Thursday, July 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅబద్ధాలు అంధవిశ్వాసాలు అధికారానికి తోడైతే?

అబద్ధాలు అంధవిశ్వాసాలు అధికారానికి తోడైతే?

- Advertisement -

ఆల్బర్ట్ ఐన్‌‌స్టీన్‌ అంటాడు – ‘‘మూడు బలమైన శక్తులు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. అవి 1. మూర్కత్వం 2. భయం 3.అత్యాశ’’ అని! ఇక్కడ మనం చిన్న మార్పు చేసుకోవాలి. ప్రపంచం అన్న చోట మన దేశం అనుకోవాలి. అంతే! దేశ పరిస్థితి అంతా అర్థమైపోతుంది. మన నాన్ బయలాజికల్ ప్రధానిలో ఉన్న విద్వేషానికి హద్దే లేదు. 2024 ఆగష్టు 15న ఆయన ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఇది స్పష్టంగా వ్యక్తమయింది. ‘‘ఇప్పటివరకు మనకు ఉన్న సివిల్ కోడ్ కమ్యూనల్ సివిల్ కోడ్’’ అని ఆయన అనడం డా.బి.ఆర్.అంబేద్కర్‌ పట్ల ఘోర అపరాధం చేసినట్లవుతుంది. 1950 దశకం మధ్యలో అంబేద్కర్ హిందూ పర్సనల్‌ లా లో చాలా సంస్కరణలు తెచ్చాడు. అయినా కూడా, అనాటి ఆరెస్సెస్, జనసంఘ్‌లు తమ తీవ్ర అసమ్మతిని ప్రకటించాయి. అప్పట్లో ప్రధాని సుభాష్ చంద్రబోస్ గురించి ఓ మాట చెప్పాడు -‘‘సుభాష్ చంద్రబోస్ ఫైల్ తెరుస్తా! విషయాలన్నీ బయట పెడతా!!’’ – అని. నిజంగానే వెళ్లి ఆ ఫైల్ తెరిచాడు. తెరవగానే అందులో ‘‘ఆరెస్సెస్ దేశానికి ప్రమాదకరం’’ అని బోస్ బాబు రాసుకున్న వాక్యం, మొదటి పేజీలోనే కనపడింది. అంతే! ఫైల్ బంద్! ఆయన నోరు కూడా బంద్ – మళ్ల ఆ ఊసెత్తలేదు. ‘‘మహాత్మా గాంధీ పేరు కూడా ఎ‌ప్స్టీన్‌ ఫైల్లో ఉంది’’ అని ప్రకటించినవాడు సుధాంశు త్రివేది, బీజేపీ రాజ్యసభ సభ్యుడు.

అసలు గాంధీజీ చనిపోయింది జనవరి 30, 1948. జాఫ్రీ ఎ‌ప్స్టీన్‌ పుట్టింది జనవరి 20, 1953. గాంధీ మరణించిన తర్వాత సుమారు ఐదేండ్లకు పుట్టినవాడు పెరిగి పెద్దవాడై తన ఫైల్స్‌లో రాసుకు న్నాడా? అంటే అప్పటికి ఓ నలభైయేండ్ల క్రితం చనిపోయిన గాంధీతో తిరిగి, ఆయన దురలవాట్లు తెలుసుకుని తన ఫైల్స్‌‌లో రాసుకున్నాడా? విడ్డూరంగా లేదూ? ఉండదు! బీజేపీ మేధావులకు ఇది మామూలే- వాళ్లు ఇలా ఎవరికి ఎవరితో నైనా ఎప్పుడైనా సంబం ధాలు కలిపేయ గలరు. వాళ్లది మరి మామూలు ఫ్యాక్టరీయా? తమాషానా ? ‘‘ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ట్రంప్ కుటుంబ సభ్యులు, ఇతర నేతలు క్షేమంగా ఉన్నారని తెలిసి ఉప శమనం పొందాను’’- డోనాల్డ్ ట్రంప్‌పై కా‌ల్పుల ప్రయత్నం విఫలమయ్యాక భారత ప్రధాని పంపిన సందేశం అది! మరి వెనిజులా అధ్యక్షుణ్ణి భార్యతో సహా కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించినపుడు ఇలానే ఖండించి ఉంటే కొంచెం విలువ ఉండేది కదా? ఇజ్రాయిల్ 21 వేల మంది పసిపిల్లలతో సహా 71 వేల మంది పాలస్తీనా ప్రజల్ని చంపినపుడు ఇలానే బాధపడి ఉంటే ఇంకొంచెం విలువ ఉండేది కదా? ఇరాన్ సుప్రీం లీడర్‌ను కుటుంబ సభ్యులతో సహా హత్య చేసినప్పుడు భారత ప్రధాని హోదాలో సంతాపం తెలియజేస్తే కూడా కొంచెం విలువ ఉండేది కాదా? అసలు ప్రజాస్వామ్యం- అనే మాటే ఆయన నోట విచిత్రంగా ఉంది కదా? పైగా హింస గురించి మాట్లాడడం – గుజరాత్, మణిపూర్ మారణ కాండలు ఈ దేశ ప్రజలు ఎలా మరిచిపోగలరూ ?

భారత చైనా దేశాలు ‘నరక కూపాలు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నందుకు ఐరాన్, అతనిపై విరుచుకుపడింది. ‘‘భారత్‌, చైనాలు నరక కూపాలు కాదు, మహోన్నత దేశాలు! నాగరికతకు పుట్టినిళ్లు! నీ అమెరికా ఏర్పడిందే 1776లో. నీ చరిత్ర అంతా 250 ఏండ్లు మాత్రమే. పురాతన నాగరిక గల దేశాల గూర్చి నువ్వు మాట్లాడతావా?’’ అని చివాట్లు పెట్టింది. అతనంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి. పెద్దగా చదువుకోలేదు. దానికి తోడు మూర్కత్వం. ఇక్కడ భారతీయులుగా మనం సిగ్గు పడాల్సిందేమంటే, ట్రంప్‌‌నకు సరెండరయిన మన నరేందర్ మోడీ మానంగా ఉండిపో యారు. దేశాన్ని తిట్టినా నోరు విప్పలేదు. ఇదీ అదే కేసు. ట్రంప్ లాగే చదువుకోలేదు. నాగరికత తెలియదు. అన్నీ షేమ్ షేమ్! అంతర్జాతీయ విషయాల గూర్చి మాట్లాడేందుకు టెలిప్రాఫ్టర్ తయారు కాలేదేమో. దేశంలో జనం -‘ఏది మా సిలెండర్? నరేందర్ జీ’ అని గగ్గోలు పెడుతున్నా నోరు విప్పలేదు. ఈ సమస్యను నెహ్రూకు ఎలా అంట గట్టాలా అని దీర్ఘాలోచనలో ఆయన యంత్రాంగమంతా మునిగిపోయి ఉందేమో! ఇన్నేండ్లుగా అ పెద్ద సీట్లో కూర్చుని కూడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు. అంతర్జాతీయ అంశాల మీద, యుద్ధాల మీద ప్రకటనలు లేవు, నిరసించడాలు, ఖండిం చడాలు లేవు. అంతర్జాతీయ వేదికల మీద ఇతర దేశాల నాయకులను కలిసినప్పుడు మాత్రం ఎదురెళ్లి బలవంతంగా కౌగలించుకోవడం -ఇహ్హీహ్హీ -అని వెర్రినవ్వులు నవ్వడం – దాన్ని మోడి మీడియా మోసుకొచ్చి దేశంలో చూపించడం.

అక్కడేదో అంతర్జాతీయంగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఇక్కడ వార్తా ప్రసారాలు చేసి, విశ్వగురువని ప్రకటించడం అవసరమా? ఆ పార్టీ, ఆ ప్రభుత్వ నేతలు సిగ్గొదిలేశారని అనుకుందాం. మరి ఈ జర్నలిస్టులకు ఏమైందీ ? ఎంత అమ్ముడుపోతే మాత్రం ఇంతగా ఊడిగం చేయాలా? కొంచెమైనా నైతిక విలువలు పాటించాలా వద్దా? ఇక సామాన్యుల సమస్యల గూర్చి మాట్లాడే ది ఎవరూ? ఫోర్త్ పిల్లర్ కుప్పగూలినట్టేనా? కాగ్‌ నివేదిక ఎన్డీయే ప్రభుత్వంలో జరిగిన భారీ అవినీతిని బహిర్గతం చేసింది. ప్రభుత్వ నిధుల నుండి దాదాపు రూ. 54 వేల కోట్లు మాయమయ్యాయి. కార్పోరేట్ల నుంచి వసూలు కావల్సిన 74 వేల కోట్ల ఆదాయపన్ను వసూలు కాలేదు. విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద 50 వేల కోట్లకు వివరాలు లేవు- గల్లంతయ్యాయి. ఇదంతా ఏమిటని కాగ్ (సిఎజి) ప్రశ్నించింది. దీనితో ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరిగిందని తేలిపోయింది. ఏముంది? దీని వెనక విదేశీ శక్తుల కుట్ర ఉందనో లేక నెహ్రూ- ఇందిరా గాంధీల తప్పిదం ఉందనో ప్రకటిస్తారు. అమాయక దేశ పారుల్ని తమ అంధభక్తులుగా మార్చుకుం టారు. చూస్తూనే ఉన్నాం ఇన్నేండ్లు? ఇదిలా ఉండగా మోడీ ప్రభుత్వం దేశంలోని కార్పోరేట్ దిగ్గజాలను రూ.16 లక్షల కోట్ల అప్పు – రుణమాఫీ చేసింది. ఇటీవలే చూశాం కదా ? ఒడిశా రాష్ట్రంలో ఒక సామాన్యుడు బ్యాంకు ఖాతా నుండి పందొమ్మిది వేల మూడువందల డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి చనిపోయిన తన చెల్లెలి మృతదేహాన్ని భూమిలోంచి తవ్వి తీసుకు రావల్సి వచ్చింది.

ఎకాంట్ ఆమె పేరుతో ఉంది. ‘ఆమెను తీసుకొస్తే డబ్బు ఇస్తాం’ – అని బ్యాంక్‌ ‌వాళ్లు అన్నందుకు ఆ వృద్ధుడు ఆ పని చేయాల్సి వచ్చింది. అందుకే కాబోలు విక్టర్ హూగో అంటాడు ‘‘ధనవంతుల స్వర్గం- పేదల నరకంతోనే నిర్మించబడుతుందని!’’ ‘‘ఉత్తర ప్రదేశ్ రోడ్ల మీద నమాజ్ చదవకుండా చేశాం. మసీదు నుండి అజాన్ వినబడకుండా చేశాం’’ అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించుకున్నాడు. బీజేపీ ఎక్కడ అధికారంలో ఉన్నా ఇంతకన్నా చేసేదేమీ ఉండదని వారికి వారే చెప్పుకున్న ట్లయ్యింది. ‘‘నాకు రక్తం ఇవ్వండి! నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’’ అని స్వామి వివేకానంద చెప్పినట్లు యూపీ సీఎం యోగి బహిరంగ సభలలో సిగ్గు విడిచి చెపుతూ ఉంటాడు. ఎందుకంటే వారు వివేకానందను హిందూమత ఉద్గార కుడిగా స్వంతం చేసుకున్నారు కాబట్టి! వాస్తవమేమంటే, పై మాటలన్నది స్వామి వివేకానంద కాదు- సుభాష్ చంద్రబోస్! చరిత్ర లేని వాళ్లూ, చరిత్ర తెలుసుకోని వాళ్లు ఇలా అబద్దాలనే చరిత్రగా ప్రచారం చేస్తుంటారు. మోడీ టీం అంటే మాటలా? చదువులూ, వివేకమూ ఉండవ్ గాక ఉండవ్‌. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అ పది సంవత్సరాలూ బాంబు పేలుళ్లు జరుగుతూ ఉండేవి. ఉగ్రవాదులకు వారు బిర్యానీ తినిపించేవారు’’ – అని ఈ దేశ హోంమంత్రి అమిత్ షా ప్రకటించాడు. సరే- పార్లమెంట్‌పై దాడి ఎవరి హయాం లో జరిగిందో చెప్పలేదేం? ‌పహల్గామ్‌ దాడి, అక్షరధామ్ దాడి, వైష్ణోదేవి దాడి, ఫుల్వామా దాడి, ఢిల్లీ బాంబు పేలు‌ళ్లు వగైరా – అన్నీ ఎవరి ప్రభుత్వం ఉండగా జరిగాయో.. ఈ దేశ ప్రజలకు తెలియదనుకున్నాడు పాపం! అదీగాక, ఆహ్వానం లేకుండానే పాకిస్తాన్ పోయి బిర్యానీ తిని వచ్చిందెవరో – ఆ సంగతి చెప్పలేదేమిటీ? అని సామాన్యులు తమలో తాము చర్చించుకుంటున్నారు.

నేటి మన కేంద్ర ప్రభుత్వపు పనితీరును తెలియజేసే ఒక ముఖ్యమైన రిపోర్టు గురించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంది. స్టేట్ ఆఫ్ వర్టింగ్ రిపోర్టు – 2026 ప్రకారం మన దేశం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఈ రిపోర్టును యూరోపియన్ కమిషన్ విడుదల చేసింది. 20-29 మధ్య వయసుగల యువత యువకుల్లో చదువులు ఎలా ఉన్నాయి? వారికి దొరికే ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అని యూరోపియన్ కమిషన్ ప్రపంచ దేశాలలో అధ్యయనం చేసింది. ఆ సర్వే వెల్లడించిన వివరాలను బట్టి- జర్మనీలో నిరుద్యోగం అతి తక్కువగా 5.2 శాతం ఉంది. యూరోప్ దేశాల్లో కొంచెం అటూ ఇటుగా 12 శాతం నిరుద్యోగముంది. అలా చూసుకుంటూ వెళితే ఇటలీలో 14.4 శాతం నిరుద్యోగముంటే స్పెయిన్‌లో 19.3 శాతం – గ్రీస్‌లో 27 శాతం ఉంది. అలా ముందుకు వెళితే, భారత్‌లో 39 శాతం నిరుద్యోగముంది. ప్రపంచ దేశాలతో పోల్చిచూస్తే ఇదే అత్యధికం! ఏదో ఒక విషయంలోనైనా దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని మన విశ్వగురువు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ రకంగా ప్రపంచ దేశాలలో అత్యధిక యువతీ యువకులున్న దేశం భారత్! అత్యధికం నిరుద్యోగంతో తల్లడిల్లుతున్న దేశం భారత్ !! మతం పేరుతో జనాన్ని విడగొట్టడంలో విజయులయారు. అధిక సంఖ్యలో అంధభక్తుల్ని కూడా తయారు చేశారు.

మన దేశనేతలు తమ కొడుకులూ కూతుళ్లను విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివించుకుంటారు. కానీ, మన సామాన్య జనానికి జెండాలిచ్చి జై శ్రీరామ్ అనమంటారు. అయితే వారికి ఆకలి దప్పులు లేకుండా మోడీ టీం ఏర్పాట్లు చేసింది. దాహమేస్తే ఆవు మూత్రం, ఆకలేస్తే ఆవు పేడ ఉండనే ఉన్నాయి. ఇకనేం ? ‘‘ఏ రాజనీతికయితే అబద్దాలు, అంధ విశ్వాసాలు ఆధారమవుతాయో అక్కడ సామాన్యుడికి ఎప్పటికీ న్యాయం లభించదు” అని అన్నాడు పెరియార్‌. ఆయన చెప్పింది అక్షరాలా నిజం! గత పన్నెండేళ్లుగా ఈ దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అనుభవిస్తున్నారు. మార్పు కోసం తహతహలాడు తున్నారు. సమాజం తగులబడుతూ ఉంటే- మన ఇంట్లో మనం భద్రంగా ఉన్నామనుకోవడం పొరపాటు. ఆర్థిక అసమానతలు, యుద్ధాలు, పర్యావరణ వినాశనం వల్ల- వాటి ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇది తప్పదు. అందువల్ల, సమిష్టి కృషితో మాత్రమే మనల్ని మనం రక్షించుకోగలం! భవిష్యత్తరాలకు శాంతియుతమైన, సురక్షితమైన సమాజాన్ని మిగల్చగలం. ​- నేషనల్‌ ‌బుక్‌ ట్రస్ట్ పూర్వ సలహా సంఘ సభ్యులు, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -