్థ వెలుపల పడిపోకూడదు. అదే రాజ్యాంగ స్ఫూర్తి. అదే ప్రజాస్వామ్య బాధ్యత. అదే మానవీయ పరిపాలనకు అసలు పరీక్ష. రాజ్యం తన పౌరులను ఎలా చూస్తుందన్నదే దాని అసలు స్వభావాన్ని నిర్ణయిస్తుంది. వారిని ముందుగా అనుమా నితులుగా చూస్తుందా? లేక హక్కులు కలిగిన మనుషులుగా చూస్తుందా? ఈ రెండింటి మధ్యే ప్రజాస్వామ్యానికీ, అధికార కేంద్రీకరణకూ మధ్య ఒక సరిహద్దు ఉంటుంది. రాజ్యానికి తన పౌరులను గుర్తించే హక్కు ఉంది. కానీ ఆ హక్కును విని యోగించే ప్రతి సందర్భంలో ఒక నైతిక బాధ్యత కూడా ఉంటుంది. ఎవరినీ అనవసరంగా అనుమానించి అవమానించ కూడదు. కేవలం పరిపాలనా లోపాల కారణంగా ఎవరినీ హక్కుల నుంచి దూరం చేయకూడదు. ముఖ్యంగా చరిత్రాత్మ కంగా వెనుకబడిన వర్గాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అసమాన సమాజంలో అందరికీ ఒకే కొలమానం వర్తింపజేయడం సమానత్వాన్ని కాదు, మరింత అసమానతనే ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలో భారతదేశం ఒక వైవిధ్యం గల ప్రత్యేకమైన దేశం. ఇక్కడ ఒకే రకమైన జీవితాలు లేవు. ఒకే రకమైన సామాజిక పరిస్థితులూ లేవు. ఒకే రకమైన పరిపాలనా చరిత్ర కూడా లేదు.
అందువల్ల ఒకే రకమైన పత్రాల ప్రమాణంతో కోట్లాది జీవితాలను అంచనా వేయాలనుకోవడం సహజంగానే అనేక సందేహాలను, ఇబ్బందులను సృష్టిస్తుంది. అందుకే పరిపాలన ఆధునికం అయినంతనే సరిపోదు, మరింత మానవీయం కావాలి. సాంకేతికత పెరగాలి, కానీ వివేచన తగ్గకూడదు. డిజిటల్ వ్యవస్థలు విస్తరించాలి, కానీ మానవ సంబంధాలు బలహీనపడకూడదు. పత్రాల కచ్చితత్వం పెరగాలి, కానీ అవి మనిషి ఉనికిని అవమానించకూడదు. ఇది గుర్తించినప్పుడే పరిపాలన నిజంగా ప్రజాకేంద్రంగా మారుతుంది. అందుకే ప్రజాస్వామ్య పరిపాలన పత్రాలను మాత్రమే కాదు, ప్రజల జీవితాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కూడా చివరికి ఈ సూత్రాన్నే ప్రతిబింబిం చాలి. ఎన్నికల సంఘం నిర్వహించే ఏ ప్రక్రియ అయినా ఎన్నికల జాబితాల ఖచ్చితత్వాన్ని పెంపొందించడంతో పాటు, అర్హులైన ఒక్క పౌరుడూ అన్యాయానికి గురికాకుండా చూసే బాధ్యతను కూడా నిర్వర్తించాలి. ప్రజల్లో భయాందోళనలు కాదు, విశ్వాసాన్ని కలిగించాలి. ధ్రువీకరణ అనే పదం నిరాకరణకు సంకేతంగా మారకూడదు.
ఒక వ్యక్తి ఈ దేశానికి చెందినవాడని నిరూపించేది అతని చేతిలో ఉన్న పత్రమా? లేక ఈ నేల మీద అతను గడిపిన జీవితం, అతని శ్రమ, అతని సామాజిక అనుబంధాలు, అతని రాజ్యాంగ బద్ధమైన హక్కులా? ప్రజాస్వామ్యం రెండో సమాధానాన్నే ఎంచుకోవాలి. ఎందుకంటే పత్రాలు పరిపాలనను నడిపించవచ్చు. చట్టాలు వ్యవస్థను కాపాడవచ్చు. రికార్డులు ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేయించవచ్చు. కానీ ఒక దేశాన్ని నిలబెట్టేది అవేవీ కావు. దేశాన్ని నిలబెట్టేది తమను ఈ నేలకు చెందినవారిగా భావించే ప్రజలు. ఆ అనుబంధాన్ని ఏ కార్యాలయం సృష్టించదు. ఏ ధ్రువీకరణ పత్రం ప్రసాదించదు. ఏ డేటాబేస్ కొలవదు. ఆ అనుబం ధాన్ని సమాజం నిర్మిస్తుంది. రాజ్యాంగం దానికి రక్షణ కల్పిస్తుంది. పత్రాలు ఒక మనిషి పేరును నమోదు చేయగలవు. అతని జీవితాన్ని నమోదు చేయలేవు. ఈ నేలతో అతనికి ఉన్న అనుబంధాన్ని కొలవలేవు. ఒక వ్యక్తిని పౌరుడిగా నిలబెట్టేది పత్రాలు కాదు. అతని హక్కులు. ఆ హక్కులకు ఆధారం భారత రాజ్యాంగమే.
రమేశ్ రాంపల్లి



