Homeరాష్ట్రీయంఎల్‌‌హెచ్‌‌వీ ట్రైనింగ్‌‌కు పైసల్లేవంట?

ఎల్‌‌హెచ్‌‌వీ ట్రైనింగ్‌‌కు పైసల్లేవంట?

- Advertisement -

శిక్షణాకాలం భారాన్ని ఏఎన్‌ఎమ్‌‌లే భరించాలంటూ ఆదేశాలు
ఫుడ్‌, 42 రోజుల వసతి 
సొంతంగా చూసుకోవాల్సిందే
రూ.20 బాండ్‌ పేపర్‌‌పై 
రాతపూర్వక హామీ ఇచ్చిన వారికే శిక్షణ
అంగీకారం తెలిపిన 56 మంది ఎంపిక
సీనియర్లకు అన్యాయం
ఈ నెల 28 నుంచి 
నవంబర్‌ 8 తేదీ వరకు శిక్షణ
వైద్యశాఖ నిర్ణయంపై ఏఎన్‌ఎమ్‌‌లలో తీవ్ర అసంతృప్తి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏఎన్‌ఎమ్‌‌లకు ప్రమోషన్ల కోసం ఇచ్చే లేడీ హెల్త్‌ ‌విజిటర్‌(ఎల్‌‌హెచ్‌‌వీ) శిక్షణకు సర్కారు దగ్గర పైసల్లేవంట. 42 రోజుల శిక్షణా కాలానికి సంబంధించిన భోజన, నివాస వసతిని సొంతంగా భరించాలంట. అలా అంగీకారం తెలుపుతూ రూ.20 బాండ్‌‌పేపర్‌‌పై రాతపూర్వక హామీ ఇచ్చిన వారికే శిక్షణ ఇస్తారంట. అలా చేయడానికి అంగీకరించి ముందుకొచ్చిన 56 మందిని తొలి దశ శిక్షణకు అధికారులు ఎంపిక చేశారు. ఈ నెల 28 నుంచి నవంబర్‌ ఎనిమిదో తేదీ దాకా మొదటి బ్యాచ్‌‌కు శిక్షణ ఇవ్వనున్నారు. వైద్యశాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సీనియర్‌ ఏఎన్‌ఎమ్‌‌లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. రాష్ట్రంలో మూడు వేల మందికిపైగా ఏఎన్‌ఎమ్‌‌లు న్నారు. వీరు గర్భిణీ స్ర్తీల సంరక్షణ, తల్లి–శిశు ఆరోగ్యం, ప్రభుత్వ టీకాలు పిల్లలందరికీ అందేలా ఇంటింటికీ తిరిగి చైతన్యపర్చడం, వేయడం, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించడం, అర్హత ఉన్న సేవలకు ప్రజలను అనుసంధానించడం వంటి పనులను చేస్తున్నారు. పోషకాహారం, పరిశుభ్రత, తల్లిపాలు, వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. టీబీ, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల గుర్తింపు, నివారణ కార్యక్రమాల్లో ఆరోగ్యశాఖ సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు.

గర్భిణీలు, ప్రసవాలు, పిల్లల టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ తదితర ఆరోగ్య సేవలకు సంబంధించిన రికార్డులను గ్రామాల్లో వీరే నిర్వహిస్తున్నారు. వీరిలో రెండు వేల మందికిపైగా 12, 18 సంవత్సరాల నుంచి సేవలందిస్తున్నారు. వాస్తవానికి 12 ఏండ్ల సర్వీసు పూర్తయిన వారికి వైద్యారోగ్య శాఖ ఎల్‌‌హెచ్‌‌వీ శిక్షణను ఇప్పించాల్సి ఉంది. సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న ఏఎన్‌ఎమ్‌‌లు, ఎమ్‌‌పీహెచ్‌‌డబ్ల్యూ వంటి ఆరోగ్య సిబ్బందికి లేడీ హెల్త్ విజిటర్ శిక్షణ ఇవ్వడం ఉమ్మడి రాష్ట్రంలో రెగ్యులర్‌‌గా సాగేది. టీ.ఏ, డీఏ లు కూడా ఇచ్చేవారు. దీనిద్వారా మహిళలు, పిల్లలు, కుటుంబ సంక్షేమం, ప్రాథమిక ఆరోగ్య సేవల్లో పనిచేయగల సామర్థ్యాలను వారిలో డెవలప్‌‌చేసేవారు. ప్రసూతి–శిశు ఆరోగ్యం, టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ, పోషణ, ఆరోగ్య అవగాహన, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అంశాల్లో శిక్షణ ఇస్తారు. సాధారణంగా ఆరోగ్యశాఖలో ఏఎన్‌ఎమ్‌, ఎమ్‌‌పీహెచ్‌‌డబ్ల్యూ(ఎఫ్‌) గా శిక్షణ పొంది, అనుభవం, తదుపరి నిర్దేశిత శిక్షణ, ప్రభుత్వ నియామక నిబంధనల ప్రకారం ఎల్‌హెచ్‌‌వి ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణ తర్వాత ఆరోగ్యశాఖలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్-సెంటర్లు, కమ్యూనిటీ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా-శిశు ఆరోగ్య సేవలు, టీకాలు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు వంటి రంగాల్లో పని చేసే అవకాశాలు ఉంటాయి. 2014 నుంచి నేటి వరకూ ఎల్‌‌హెచ్‌‌వీ ట్రైనింగ్‌ అనే మాటనే లేదు.

ఫుడ్‌..బెడ్‌ ‌మీదేనంటూ ఆదేశాలు
‘‘సెప్టెంబర్‌ 28 నుంచి ఎల్‌‌హెచ్‌‌వీ ట్రైనింగ్‌ కోఠిలోని ఎస్‌‌హెచ్‌ఎస్‌ఆర్‌‌సీ బిల్డింగ్‌‌లో రెండో ప్లోర్‌‌లో ప్రారంభం కానున్నది. మీరు ఇప్పటికే కన్సెంట్‌ ‌ఫామ్‌ ఇచ్చినందున ట్రైనింగ్‌ ‌కాలానికి సంబంధించి ఫుడ్‌ అరేంజ్‌‌మెంట్‌‌ను సొంతంగా చూసుకోవాలి. అకామిడేషన్ బాధ్యత కూడా మీదే. ఈ అరేంజ్‌‌మెంట్‌‌లన్నింటినీ కోఠి పరిసరాల్లోనే చూసుకోవాలి. ట్రైనింగ్‌ ‌నవంబర్‌ ఎనిమిదో తేదీ వరకు కొనసాగుతుంది. కాబట్టి అందరూ అవసరమైన ఏర్పాటు చేసుకుని ట్రైనింగ్‌కు సమయానికి హాజరు కావాలి. మొదటి దశ ట్రైనింగ్‌‌కు ఎంపికైన వారికి సబంధించిన సమాచారం ఇప్పటికే ఫ్యామిలీ వెల్ఫేర్‌ ‌కార్యాలయం నుంచి డీఎమ్‌‌హెచ్‌ఓలకు అధికారిక మెయిల్‌ ‌పంపాం. లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరూ డీఎమ్‌‌హెచ్‌ఓల నుంచి రిలీవింగ్‌ ఆర్డర్లు తీసుకుని సెప్లెంబర్‌ 28న ఉదయం 9 గంటలకల్లా కోఠి ఎస్‌‌హెచ్‌ఎస్‌ఆర్‌‌సీ బిల్డింగ్‌‌లోని రెండో ఫ్లోర్‌‌లో రిజిస్ర్టేషన్‌ ‌తప్పనిసరిగా చేయించుకోవాలి’’ అని ఫ్యామిలీ వెల్ఫేర్‌ ‌అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌కార్యాలయం నుంచి ఏఎన్‌ఎమ్‌‌లకు అదేశాలు వెళ్లాయి. దీనిపై చాలా మంది ఏఎన్‌ఎమ్‌‌లు పెదవి విరుస్తున్నారు. శిక్షణ కాలానికి సంబంధించిన భోజన, ఆవాస వసతి కల్పించాల్సిందిపోయి అధికారులు ఇలా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.20 బాండ్‌‌పేపర్‌‌పై రాసి అంగీకార పత్రం నింపి ఇవ్వలేదనే సాకుతో శిక్షణకు పలువురు సీనియర్‌ ఏఎన్‌ఎమ్‌‌లను పక్కనబెట్టినట్టు ఏఎన్‌ఎమ్‌‌లు ఆరోపిస్తున్నారు. ‘గతంలో వైద్యారోగ్య శాఖ పరిధిలోని శిక్షణ టీమ్‌ ఉండేది. ప్రభుత్వమే అన్ని ఖర్చులను భరించి శిక్షణ ఇప్పించేంది. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఏఎన్‌ఎమ్‌‌లు వాపోతున్నారు. ప్రభుత్వమే భోజన, ఆవాస వసతులను కల్పించి శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -