Thursday, July 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రధాన్ అసమర్ధత - ప్రధాని మౌనం

ప్రధాన్ అసమర్ధత – ప్రధాని మౌనం

- Advertisement -

రెండు నెలల నుంచి దేశం అట్టుడుకుతున్నది. మే మూడో తేదీన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరిగిన నాటి నుండి. ఇరవై మూడు లక్షల మంది ఆశావహులు తమ మేధో సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని పోటీపడ్డారు. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌టిఎ) అసమర్ధ నిర్వహణ మూలంగా ప్రశ్నాపత్రం కొనుక్కున్న వారికి ముందే చేరింది. 720 మార్కులకు గాను 600 మార్కులు లీకైన ప్రశ్నాపత్రంలో కలిసినా అది కేవలం ఊహ ప్రశ్నాపత్రం అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్‌‌టిఎ నిర్వాహకులు కొట్టివేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల ఫలితంగా ఆ పరీక్షను రద్దుచేసి తిరిగి జూన్ 21న నిర్వహించారు. ఆ మధ్యకాలంలోనూ ఎంతో ఆందోళనకు ఒత్తిడికి గురైన పదమూడు మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పదిహేడు వందల మంది అభ్యర్థులు హాజరే కాలేదు. వారెందుకు హాజరు కాలేదో ఇంతవరకు సమీక్ష‍ కూడా చేయలేదు. నిరాశ, ఒత్తిడి, అనిశ్చితితోనే కదా వారు పరీక్ష‍కు సిద్ధం కాలేదు. దీనికి బాధ్యతెవరిది? రోజురోజుకూ పరీక్ష‍లపై విశ్వాసం సన్నగిల్లుతున్నది. కోచింగ్ సెంటర్ల సంపాదన కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నది. నేరం విద్యాశాఖది లేదా దాని కింద పనిచేసే ఎన్‌‌టిఎది. కానీ ఏ తప్పు చేయని అమాయకులైన తల్లిదండ్రులు అందుకు భారీ మూల్యం చెల్లించుకోవడం బాధాకరం.

ఇదొక్కటే కాదు, ఎన్‌‌టిఎ పరీక్ష‍ల నిర్వహణలో చాలాసార్లు ‘ఫెయిల్‌’ అయింది. నాలుగేళ్లుగా ఐఐటీ మెయిన్స్ పరీక్ష లీక్ అవుతూనే ఉన్నది. 2024లో నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైన కారణంగా బీహార్ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక సెంటర్‌‌లో తిరిగి పరీక్ష నిర్వహించింది. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు తొలగించింది. 2025లో ఐఐటి ప్రశ్నపత్రం లీక్ అయింది. 2026 ఐఐటీ మెయిన్స్ ప్రశ్నపత్రంలో పన్నెండు ప్రశ్నలు తొలగించింది. ఇంత అస్తవ్యస్త నిర్వహణకు కేవలం అసమర్ధ విద్యాశాఖ మంత్రి కారణం అని తెలిసి కూడా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది. ఇది చాలనట్లు కేంద్రీయ సెకండరీ విద్య బోర్డు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు దేశంలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. మూల్యాంకనంలో లోపాలు స్కానింగ్ సరిగా జరగకపోవడం మూలంగా మార్కులు తారు మారయ్యాయి. ఐఐటి జేఈఈ లో బాగా మార్కులు వచ్చిన అభ్యర్థులు సైతం 12వ తరగతి పరీక్షలో అతి తక్కువ మార్కులు రావడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. నాలుగు లక్షల మందికి పైగా తమ జవాబు పత్రాల స్కాన్ కాపీలకు దరఖాస్తు చేసుకోవడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. మరోపక్క ఎన్సీఈఆర్టీ పాఠశాల సిలబస్ లో రకరకాల మార్పులు చేసి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నది. విద్యను కాషాయీకరించే ప్రయత్నం బలంగా చేస్తున్నది.

దేశంలో విద్యాశాఖ నిర్వీర్యమైనట్లు ప్రస్ఫుటమవుతున్నది. యుజిసి నెట్ పరీక్షలు, విశ్వవిద్యాలయాల పరీక్షలు చివరకు నిన్న మొన్న మహారాష్ట్రలో టెట్ పరీక్ష ప్రశ్నాపత్రం (అక్కడ కూడా బీజేపీ పాలనలో ఉంది) ఈ విధంగా అన్ని ప్రవేశపరీక్షలు ప్రహసనమయ్యాయి. వాటి విలువ, పవిత్రత ఇప్పుడు ప్రశ్నార్ధకమయ్యాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థత ఈ లీకులన్నింటికీ ముఖ్య కారణంగా కనిపిస్తున్నది. అందుకే రాజకీయ మూలాలు లేక పోయినా కాక్రోచ్ జనతా పార్టీకి కోట్లాది ప్రజల మద్దతు లభించింది. కేవలం ఒక ఆన్‌లైన్ పార్టీగా మొదలైన బొద్దింకల పార్టీ నేడు కేంద్రంలోని ‌బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తున్నది. అసమర్థ పరీక్షల నిర్వహణను నిలదీస్తున్నది. అందుకు అనేక రాజకీయ పార్టీల మద్దతు లభించడం ఆశ్చర్యమేమీ కాదు. ఆ పార్టీ ఎక్కడ సమావేశాలు ఆందోళనలు జరిపినా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం గమనార్హం. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు ప్రజల నుంచి విపరీతమైన సహకారం లభించింది. జూన్ 29వ తేదీ నుంచి లడక్ విద్యాసంస్కరణవాది, పర్యావరణవేత్త, రామన్ మెగసేసే అవార్డు గ్రహీత సోనం వాంగ్ చుక్ నిరాహారదీక్షకు దిగడంతో ఈ ఉద్యమానికి గొప్ప ప్రాచుర్యం లభించింది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే ముఖ్య అస్త్రంగా ఈ నిరాహారదీక్ష జరుగుతుండడంతో సీజేపీ ఉద్యమానికి మంచి ఊపు వచ్చింది. అనేక రాజకీయ పార్టీలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలిపాయి. ఒక బాధ్యతాయుతమైన మంత్రి నిర్లక్ష్యానికి నిరసనగా నిరాహార దీక్ష జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు సమాధానం ఇవ్వకపోవడం శోచనీయం.
ఒక కేంద్రమంత్రి రాజీనామా గురించి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా అనేక రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా కేంద్ర మంత్రివర్గం స్పందించడం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ కనీస బాధ్యతగా సమాధానం చెప్పడం లేదు. సాక్షాత్తు దేశ ప్రధాని సైతం మౌనం వహించడం లేదా అతడిని సమర్థించడం బాధాకరం. పదుల సంఖ్యలో ఆత్మహత్యలకు దారి తీసిన ఒక మంత్రి అసమర్థత బాధ్యతా రాహిత్యం నిర్ద్వందంగా ఖండించదగినవి. కానీ ప్రధాని ఉపేక్షించడాన్ని దేశ ప్రజలు ఏ విధంగా భావించాలి? ఇవి అచ్చేదిన్ అని ఎలా భావించగలం? పరీక్షల ప్రక్రియ ఈ దేశంలో కొత్త కాదు. వైఫల్యాలకు మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన సంఘటనలు అనేకం. కానీ విచిత్రంగా సదరు మంత్రి కానీ, ప్రధాని కానీ ఈ సంఘటనలో ప్రేక్షక పాత్ర వహిస్తూ మౌనముద్ర వేయడం అత్యంత అప్రజాస్వామికం.

పరీక్ష పే చర్చ అంటూ విద్యార్థులతో అనేక సంవత్సరాలుగా మాట్లాడుతున్న మోడీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిన ఏజెన్సీ బోర్డులు, విద్యా మంత్రి పట్ల ఏమాత్రం స్పందించకపోవడం గర్హనీయం. ఇది ప్రజల ఆశలను ఆశయాలను వంచించినట్లే అవుతుంది. తమ కాలంలోనే స్వచ్ఛమైన నీతి నిజాయితీతో కూడిన పాలన సాధ్యమని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం పరీక్ష నిర్వహణ విషయంలో మౌనాన్ని ఆశ్రయించింది. కాక్రోచ్పార్టీని చాలా తేలికగా తీసుకున్న బీజేపీ తర్వాత తన తప్పిదాన్ని గ్రహించింది. కానీ దేశంలోని నిరుద్యోగ యువత విద్యావంతుల నుండి విపరీతమైన మద్దతు లభించడం బీజేపీకి మింగుడు పడడం లేదు. వైఫల్యాలను ఒప్పుకునే ధైర్యం లేకపోగా వాటి నుండి పాఠాలు నేర్చుకొవడానికి కూడా సిద్ధంగా లేదు. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. 2022లో రైతు ఆత్మహత్యల కన్నా విద్యార్థుల ఆత్మ హత్యలు ఎక్కువగా అంటే పదమూడు వేలకు పైగా జరగడం ఈ దేశ విద్యావ్యవస్థ దుస్థితికి అద్దం పడుతున్నది. చదువు అంటే కేవలం మార్కులు, ర్యాంకులు అనే భావన తొలగించే ప్రయత్నం జాతీయ స్థాయిలో జరగడం లేదు. దానికి తోడు పరీక్ష పత్రాల లీకేజీ విద్యార్థుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీస్తున్నది. నేడు చదువు లేదా ఉద్యోగమంటే ఇంజనీరింగ్ లేదా డాక్టర్ అనే ఆలోచనల నుంచ విద్యార్థుల దృష్టి మరల్చే ప్రయత్నమే జరగడం లేదు. అసలు ప్రశ్నాపత్రాలు కేవలం ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక వ్యక్తి చేతనే తయారు చేయించడం ఎన్‌‌టిఎ చేసిన తప్పిదం.

తయారు చేసిన ప్రొఫెసర్లు కక్కుర్తిగా దానిని లక్షల రూపాయలకు అమ్ముకోవడంతో విషయం రచ్చకెక్కింది. ప్రశ్నాపత్రం తయారీకి ప్రతి సబ్జెక్టుకు నిపుణుల కమిటీ ఉండడం సహజం. ఎన్టిఏ ఈ సహజ సూత్రాన్ని కూడా పాటించకపోవడం దారుణం. అనేకమార్లు కొన్ని ప్రశ్నలను తొలగించడం కూడా విద్యార్థులకు అన్యాయమే అవుతుంది. ఇన్ని లోపాలు తప్పిదాలు స్పష్టంగా కనబడుతున్నా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన బాధ్యత లేదన్నట్లుగా ప్రవర్తించడం వింతగా ఉంది. కనీసం ప్రధాని మోడీ సైతం ఆయన్ను రాజీనామా కోరలేదు లేదా ఆ శాఖ నుండి తప్పించకపోవడం విచారకరం. దేశంలో కీలక సమస్యలు చర్చకు వచ్చినప్పుడల్లా, ఆందోళనలు జరిగినప్పుడల్లా నోరు మెదపని దేశ ప్రధాని ఈ ప్రవేశ పరీక్షల రచ్చపై కూడా ఎప్పటిలాగే మౌనముద్ర వహించడాన్ని దేశ ప్రజలు ఆలోచించాలి.

శ్రీ శ్రీ కుమార్, 9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -