Tuesday, July 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘‘ఎ.ఐ’’ ఎఫెక్ట్‌- కంపెనీల ‘‘లేఆఫ్స్‌’’

‘‘ఎ.ఐ’’ ఎఫెక్ట్‌- కంపెనీల ‘‘లేఆఫ్స్‌’’

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (ఎ.ఐ) శరవేగంగా విస్తరిస్తోంది. టెక్నాలజీ రంగంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా ప్రచారం పొందుతున్నది. అయితే దీన్ని కొందరు ఆహ్వానిస్తుండగా, మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఎఐయాజమాన్యాలకు వరంగా మారినా, అది లక్షలాది మంది ఉద్యోగుల జీవితాల్లో చీకట్లను నింపుతోందనే అభిప్రాయం బలపడుతోంది. ప్రపంచ శాస్త్ర సాంకేతికాన్ని అందిపుచ్చుకోవాలే కానీ, దానికి రూపమిచ్చిన వారి ఉద్యోగాలకే ఎఐ నేడు ఎసరు పెడుతోంది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలను పరిశీలిస్తే అత్యధిక భాగం ఎ.ఐ ఆధారిత కోతలేనని తేటతెల్లమవుతోంది. టెక్ రంగంలో మొత్తం 1,70,575 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో 1,37,681 ఉద్యోగాల కోతలు నేరుగా ఎ.ఐ (AI-Driven) ఆధారిత పునర్వ్యవస్థీకరణలతో ముడిపడి ఉన్నాయి. ఉత్పత్తికి మార్కెట్‌లో డిమాండ్ లేని కారణంగా 1,170 మంది, కంపెనీల విలీనాల కారణంగా 610 మందిని లేఆఫ్ చేశారు. అంటే మొత్తం లేఆఫ్స్‌లో దాదాపు 85.15 శాతం ఎ.ఐ ప్రభావంతో జరిగినవేనని గణాంకాలు సూచిస్తున్నాయి. Accenture సంస్థ పదకొండు వేల మంది, Dell మరో పదకొండు వేల ఉద్యోగులను తగ్గించింది. Cognizant 15వేల మంది ఉద్యోగులను తొలగించింది. Microsoft 8,750 మందిని, Meta16వేల మందిని ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. Oracle సంస్థలో 30వేలు, Tcsలో 12వేల మంది ఉద్యోగాలను కోల్పోఆయరు.

Amazon రెండు విడతల్లో కలిపి దాదాపు 16,600 మంది ఉద్యోగులను తొలగించింది. Cisco 4వేల మంది, LinkedIn 875 మంది, Freshworks 500 మంది ఉద్యోగులను తగ్గించాయి. కొన్ని కంపెనీల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఎ.ఐ 21 Labs సంస్థ తన ఉద్యోగుల్లో 61 శాతం మందిని తొలగించింది. Build a Rocket Boy సంస్థలో 68 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. Cloudflare సంస్థలో 21 శాతం, Wixలో 19 శాతం, GitLabలో 14 శాతం ఉద్యోగులు తొలగించబడ్డారు. అమెరికాకు చెందిన ఆటోమొబైల్ రంగంలోని జనరల్ మోటార్ సంస్థ మిచిగన్‌లో ఉన్న ప్రధాన కార్యాలయంలో వెయ్యి మందిని తొలగించి వారి స్థానంలో యాభై రోబోలతో భర్తీ చేశారు. ఈ గణాంకాలు ఒక ముఖ్యమైన ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ఎ.ఐ వల్ల ఉత్పాదకత, కంపెనీల లాభాలు, షేర్ మార్కెట్ విలువలు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే ఈ సంపదలో ఉద్యోగులకు సరైన వాటా దక్కడం లేదు. లాభాలు కొద్ది మంది పెట్టుబడిదారుల చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, ఉద్యోగులు మాత్రం ఉద్యోగ భద్రత కోల్పో తున్నారు. ఉద్యోగాల కోతలతో పాటు మిగిలిన ఉద్యోగులపై పని భారం కూడా పెరుగుతోంది. గతంలో పది మంది చేసే పనిని ఇప్పుడు ఐదారుగురితో చేయిస్తున్నారు. ఎ.ఐ. టూల్స్ సహాయంతో తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకోవడం కంపెనీల ప్రధాన లక్ష్యంగా మారింది. దీంతో ఉద్యోగ భద్రత తగ్గుతోంది. పని ఒత్తిడి పెరుగుతోంది. పని గంటలు పెరుగుతున్నాయి.

ఒక ఉద్యోగి ఇద్దరు లేదా ముగ్గురు ఉద్యోగుల బాధ్యతలను నిర్వర్తించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌‌లోని ఓ సాప్ట్‌‌వేర్‌ ‌కంపెనీలో పనిచేస్తున్న మహిళ తన కూతురుకు జ్వరం వచ్చిందని ఒక్కరోజు లీవ్‌ ‌పెడితే యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఇదే దుస్థితి చాలా కంపెనీల్లో ఉంది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ భద్రతకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. ‘‘ఎ.ఐ వల్ల ఉత్పాదకత పెరిగితే ఆ ప్రయోజనం కేవలం కంపెనీలకే ఎందుకు చేరుతున్నది? పని గంటలు తగ్గించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, వేతనాలు పెంచడం ఎందుకు జరగడం లేదు?’’ అనేది కార్మిక సంఘాలు లేవనెత్తుతున్న ప్రశ్న. దీన్నిబట్టి చూస్తే కార్మికుల శ్రమను కారుచౌకగా దోచుకోవడానికి అనేక ఎత్తుగడలను యాజమాన్యాలు ప్రయోగిస్తున్నాయని చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఎ.ఐ. గానీ ఇతర కారణాల వల్ల ఉన్న ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారుతున్న పరిస్థితి ఉంటే, మరోపక్క ఇప్పటికే ఉన్న రిజర్వు ఫోర్స్ (నిరుద్యోగుల సంఖ్య) భారీగా పెరుగుతున్నది.

వారి అసంతృప్తి ‘కాక్రోచ్’ లేదా ఇతర రూపాల్లో వ్యక్తమవుతున్నది. భారత ప్రభుత్వం నిర్వహించే నెలవారీ (పిఎల్‌ఎస్‌) తాజా అంచనాల ప్రకారం 2026 జనవరి నాటికి 15 సంవత్సరాలు పైబడిన వారి నిరుద్యోగిత రేటు సుమారు 5.0 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 7.0 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువగా ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మహిళల నిరుద్యోగిత రేటు పురుషుల కంటే ఎక్కువగా నమోదవుతోంది. అయితే నిరుద్యోగిత రేటు మాత్రమే దేశంలోని ఉపాధి పరిస్థితిని పూర్తిగా తెలియజేయదు. స్వయం ఉపాధి, అసంఘటిత రంగ ఉపాధి, అర్ధ నిరుద్యోగం (Underem ployment) వంటి అంశాలు కూడా భారత కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణలో నిరుద్యోగిత రేటు సుమారు 5.2 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల పెంపు, పరిశ్రమల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ లాంటి అనేక వాగ్ధానాలు ఇచ్చినప్పటికీ వాటి అమలువిస్మరించింది.చరిత్రను పరిశీలిస్తే ప్రతి సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను కూడా సృష్టించింది. ఎ.ఐ కూడా కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. కానీ ఆ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి పెంపు కార్యక్రమాలు లేకపోతే లక్షలాది మంది కార్మికులు ఉపాధి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఎ.ఐ.ని వ్యతిరేకించడం పరి ష్కారం కాదు. ఎ.ఐ వల్ల పెరిగే ఉత్పాదకత, సంపద, లాభాలు సమాజంతో పాటు కార్మికులకు కూడా చేరే విధంగా విధానాలు రూపొందించాలి. పని గంటల తగ్గింపు, ఉద్యోగ భద్రత, నైపుణ్యాభివృద్ధి, సామాజిక రక్షణ వంటి అంశాలు. ఎ.ఐ యుగంలో కార్మిక ఉద్యమాల ప్రధాన డిమాండ్లుగా మారాల్సిన అవసరం ఉంది. నేటి ప్రశ్న “ఎ.ఐ వస్తుందా?” అనేది కాదు, “ఎ.ఐ సృష్టించే సంపదను ఎవరు నియంత్రిస్తారు? ఆ సంపదలో కార్మికులకు ఎంత వాటా దక్కుతుంది?” అనేదే అసలు ప్రశ్న.

యాటల సోమన్న, 9490098486

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -