ప్రజల గొంతుకలను అసెంబ్లీకి పంపండి

– ధన బలం.. ప్రజాబలం మధ్యనే పోటీ
– మిర్యాలగూడలో జూలకంటి ఇంటింటి ప్రచారం
– కమ్యూనిస్టులతోనే ప్రజాసమస్యల పరిష్కారం
– మంచాలలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
”ప్రజా సమస్యల పరిష్కారం కమ్యూనిస్టులతోనే సాధ్యం.. ఓటర్లు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్యను అసెంబ్లీకి పంపాలి..” అని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో పగడాల యాదయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇబ్రహీంపట్నం అభివృద్ధి చెందిందని జాన్‌వెస్లీ చెప్పారు. భవిష్యత్‌లో కూడా నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా.. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల మాయమాటలను నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు.
నవతెలంగాణ- మిర్యాలగూడ/ చిట్యాల/ భువనగిరి/ చౌటుప్పల్‌ రూరల్‌/ మంచాల
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజల గొంతుకలను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని సీపీఐ(ఎం) మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో లేని అధికార పార్టీ ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తాను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివద్ధి పనులే కనిపిస్తున్నాయి తప్ప కొత్తగా ఏమీ లేదనేది ప్రజలు గుర్తిం చాలన్నారు. కాంగ్రెస్‌, బీఅర్‌ఎస్‌ అభ్యర్థులు దందాలు చేసి మిర్యాలగూడను దోచుకోవడానికే ఓట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గెలవడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలని కోరారు. పార్టీలకతీతంగా చట్టసభల్లో ప్రజా గొంతుక వినిపించే అందరివానిగా ప్రజలు తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలన్నారు.
అభివృద్ధికి ఆమడ దూరంలో భువనగిరి ‘కొండమడుగు’ ప్రచారంలో ఫైళ్ల ఆశయ్య
భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని. సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ్య అన్నారు. భువనగిరి పట్టణ కేంద్రంలో అభ్యర్థి కొండమడుగు నర్సింహతో కలిసి ఆశయ్య ప్రచారంలో పాల్గొన్నారు. భువనగిరి మున్సిపాలిటీ ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా అభివృద్ధి జరగలేదన్నారు.
కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ.. పూజారి లేని దేవాలయం.. మునుగోడులో ఎండి. జహంగీర్‌
కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ, పూజారి లేని దేవాలయం రెండూ ఒక్కటేననిసీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరు నర్సిరెడ్డి ఎన్నికల ప్రచారం చౌటుప్పల్‌ మండలం జై కేసారం గ్రామంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జహంగీర్‌ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీిఐ, సీపీఐ(ఎం)ను నమ్మించి ఓట్లు వేయించుకున్న బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
మతోన్మాద బీజేపీని ఓడించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కందాల రంగారెడ్డి, జక్కిడి ప్రతాపరెడ్డి, దేప జనార్దన్‌ రెడ్డి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక ప్రజా ఉద్యమాలు చేశానని తెలిపారు.

పార్టీలు మారే అభ్యర్థులకు ఓట్లు వేయకండి.. : చిట్యాల పరిధిలో సీపీఐ(ఎం) సభలో చెరుపల్లి
పార్టీలు మారే అభ్యర్థులకు ఓటు వేసే కంటే నిజాయితీగా పనిచేసే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించడం ద్వారా చట్టసభల్లో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి దోహద పడుతుందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నకిరేకల్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పేదల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) చట్టసభల్లో ప్రజల పక్షాన తమ వాణిని వినిపించాలనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు.

Spread the love