Tuesday, July 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచట్టమే గీటురాయి…‘హైడ్రా’కు హైకోర్టు హెచ్చరిక!

చట్టమే గీటురాయి…‘హైడ్రా’కు హైకోర్టు హెచ్చరిక!

- Advertisement -

ప్రభుత్వ భూములను పరిరక్షించడం ఎంత అవసరమో, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించడం కూడా అంతే అవసరం. ఈ రెండు సూత్రాలు పరస్పర విరుద్ధమైనవి కావు, ఒకదానికొకటి పరిపూరకాలు. తెలంగాణలో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను ఆక్రమణల నుంచి రక్షించేందుకు ఏర్పాటైన హైడ్రా చేపడుతున్న చర్యలు ఒకవైపు ప్రజల ప్రశంసలు పొందుతుండగా, మరోవైపు న్యాయస్థానాల పరిశీలనకూ లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌ ఏ.వి. రంగనాథ్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగబద్ధ పాలనపై మరోసారి చర్చకు దారితీశాయి. హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య. చెరువులు మాయమవడం, నాలాలు కుంచించుకుపోవడం, పార్కులు, ప్రభుత్వ స్థలాలు అక్రమ నిర్మాణాలకు గురికావడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, ప్రతి వర్షాకాలంలో నగరం వరదల బారిన పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ఆక్రమణల తొలగింపు, చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం ప్రజాహిత దృష్ట్యా స్వాగతించదగ్గ పరిణామమే.

అయితే ప్రజాస్వామ్యంలో మంచి లక్ష్యం ఒక్కటే సరిపోదు. ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రతి అడుగు కూడా చట్టబద్ధంగా ఉండాలి. లోతుకుంట భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు స్టేటస్ కో అమల్లో ఉన్న సమయంలో అధికారులు అక్కడికి వెళ్లడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే హైడ్రాపై పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేస్తూ, చట్టాన్ని అమలు చేసే అధికారులే న్యాయస్థానాల ఆదేశాలను విస్మరిస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థపై, ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక అధికారిపై చేసిన వ్యాఖ్య కాదు, రాజ్యాంగ పాలనకు ఇచ్చిన హెచ్చరికగా చూడాలి. మరోవైపు హైడ్రా కమిషనర్ చేసిన వివరణ కూడా గమనించదగ్గదే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 48ఏ స్ఫూర్తితో ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని ఆయన పేర్కొ న్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించామని, చెరువులను పునరుద్ధరించామని, భూ మాఫియా కోర్టులను ఆశ్రయించి ప్రభుత్వ చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వాదనలోనూ ప్రజాప్రయోజనం కనిపిస్తోంది.

అయితే, అసలు సమస్య ఇక్కడే ఉంది. ఒకవైపు ప్రభుత్వ భూములను కబ్జా చేసే భూ మాఫియా చట్టంలోని లోపాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కూడా న్యాయపరమైన విధానాలను విస్మరించే పరిస్థితి ఏర్పడకూడదు. ప్రజాస్వామ్యంలో భూ కబ్జాదారులకు చట్టం వర్తించినట్టే, అధికారులకు కూడా అదే చట్టం వర్తించాలి. ‘‘లక్ష్యం మంచిదే కాబట్టి విధానాన్ని పట్టించుకోనవసరం లేదు’’ అనే భావన ఎంత ప్రమాదకరమో, ‘‘కోర్టు కేసుల పేరుతో ప్రభుత్వ భూములను శాశ్వతంగా ఆక్రమించుకోవచ్చు’’ అనే భావన కూడా అంతే ప్రమాదకరం. ఈ పరిణామం ప్రభుత్వం, అధికారం, న్యాయవ్యవస్థ-మూడు వర్గాలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రభుత్వ భూముల రక్షణపై ఎలాంటి రాజీ ఉండకూడదు. అదే సమయంలో ప్రతి చర్య పటిష్టమైన చట్టపరమైన ఆధారాలతో, న్యాయ స్థానాల ఆదేశాలను గౌరవిస్తూ కొనసాగాలి. అలా జరిగినప్పుడే హైడ్రా వంటి సంస్థలపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుంది. లేకపోతే అసలు లక్ష్యం గొప్పదైనా, అమలు విధానం వివాదాల్లో చిక్కుకుని ప్రజా మద్దతు బలహీనపడే ప్రమాదం ఉంటుంది.

శ్రీశైలం దూడం, 9133947176

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -