శరవేగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు

Palamuru-Rangareddy lift works are fast-tracked– ఇంజినీరింగ్‌ అద్భుతంగా పేర్కొంటున్న నిపుణులు
– ఆసియాలోనే అతిపెద్ద పంపుహౌజ్‌
– కాళేశ్వరాన్ని మించిన బాహుబలి మోటర్లు
– వెట్‌రన్‌కు నేడు శ్రీకారం
– 80 శాతం ప్రాజెక్టు పూర్తి:ఉన్నతాధికారులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మూడు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చనున్న ఈ ప్రాజెక్టు పనులు, దాదాపు 89 శాతం పూర్తయ్యాయని సాగునీటి శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది ఓ ఇంజినీరింగ్‌ అద్భుతం అని కూడా పేర్కొంటున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు పాలమూరు-రంగారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. తద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. దాదాపు 19 నియోజకవర్గాల్లోని ఆయకట్టును వరప్రదాయిని కానుంది. 2015లో ప్రారంభమైన నిర్మాణాన్ని రెండు ఫేజులుగా చేపడుతున్నారు. పేజీ-1లో ప్రాజెక్టు ప్రధాన పనులు, ఫేజ్‌-2లో కాలువలు, ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి. తొలుత శంకుస్థాపన నాటికి ప్రాజెక్టుకు రూ. 35,200 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరుచేశారు. ఇప్పటివరకు సాగునీటి శాఖ అధికారిక సమాచారం ప్రకారం రూ.26,262 కోట్లు ఖర్చు చేశారు. కాగా ఈ ప్రాజెక్టు వ్యయం మూడు రెట్లు పెరుగుతుందనే వ్యాఖ్యానాలు ఇటు అధికారులు, అటు సాగునీటిరంగ నిపుణుల నుంచి వస్తున్నాయి.
ఈనెల 16న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి వెట్‌రన్‌కు స్వీచ్ఛాన్‌ చేయనున్నారు. ఇప్పటికే డ్రైరన్‌ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రాజెక్టు పనులే పూర్తికాలేదనీ, పూర్తికాని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవాలేంటనీ, పనులు నాణ్యంగా జరగడం లేదంటూ ప్రతిపక్షాల నుంచి అరోపణులు, విమర్శలు వస్తున్న తరుణంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ‘ప్రెస్‌టూర్‌’ నిర్వహించింది. హైదరాబాద్‌ నుంచి మూడు బస్సుల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాను తీసుకెళ్లింది. ప్రాజెక్టును భౌతికంగా చూపించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ప్రాజెక్టు పరిధిలోని నార్లపూర్‌ పంపుహౌజ్‌, హెడ్‌రెగ్యులేటర్‌, యేదుల పంపుహౌజ్‌ , సర్జ్‌పూల్‌ను మీడియాకు చూపించింది.
ప్రాజెక్టుకు సంబంధించి సమాచారాన్ని మీడియాకు అందించింది. సాంకేతిక అంశాలను తెలియజేసింది. స్థానికంగా ఉన్న సాగునీటి చీఫ్‌ ఇంజినీర్‌ స్థాయి అధికారితో పాటు జిల్లా, డివిజనల్‌ అధికారులు మీడియాకు అందుబాటులో ఉన్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మంత్రులు వి. శ్రీనివాస్‌గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సైతం చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ఎత్తిపోతల పథకంగా అభివర్ణించారు . కాళేశ్వరం కంటే పాలమూరు ప్రాజెక్టుకు భారీ బాహుబలి మోటర్లను బిగిస్తున్నట్టు చెప్పారు.
వరప్రదాయిని కానుందా ?
ఈ ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని కానుందని ఇటు అధికారులు, అటు మంత్రులు చెప్పారు. గులాబీ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆప్రాజెక్టులతో రాష్ట్రంలోని చాలా జిల్లాలకు సాగు, తాగునీటి సమస్య తీరనుంది. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీని ద్వారా నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణ్‌పేట, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్లగొండ జిల్లాలకు ప్రధానంగా లబ్దిచేకూరనుంది. 67.67 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఐదు రిజర్వాయర్లను నిర్మించారు. నాలుగు పంపుహౌజులతో 145 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం కలిగిన 34 పంపులను ఏర్పాటు చేశారు. యేదుల పంపుహౌజ్‌ దగ్గర అసియాలోనే అతిపెద్దదైన సర్జ్‌పూల్‌ను నిర్మించారు. అత్యధిక సామర్థ్యంగల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డును మించి 145 మోగావాట్ల సామర్థ్యంగల మహా బాహుబలి మోటర్లను వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కడా వినియోగించని విధంగా మూడు పంపుహౌజ్‌లూ ఉన్నట్టు సాగునీటిశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
నీటిని ఎత్తిపోసే గరిష్ట ఎత్తు 672 మీటర్లు
ఈ ప్రాజెక్టు గరిష్టంగా 672 మీటర్లనుంచి నీటిని ఎత్తిపోయనుంది. మొత్తం పథకం సొరంగ మార్గం పొడవు 6167 కిలోమీటర్లు ఉందని అధికారులు చెప్పారు. ప్రధాన కాలువల పొడవు 915.47 కిలోమీటర్లు కాగా, ఇంకా అవి ప్రారంభం కాలేదు. తాగునీటి కోసం 7.15 టీఎంసీలు, పరిశ్రమల కోసం మూడు టీఎంసీలు, సాగునీటికి 79 టీఎంసీలు వినియోగించనున్నారు. తొమ్మిది పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారని అధికారులు అంటున్నారు. ఈ మోటర్లను దేశీయ దిగ్గజ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ తయారుచేయడం గమనార్హం. ప్రాజెక్టుకు సంబంధించి జలాశయాలు నార్లపూర్‌, యేదుల, వట్టెం, కరివెన, ఉద్దండపూర్‌ ప్రాంతాల్లో ఉన్నాయి.
90 మీటర్ల ఎత్తు..30 మీటర్ల వెడెల్పు
యేదుల వెరసీ ఎదుల పంపుహౌజ్‌
యేదుల సర్జ్‌పూల్‌ సొరంగంలోకి వెళతుంటే అద్భుతంగానే అనిపించింది. లోపల వాతావరణం సాధారణంగానే ఉంది. ఆక్సిజన్‌ సమస్య రాకుండా సాంకేతికతను ఉపయోగించి పలు జాగ్రత్తలు తీసున్నారు. మొత్తం 9 ప్లస్‌ 1 మోటర్లతోప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఒకేసారి తొమ్మిది మోటర్లు ఫెయిల్‌ అయినా ఒకటి అదనంగా నడిచేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఒకసారి మోటర్‌ను ఆన్‌ చేస్తే, దాదాపు ఏడాది నుంచి ఏడాదిన్నరపాటు ఆపకుండా రన్‌చేయవచ్చని స్థానిక ఇంజినీర్లు చెప్పారు. కాళేశ్వరం కంటే ఈ మోటార్లు చాలా పెద్దవని కూడా మీడియాకు వివరించారు. సర్జ్‌పూల్‌ సొరంగం 90 మీటర్ల ఎత్తులో, 30 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. శనివారం వెట్‌రన్‌ నేపథ్యంలో సర్జ్‌పూల్‌ను పూర్తిగా నింపనున్నట్టు ఇంజినీర్లు తెలిపారు. ఒకసారి సర్జ్‌పూల్‌ నీటితో నిండాక మళ్లీ చూడటం కుదరనీ, ఇప్పుడే చూడాలని ఇంజినీర్లు పదే పదే సూచించారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మీడియా అంతా సర్జ్‌పూల్‌ను చూసేందుకు ఆసక్తికనపరిచారు.
రెండు ఫేజులు3
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రెండు ఫేజులుగా విభజించారు. ఫేజు-1లో ప్రాజెక్టు ప్రధాన పనులు అంటే హెడ్‌రెగ్యులేటర్‌, టన్నెళ్లు, పంపుహౌజ్‌లు, సర్జ్‌పూల్‌, మోటర్లు ఉన్నాయి.
ఫేజు-2లో ప్రధాన కాలువలు, డ్రిస్టీబ్యూటరీ లైన్లు, లైనింగ్‌ పనులు ఉన్నాయి. ప్రస్తుతం ఫేజు -1 పనులు మాత్రమే 80 శాతం పూర్తయినట్టు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు తెలిపారు. అలాగే మోటర్లల్లో తొమ్మిదికిగాను మూడు సిద్ధమైనట్టు వివరించారు. వెట్‌రన్‌ రోజు ఒక మోటరును ప్రారంభించనున్నారు. నార్లపూర్‌ పంపుహౌజ్‌ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధం చేశారు. కోర్టు కేసులు, ఇతర సాంకేతిక అంశాల మూలంగా ఫేజు-2 పనులు ఆలస్యమయ్యాయి.కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ వాతావరణ అనుమతులకు సైతం ఇటీవలే సిఫారసు చేసింది.

Spread the love