Sunday, May 10, 2026
E-PAPER
Homeజాతీయంలేబర్‌కోడ్‌లు దేశ కార్మికవర్గానికి మరణగంట

లేబర్‌కోడ్‌లు దేశ కార్మికవర్గానికి మరణగంట

- Advertisement -

సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం, ఉపాధ్యక్షులు తపన్‌సేన్‌ కార్మిక వ్యతిరేక కోడ్‌ల ప్రతులు దగ్ధం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నాలుగు కార్మిక లేబర్‌ కోడ్‌లు దేశ కార్మిక వర్గానికి మరణగంట అని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం, ఉపాధ్యక్షులు తపన్‌సేన్‌, కార్యదర్శి ఏఆర్‌ సింధు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్‌ల నిబంధనలను నోటిఫై చేసిన నేపథ్యంలో శనివారం సీఐటీయూ కేంద్ర కార్యాలయం బీటీఆర్‌ భవన్‌లో గెజిట్‌ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం, ఉపాధ్యక్షుడు తపన్‌ సేన్‌, కార్యదర్శి ఏఆర్‌ సింధు మాట్లాడారు. ఈ కార్మిక కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం 2020లోనే పార్లమెంటులో ఆమోదింపజేసిందని, దేశవ్యాప్తంగా జరిగిన భారీ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ కార్మిక కోడ్‌లను అమలు చేయకుండా తాత్కాలికంగా విరమించుకుందని విమర్శించారు.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం బీజేపీ ప్రభుత్వం కార్మికకోడ్‌లను అమలులోకి తెచ్చిందని అన్నారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈ నిబంధనలను నోటిఫై చేసిందని విమర్శించారు. ఈ లేబర్‌కోడ్‌లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక ఆందోళనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంలో భాగంగానే ఈ నోటిఫికేషన్‌ ఇచ్చిందని అన్నారు. ఈ కార్మికకోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతాయని, ఈ కోడ్‌ల అమలుకు దేశ కార్మికులు అనుమతించబోరని స్పష్టం చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఆదివారం నిరసనలు తెలపాలని సీఐటీయూ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.

అదే విధంగా సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలు, అన్ని రాష్ట్ర కమిటీలు నిరసనలు భారీగా చేపట్టాలని కోరింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం. సాయిబాబు, కార్యదర్శి ఆర్‌. కరుమలయన్‌, సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్‌ సక్సేనా పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లేబర్‌ కోడ్‌ల రూల్స్‌ గెజిట్‌ పత్రులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సీఐటీయూ సహాయ కార్యదర్శి ఉమేష్‌ మాట్లాడారు. లేబర్‌ కోడ్‌లు కార్మికుల సంక్షేమం కోసం తీసుకొచ్చినవి కావని, కార్పొరేట్ల కోసం రాసుకున్న బానిస సంకెళ్లని విమర్శించారు. వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని ఈ ఈ ప్రభుత్వం ఉరి తీస్తోందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -