మహారాష్ట్ర 10వ తరగతిలో మరాఠీ మొదటి భాష పేపర్‌లో 80,000 మందికి పైగా ఫెయిల్
రేకెత్తిస్తోన్న ఆందోళన
మహారాష్ట్ర సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ ఎస్ సీ) పరీక్షలలో 80,000 మందికి పైగా విద్యార్థులు మరాఠీ మొదటి భాష పేపర్‌లో ఫెయిల్ అయ్యారు. ఇది పాఠశాలల్లో, దైనందిన జీవితంలో ప్రాంతీయ భాషల మారుతున్న స్థానంపై విద్యా నిపుణులలో ఆందోళన రేకెత్తిస్తోంది. పరీక్షా గణాంకాల ప్రకారం, మరాఠీ మొదటి భాష పేపర్‌కు 10,98,623 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 10,06,896 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 92.57 శాతానికి చేరింది. అయితే, 80,803 మంది విద్యార్థులు ఈ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు.
మరాఠీ మహారాష్ట్ర అధికార భాష కావడంతో, ఈ సంఖ్యలు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు , భాషా నిపుణుల మధ్య చర్చకు దారితీశాయి. ఈ సమస్య విద్యా వ్యవస్థలోనే ఒక పెద్ద లోపాన్ని ప్రతిబింబిస్తుందని చాలామంది భావిస్తున్నారు. విస్తృత కోణంలో చూసినప్పుడు ఈ ఆందోళన మరింత తీవ్రమవుతుంది. 4,13,917 మంది విద్యార్థులు మరాఠీని రెండవ లేదా మూడవ భాషగా కూడా ఎంచుకున్నారు. వీరిలో 13,741 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మొత్తం మీద, ఎస్.ఎస్.సీ పరీక్షలలో అన్ని కేటగిరీలలో కలిపి సుమారు 94,544 మంది విద్యార్థులు మరాఠీ భాషా సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు. రాష్ట్ర భాషా పరీక్షలో దాదాపు 8 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయినప్పుడు, దానిని కేవలం ఒక వ్యక్తిగత విద్యా సమస్యగా మాత్రమే చూడలేమని విద్యా నిపుణులు అంటున్నారు. ఈ ధోరణి విద్యార్థులు, కుటుంబాలలో మారుతున్న భాషా అలవాట్లను సూచిస్తోందని వారు వాదిస్తున్నారు.
ఇటీవల కేంద్రం మరాఠీకి శాస్త్రీయ భాష హోదాను కల్పించిన తరుణంలో ఈ చర్చ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రాంతీయ భాషలను పరిరక్షించడం, మాతృభాషలను ప్రోత్సహించడం, ఆంగ్ల మాధ్యమ విద్యను సమతుల్యం చేయడం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఇప్పటికే చర్చలు పెరుగుతున్నాయి.పట్టణీకరణ, ఆంగ్ల మాధ్యమ పాఠశాలల పెరుగుదల వల్ల విద్యార్థులు మరాఠీతో మమేకమయ్యే విధానం మారిపోయిందని పలువురు విద్యావేత్తలు భావిస్తున్నారు. అనేక ఇండ్లల్లో, ముఖ్యంగా నగరాల్లో, ఇంగ్లీష్, హిందీలు సంభాషణకు ప్రధాన భాషలుగా మారుతుండగా, తరగతి గదుల బయట మరాఠీ చదవడం, రాయడంపై శ్రద్ధ తగ్గిపోతోంది.
పాఠశాల మౌలిక సదుపాయాలు, బోధనా పద్ధతుల్లోని వ్యత్యాసాలను కూడా ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు. సైన్స్, గణితంతో పోలిస్తే విద్యార్థులు తరచుగా భాషా సబ్జెక్టులను ద్వితీయ ప్రాధాన్యతగా పరిగణిస్తారని, ఇది వారి సన్నద్ధతను బలహీనపరుస్తుందని కొందరు నిపుణులు అంటున్నారు.ఈ సమస్య విద్యార్థులు మరాఠీని తిరస్కరించడం గురించి కాదని, పాఠశాలల్లో భాషలను బోధించే విధానం గురించేనని మరికొందరు వాదిస్తున్నారు. భాషా అభ్యసనం ఎక్కువగా పరీక్షలపైనే కేంద్రీకృతమైందని, సాహిత్యం, సంభాషణ, సంస్కృతితో దాని అనుబంధం తగ్గిపోయిందని అంటారు.యువ తరాలలో ప్రాంతీయ భాషా అభ్యసనాన్ని బలోపేతం చేయడానికి పాఠశాలలు, తల్లిదండ్రులు, విధానకర్తలు తగినంతగా కృషి చేస్తున్నారా లేదా అనే విషయంపై ఎస్.ఎస్.సి ఫలితాలు ఇప్పుడు ఒక విస్తృత చర్చకు తెరలేపాయి.
మాతృభాషను మరిచిపోతున్నారు
- Advertisement -
- Advertisement -



