సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బృందా కరత్ నిలదీత
ఢిల్లీలో మైనర్ బాలికపై లైంగికదాడికి నిరసన
నోయిడా పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) భారీ ఆందోళన
నోయిడా : 6 ఏండ్ల బాలికపై లైంగికదాడి ఘటనకు నిరసనగా నోయిడా పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఐద్వా గురువారం భారీ ఆందోళనను నిర్వహించింది. మహిళలు, బాలికలకు రక్షణ, భద్రత కల్పించడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు విఫలమయ్యారని విమర్శించింది. నేరస్థులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ఈ ఆందోళనలో పాల్గొన్న సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బృందా కరత్ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక హింస ఘటనలను తీవ్రంగా ఖండించారు. మహిళలకు భద్రతను కల్పించడంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు విఫలమవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.అలాగే, పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే నిందితులు ఈ నేరానికి పాల్పడే అవకాశం కలిగిందన్న ఆరోపణలపై న్యాయమైన, నిష్పాక్షికమైన విచారణ జరపాలని ఐద్వా డిమాండ్ చేసింది. బాధ్యులపై బీఎన్ఎస్‌లోని నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐద్వా విజ్ఞప్తి కోరింది.అలాగే, ఈ ఆందోళన నేపథ్యంలో బుధవారం రాత్రి 11 గంటల నుంచే ఐద్వా గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా అధ్యక్షులు రేఖా చౌహాన్‌ను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని ఐద్వా ఖండించింది. ఇలాంటి చర్య ప్రజాస్వామ్య హక్కులు, శాంతియుత నిరసన హక్కుపై దాడి అని ఐద్వా విమర్శించింది. పోలీసుల నియంతృత్వ ధోరణిని ఖండించింది.ఈ ఆందోళనకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది. ప్రజాసంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



