Thursday, July 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబడిలో ‘బాధ్యతల’ భారం!

బడిలో ‘బాధ్యతల’ భారం!

- Advertisement -

”భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది’’ – కొఠారీ. ఆ భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు మాత్రం ఉపాధ్యాయులే. కానీ, నేడు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, ఉపాధ్యాయుల మానసిక స్థితిని గమనిస్తే మన విద్యావ్యవస్థ ఎటువైపు పయనిస్తోందో అర్థం కాని పరిస్థితి. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించ కుండా, కేవలం ఉపాధ్యాయులపైనే ఒత్తిడి పెంచడం, వారిపై ‘కొరడా’ ఝులిపించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక పాఠశాల సజావుగా సాగాలంటే ప్రథమంగా కావలసింది మౌలిక సదుపాయాలు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో నేటికీ కనీస సౌకర్యాలు లేవు.తాగునీటి ఎద్దడి వేసవి కాలమే కాదు, సాధారణ రోజుల్లో కూడా విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించే సౌకర్యం అనేక బడుల్లో లేదు. ఉపాధ్యాయులే స్వయంగా చందాలు వేసుకుని లేదా పంచాయతీ అధికారులను బతిమిలాడి నీటిని తెప్పించాల్సిన పరిస్థితి ఉంది. బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం, ఉన్నా అవి నిరుపయోగంగా ఉండడం వల్ల విద్యార్థుల హాజరు శాతం పడిపోతోంది. నీటి వసతి లేని మరుగుదొడ్లను ఉపాధ్యాయులు ఎలా శుభ్రంగా ఉంచగలరు? ఈ విధమైన భౌతిక లోపాలను సరిదిద్దాల్సింది ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం. కానీ, ఉన్నతాధికారుల తనిఖీల్లో వసతుల కొరతకు కూడా ఉపాధ్యాయులనే బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేయడం బాధాకరం.
విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రవేశపెట్టిన ‘మధ్యాహ్న భోజన పథకం’ ఉపాధ్యాయులకు ఒక పెద్ద సవాలుగా మారింది.

పాఠశాలలకు సరఫరా అవుతున్న బియ్యం, కోడిగుడ్లు, ఇతర సరుకుల నాణ్యతపై నిరంతరం విమర్శలు వస్తూనే ఉన్నాయి. పురుగులు పట్టిన బియ్యాన్ని మార్చడానికి ఉపాధ్యాయులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక బడ్జెట్ విడుదల ఆలస్యం వల్ల కోడిగుడ్లు, కూరగాయల బిల్లులు, వంట ఏజెన్సీల గౌరవ వేతనాలు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ‘ఏజెన్సీలు వండం’ అని చేతులెత్తేసినప్పుడు, పిల్లలు ఆకలితో అలమటించకూడదనే మానవతా దృక్పథంతో టీచర్లే సొంత డబ్బులు పెట్టి వంట చేయిస్తున్నారు.సమయం వృథా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టాల్సింది పోయి, ఎంతమంది పిల్లలు వచ్చారు? ఎంత బియ్యం ఖర్చయింది? మెనూ ప్రకారం వండారా లేదా? అనే లెక్కల్లో మునిగిపోతున్నారు. దీనివల్ల బోధనా సమయం తీవ్రంగా దెబ్బతింటోంది.అలాగే ఉపాధ్యాయుడి ప్రాథమిక విధి చదువు చెప్పడం. కానీ నేడు డిజిటల్ అటెండెన్స్, వివిధ రకాల యాప్‌లలో డేటా ఎంట్రీ, ఎన్నికల విధులు, జనాభా గణన, ఆరోగ్య పరీక్షల రికార్డుల నిర్వహణ వంటి వందలాది బోధనేతర పనులు టీచర్ల నెత్తిన పెట్టారు.సమగ్రమైన శిక్షణ, కంప్యూటర్ ఆపరేటర్ల సాయం లేకుండా ప్రతి చిన్న విషయానికి ఫోన్‌లలో యాప్‌లు డౌన్‌లోడ్ చేసి వివరాలు నమోదు చేయమనడం గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులకు శాపంగా మారింది. ఈ పనుల్లో ఏ చిన్న తప్పు జరిగినా లేదా ఆలస్యమైనా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ఉపాధ్యాయులను మానసిక ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతం కావాలంటే ఉపాధ్యాయులపై కేవలం అజమాయిషీ చలాయించడం ఆపాలి. సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాలి. ప్రతి పాఠశాలకు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల నిర్వహణ కోసం ‘గ్రీన్ ఛానల్’ ద్వారా నేరుగా నిధులు విడుదల చేయాలి.మధ్యాహ్న భోజన పథకం బిల్లులను ప్రతి నెలా ఒకటో తేదీన చెల్లించాలి. నాణ్యమైన సరుకులను సివిల్ సప్లైస్ ద్వారా నేరుగా పాఠశాలలకే చేర్చాలి. భోజన పర్యవేక్షణ, మౌలిక వసతుల నిర్వహణ కోసం స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ) సాయం తీసుకోవాలి లేదా పాఠశాలల్లో కేర్‌టేకర్లను నియమించాలి. డిజిటల్ రికార్డుల నిర్వహణ కోసం క్లస్టర్ లేదా మండల స్థాయిలోనే ప్రత్యేక డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులకు బోధనకు మాత్రమే పరిమితం చేయాలి. ఉపాధ్యాయులను కత్తుల వంతెనపై నడిపిస్తూ అద్భుతాలు చేయాలనడం అన్యాయం. వసతులు కల్పించకుండా బాధ్యులను చేయడం వల్ల ఉపాధ్యాయులలో ఉత్సాహం తగ్గి, అది పరోక్షంగా విద్యార్థుల విద్యపై ప్రభావం చూపుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను గ్రహించి, ఉపాధ్యాయులపై ‘కొరడా’ ఝులిపించే ధోరణిని పక్కనపెట్టాలి. వారికి స్నేహపూర్వక, ఒత్తిడి లేని వాతావరణాన్ని అందించి, మౌలిక వసతులు కల్పిస్తేనే ‘మన బడి’ ఆశయాలు నిజమైన అర్థంలో నెరవేరుతాయి.

కోడెపాక ప్రభాకర్, 9701577516

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -