Thursday, July 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘ఆత్మ’ఘోష!

‘ఆత్మ’ఘోష!

- Advertisement -

యమలోకం ముందు భయం భయంగా నిలబడ్డాయి చాలా ఆత్మలు. అన్ని మతాల ఆత్మలూ అందులో ఉన్నాయి. కోర్టు బిళ్ల బంట్రోతులా ఒక్కొక్క పేరూ మూడుసార్లు పిలుస్తున్నాడు ఆ భటుడు.
బంట్రోత్తు : చింతా దీక్ష‍ితులు.. దీక్ష‍ితులు.. తులు! ధోతీ కట్టుకుని, పెద్ద బొట్టు పెట్టుకున్న ఆత్మ లోనికి నడిచింది. ఆత్మలకు ధోతీలేమిటి? గెడ్డాలేమిటి? అడ్డ పంచలేమిటి? అనే ప్రశ్నలు ఇక్కడ అసందర్భం, అప్రస్తుతం కూడా! ఉన్నాయి. (ఆత్మ నపుంసకలింగం కాబట్టి) దాన్ని లోపల ఫ్రై చేశారో, కబాబుగా చేశారో నాకు తెలీదు. క్ష‍ంతవ్యుడను!
బిళ్ల బంట్రోతు : ‘కమాలుద్దీన్‌’ అని ఒకటేసారి కేకేసి ఆపేశాడు. సదరు ఆత్మ ఒకింత ధైర్యంగానే లోపలికి కదిలింది. లోపల్నుండి ‘‘ఆగక్కడ!’’ పిడుగుపడింది.
యమ్‌ ధర్మరాజు హూంకరింపుతో మాయాబజార్‌‌లో లంబు, జంబు భాషలో ‘పరవేశ దవారం’ దగ్గరే బిక్కచచ్చి ఆగిపోయింది కమాలుద్దీన్‌ ఆత్మ(కేఏ)
‘‘యమ్‌ ‌ధర్మరాజు (యం.డీ) : నువ్వు పుట్టింది ఎక్కడ్రా పాపీ!
కే.ఏ : జమ్మూలో స్వామీ! (వినయం ఉట్టిపడుతూ చెప్పిందా ఆత్మ)
యం.డీ : అటు పీ.ఓ.కే (పాక్‌ ఆక్యుపైడ్‌ ‌కాశ్మీర్‌)లోనా? ఇటు భారతావనిలోనా?
కే.ఏ : ఇటే స్వామీ!
యం.డీ : దానికి రుజవేంటి? అధికార దర్పం గాండ్రించింది.
కే.ఏ : ‘‘నేను భారతీయుణ్నే! నాకు ఇండియన్‌ ‌పాస్‌పోర్టు కూడా ఉంది. రెండుసార్లు పుణ్యక్ష‍ేత్రమైన ట్రంపు రాజ్యంలో కాలుమోపి క్ష‍ేమంగా తిరిగి వచ్చాను మైలార్డ్‌ ! బోర్డు ఆఫ్‌ ‌హయ్యర్‌ ‌సెకండరీ ఎడ్యుకేషన్‌ ‌వారిచ్చిన పదవతరగతి సర్టిఫికేట్‌‌లో నా వయసు, జన్మ స్థలం అన్నీ రాసున్నాయి! గుక్కతిప్పు కోకుండా శ్లోకాలప్పజెప్పినట్లు చెప్పింది ఆ ఆత్మ.
యం.డీ : ‘దాన్ని మేమెలా నమ్మాలి?’ హూంకరింపుతో కూడిన ప్రశ్న.
కే.ఏ. : (కొత్త లాయర్‌ ‌జడ్జిముందు తడబడ్డట్లు, కొద్దిగా తడబడ్తూ) దేన్నిమై లార్డ్?!
యం.డీ : (తన ముందున్నది అభిషేక్‌ ‌మునుసింఘ్వీనో, కపిల్‌‌సిబలో కాదని తెలిసిన తర్వాత రెచ్చిపోయాడు) పాస్‌‌పోర్ట్‌ పౌరసత్వానికి నిదర్శనమని నీకు చెప్పిన శుంఠెవడు? అది ఇంకో దేశానికి పోయే ట్రావెల్‌ డాక్యుమెంటు మ్రాతమే!’’ గాండ్రింపు.
కే.ఏ. : అంటే మాకు జన్మతః పౌరసత్వం రాదా? దేశ పౌరుడినైతేనేగా నాకు పాస్‌‌పోర్టు ఇచ్చేది! మా తాత బద్రుద్దీన్‌, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలు కోల్పోయాడు. మా నాన్న జియావుద్దీన్‌ ‌భారతదేశ మొదటి బ్యాచ్‌ ఆర్మీ జనరల్స్ లో ఒకడు. అంతెందుకు, నేనుకూడా ఆపరేషన్‌ ‌సింధూర్‌‌లో పాల్గొని చస్తే కదా అటుపడేయాల్సిన నన్ను ఇటు తమ సన్నిధిలో విసిరేశారు!
ఈ సంవాదం వింటున్న మిగిలిన ఆత్మలన్నింటికీ భగవద్గీతలో ‘కర్మయోగం’పై ఘంటసాలవారి రికార్డు విన్నట్లనిపించింది.
యండీగారి ఉరుముతో నరకలోక ద్వారం దగ్గర తెలివిలోకి వచ్చారు. సారీ! వచ్చాయి ఆత్మలన్నీ!
యం.డీ : అందుకే మీ దేశ నాయకమ్మన్యులు చెప్పేది విని తగులబడండి అన్నాడు. (విన్నా తగులబెట్టారుసార్‌! అంది మణిపూర్‌ ‌ఫీమేల్‌ ఆత్మ!)
చాలా ఆత్మలు ఒకేసారి మాకు ఆధార్‌ ‌కార్డులున్నాయంటూ ముక్తకంఠంతో అరిచాయి.
యం.డీ : 2010 నుండి ఆధార్‌ ‌కార్డులిస్తున్నారు. పౌరసత్వ చట్టం 1955లో వచ్చింది. పాకిస్థాన్‌ ‌టెర్రరిస్టులకు కూడా ఆధార్‌‌కార్డు ఇప్పించగలిగే ‘ఢిల్లీ సూరీలు’న్న దేశంలో అదెలా పౌరసత్వాన్ని నిరూపిస్తుంది మూర్ఖులారా? అథారిటేటివ్‌‌గా అరిచాడు.
కే.ఎ. : ‘నాకు బర్త్‌ ‌సర్టిఫికేటుంది మైలార్డ్’ (మిగతా ఆత్మల్లో సణుగుడు ప్రారంభమైంది).
యం.డీ : (ఆఫ్టరాల్‌ ఎప్పుడో, ఎక్కడో, ఎందుకో చచ్చి నా దగ్గర చేతులు కట్టుకుని లైన్లో నిలబడాల్సినవి నాతో వాదనకు దిగడమేమిటి? లోలోపల రగిలిపోతున్నాడు యం.ధర్మరాజు)
‘‘యముండా!’’ అంటూ మీసాలు తిప్పాడు. ‘బర్త్ సర్టిఫికేటుల్ కూడా ట్రావెల్‌ ‌డాక్యుమెంట్లేనర్రా’’ అని విసుక్కున్నాడు
కేఏతోపాటు మరికొన్ని ఆత్మలు మూకుమ్మడిగా అదెట్లా స్వామీ?
యం.డీ : పుట్టుక, చావు, పునర్జన్మ.. వంటివి ఒక ‘ధర్మం’లో ప్రత్యేకత.
ఆ ట్రావెల్‌ ‌డాక్యుమెంట్లు పట్టుకునే గత జన్మనుండి ఈ జన్మ, మళ్లీ చచ్చి ఇలా నా దగ్గరికి వచ్చారు. అందుకే బర్త్‌ ‌సర్టిఫికేట్లను కూడా ట్రావెల్‌ ‌డాక్యుమెంట్లన్నది!’’
అంతెందుకు? మీ తాతవి, మీ నాన్నవి బర్త్ సర్టిఫికేట్లు ప్రటారా కమాలుద్దీనాధమా?
కే.ఏ : ఆ రోజుల్లో అవెక్కడున్నాయి సార్‌! ఇండ్లలో మంత్రసానులే బొడ్డు తెంపిపోయేవారు.
యం.డీ : అందుకే మీలాంటి వారిని పాకిస్థాన్‌ ‌నుండి దేశంలోకి చొరబడ్డారని మోడీ సర్కార్‌ ‌చెప్పేది నిజమేనేమో! ఇంతకీ నువ్వు ఐటీ రిటర్న్స్ సబ్మిట్‌ ‌చేస్తావా?

కే.ఏ: జీ.. జీ.. ? నాలాంటి ప్రజలే కాదు, బీడీ కట్టలు, అగ్గిపెట్టెలు కొనుక్కునే కోట్ల మంది కట్టే పరోక్ష‍ పన్నుల వల్లేగా 83 ఏశాలకి 103 ట్రిప్పులేసి వచ్చాడు మా ‘ఎక్స్’! 2025 ఆగస్టు 12లో లోక్‌‌సభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో భారత పౌరసత్వానికి ఏయే డాక్యుమెంట్లు అవసరమో నిర్దిష్టంగా చెప్పలేదు. పౌరసత్వ చట్టం ప్రకారం పౌరులు పుట్టుక రీత్యానూ, జీన్‌‌డ్రీజ్‌ ‌లాగా పౌరులుగా రిజిష్టర్‌ ‌చేయించుకున్నా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌‌లాగా ఆ ప్రాంతాన్ని భారత్‌‌లో కలిపేసుకుంటే కూడా పౌరులవ్వచ్చు. జనవరి 26, 1950, జులై 1, 1987 మధ్య ఈ దేశంలో పుట్టిన వారందరూ ఈ దేశ పౌరులే. జులై 1, 1987, డిసెంబరు, 3 2004 మధ్య పుట్టిన వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండాలి. అంటే ఆ తర్వాత పుట్టిన వారికే పేచీ. వారు అక్రమ చొరబాటు దారుడు కాదని రుజువు చేసుకోవాలి. మిగతా ఆత్మలన్నింటికీ కాషాయ వస్త్రాలు కట్టుకుని, పుట్టపర్తి సాయిబాబా లాగా గుబురైన వెంట్రుకల్తో నాలుగైదు తాటి చెట్లంత ఎత్తులో కనపడ్డాడు కమాలుద్దీన్‌.

ఆర్. సుధాభాస్కర్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -