ఆదర్శ కమ్యూనిస్టు కొండిగారి

– రెండు సార్లు ఎమ్మెల్యే అయినా సాధారణ జీవితం
–  ప్రజావేదికేదైనా సామెతలతో రక్తి కట్టించే ప్రసంగం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కొండిగారి రాములు నిస్వార్థానికి నిలువుటద్దం. కమ్యూనిస్టు ఆదర్శాలను ముందుకు తీసుకుపోవడమే కర్తవ్యం. పుచ్చలపల్లి సుందరయ్యనే స్ఫూర్తి. రెండుసార్లు ఎమ్మెల్యే అయినా ప్రజల మినిషిగా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆయన జీవితంపై రాజకీయాలకు అతీతంగా ఎవరూ వేలెత్తి చూపే వారు కాదు. కొండిగారిలా బతకడం సాధ్యం కాదంటారు. ప్రజల మనిషిగా ముందుకు సాగుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలో కొండిగారి రాములు జన్మించారు. ఆయన తండ్రి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా పని చేశారు. రాములు బాల్యంలో 1952లో పంచాయతీ సమితి ఎన్నికల్లో ఆయన తండ్రి కనకయ్య వార్డు సభ్యుడిగా పోటీ చేశారు. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీలో ఆయన తండ్రి పని చేస్తున్నారని అప్పటి దొరలు కొండిగారి రాములుపై కక్షగట్టారు. 9వ తరగతిలోనే చురుకైన కార్యకర్తగా వ్యవహరించడంతో పాఠశాల నుంచి తొలగించాలని అధికారులకు లేఖ రాశారు. అతనిలో కమ్యూనిస్టు భావజాలం ఉందని పాఠశాల నుంచి పంపించారు. చదువు మానేశాక 14 ఏటనే అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ తరఫున పిలాయిపల్లి పాపిరెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అదే స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. కుటుంబ పోషణకు వ్యవసాయ, కూలీ పనులు చేస్తూనే పార్టీ కోసం పని చేశారు. ఈ తరుణంలో 1989లో శాసన సభ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి ఎన్నికల్లో మొత్తం రూ.88వేలు, రెండోసారి ఎన్నికల్లో రూ.3 లక్షలు పార్టీ విరాళాలు సేకరించి ఖర్చు చేసింది.
భూ పోరాటాలకు పదును..
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూపోరాటాలకు పదును పెట్టారు. అప్పట్లో అసైన్‌మెంట్‌ కమిటీ చైర్మెన్‌గా స్థానిక ఎమ్మెల్యేలకే హక్కు ఉండేది. దీంతో నియోజకవర్గంలోని నిరుపేదలకు భూములు పంపిణీ చేయాలని సంకల్పించారు. తద్వారా కొండిగారి రాములు ఆధ్వర్యంలో 20 వేల ఎకరాలను పేదలకు పంచి పట్టాలు ఇచ్చారు. బావుల నిర్మాణం, రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ల అందజేత, బస్సు డిపో నిర్మాణం, ప్రతి గ్రామానికీ బస్సులు, ఇబ్రహీంపట్నంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆయన సారధ్యంలోనే వచ్చాయి. ఆ భూములనే నేడు ప్రభుత్వం సెజ్‌లు, కంపెనీల పేరుతో వెనక్కి తీసుకుంటోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు లక్షల్లో జీతాలుంటే.. అప్పట్లో కొండిగారి రాములు మొదట ఎమ్మెల్యేగా చేసినప్పుడు రూ.7,500 జీతం వచ్చేది. ప్రస్తుతం ఆయనకు వచ్చే పింఛన్‌తోనే నిరాడంబర జీవితం గడుపుతున్నారు.. ఆయన నేటి తరం నేతలకు ఆదర్శప్రాయం.
సుందరయ్య ఆదర్శం..
ఆదర్శమూర్తి, మార్గదర్శకుడు పుచ్చలపల్లి సుందరయ్యనే రాములుకు ఆదర్శం. ఆయనంటే పిచ్చి అభిమానం. ఆ దారిలోనే హంగూ ఆర్భాటాలకు పోకుండా సాధారణ జీవితానికి అలవాటు పడ్డారు. త్యాగధనుడు సుందరయ్య బాటలోనే నడవాలని తపించారు. అదే బాటలో నడుస్తున్నారు.
ఎన్నికల ఖర్చు రూ.88 వేలే..
1989లో ఎన్నికల ఖర్చు రూ.88వేలు మాత్రమే. 1994లో రూ.3 లక్షలు ఖర్చు మాత్రమే. ఆ డబ్బు కూడా పార్టీ విరాళాలు సేకరించి ఖర్చు చేసిందే. అప్పట్లో గోడల మీద రాతలు, నాయకులు గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ ప్రచారం చేసేవారని గుర్తు చేస్తుంటారు పార్టీ శ్రేణులు.

Spread the love