నేను ఎవరికీ గులాంను కాదు..దోస్తీకి మాత్రమే గులాం
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
విద్య కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడం
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి బీజేపీ, బీఆర్‌ఎస్ అడ్డంకులు
నగరంలో నైట్ ఎకానమీని ప్రోత్సహిస్తాం : చంచల్‌గూడ సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ – సిటీ బ్యూరో/చార్మినార్
తనను ఎవరూ ధమ్కీ ఇచ్చి భయపెట్టలేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బెదిరిస్తే భయపడనని అన్నారు. తాను ఎవరికీ గులామ్‌ను కాదని, దోస్తీకి మాత్రమే గులామ్‌నని తెలిపారు. బెదిరింపులకు తాను లొంగే వ్యక్తిని కాదన్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. గురువారం సాయంత్రం చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హైదరాబాద్ అభివృద్ధి, మెట్రో విస్తరణ, మౌలిక వసతులు, పేదల సంక్షేమంపై సీఎం పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంఐఎం పార్టీ అధ్యక్షులు, ఎంపీ అససుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలా, తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం కొబ్బరికాయ కొట్టి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం నిధులు కేటాయించి పనులను పూర్తి చేసిందని తెలిపారు. ‘ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ తాను గతంలోనే చెప్పినట్టు ఇది ఓల్డ్ సిటీ కాదని.. ‘ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పాతబస్తీ గురించి మాట్లాడుతూ ఇక్కడి ప్రతి గల్లీ తనకు తెలుసని తెలిపారు.
అసదుద్దీన్ ఓవైసీ కోరిన అభివృద్ధి పనులను మంజూరు చేయాలని అధికారులను ఈ వేదికగా ఆదేశిస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలా.. కళాశాల అభివృద్ధికి రూ.20 కోట్లు కోరగా.. రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ప్రభుత్వం నిధులు ఇస్తుందని, అయితే ఏడాదిన్నరలోపు అభివృద్ధి పనులు పూర్తి చేసే బాధ్యత ఎమ్మెల్యేదేనని అన్నారు. విద్య కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోగా చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు.. ఆపరేషన్ సింధూర్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ దేశానికి మద్దతుగా నిలిచి దేశభక్తిని చాటుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ సిద్ధాంతాలు వేర్వేరుగా ఉండొచ్చని.. దేశభక్తి విషయంలో మాత్రం అందరం ఒక్కటేనని తెలిపారు. కేబుల్ బ్రిడ్జిని చూడాలంటే ప్రస్తుతం దుర్గం చెరువుకు వెళ్లాల్సి వస్తోందని, అందుకే మీరాలం చెరువులో సుమారు 3 కిలోమీటర్ల మేర కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లోగా గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు సేవలను పూర్తి చేస్తామని ప్రకటించారు.
అప్పుడు మెట్రోలో ప్రయాణిస్తూ ప్రజలను ఓట్లు అడుగుతామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ నగరంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హిందువులు, ముస్లింలు కలిసి ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. మూసీని అభివృద్ధి చేసి నగరంలో నైట్ ఎకానమీని ప్రోత్సహిస్తామని తెలిపారు. పేద ముస్లింలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాగోల్ నుంచి ఎల్‌బీనగర్, వనస్థలిపురం, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని సీఎం అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ అడుగడుగునా అడ్డుపడుతున్నాయని విమర్శించారు. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయని.. ఎన్నికలు పూర్తయ్యాక అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. అందరూ కలిసి హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.



