ఇరాన్‌పై యుద్ధం ప్రారంభానికి ముందే ఏర్పాటు
ఇజ్రాయిలీ పైలట్లను రెస్క్యూ చేయడమే లక్ష్యం
బండారం బయటపెట్టిన ఇరాకీ గొర్రెల కాపరి
అమెరికన్ మీడియా సంచలన కథనం
ఇరాన్‌పై వైమానిక దాడుల కోసం ఇరాక్‌లో రహస్య సైనిక స్థావరాన్ని ఇజ్రాయిల్ నిర్మించిందంటూ ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఇరాక్‌లోని ఓ ఎడారిలో ఏర్పాటుచేసిన ఈ సీక్రెట్ సైనిక స్థావరం కేంద్రంగా ఇజ్రాయెలీ ప్రత్యేక దళాలు పనిచేశాయని తెలిపింది. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్లకు రవాణాపరమైన హబ్‌గా ఈ స్థావరం పనిచేసిందని పేర్కొంది. తదుపరిగా ఇరాక్ సైనిక దళాలు దీన్ని గుర్తించి సమీపించడంతో, వాటిపైనా ఈ స్థావరం నుంచే వైమానిక దాడులు చేశారని కథనంలో ప్రస్తావించారు. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభం కావడానికి (ఫిబ్రవరి 28కి) కొద్దికాలం ముందే, అమెరికాకు సమాచారాన్ని అందించి ఇరాక్‌లో ఈ రహస్య స్థావరాన్ని ఇజ్రాయెల్ నిర్మించిందన్నారు. ఇజ్రాయెలీ సైనిక వ్యవహారాలతో సంబంధాలున్న వ్యక్తులు, అమెరికా అధికార వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించడం గమనార్హం.
పైలట్ల సెర్చ్ అండ్ రెస్క్యూ కోసమే!
అమెరికన్ మీడియా సంస్థ కథనం ప్రకారం, ఇరాక్‌లో ఇజ్రాయిల్ నిర్మించిన రహస్య సైనిక స్థావరం కేంద్రంగా సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు పనిచేశాయి. వైమానిక దాడులు చేసే క్రమంలో ఒకవేళ ఏదైనా ఇజ్రాయెలీ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేస్తే, ఈ రహస్య స్థావరంలోని సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు ఇరాన్ భూభాగంలోకి వెళ్లి పైలట్ల కోసం గాలింపు చర్యలను చేపట్టేలా ఇజ్రాయెల్ ప్లాన్ చేసుకుంది. అయితే యుద్ధం సమయంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఏ ఒక్క యుద్ధ విమానపు పైలట్‌కూ ఇరాన్ భూభాగంలో దిగాల్సిన అవసరమే రాలేదు.
సాయం చేస్తామన్న
ఇజ్రాయిల్- అమెరికా నో
2026 ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చేశాయి. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ సమీప ప్రాంతాలపై వైమానిక దాడులు చేస్తుండగా ఆ విమానాన్ని కూల్చారు. ఆ సమయంలో అమెరికాకు సాయం చేసేందుకు ఇజ్రాయిల్ ముందుకొచ్చిందని అమెరికన్ మీడియా సంస్థ కథనం తెలిపింది. అమెరికన్ పైలట్ల గాలింపు కోసం ఇరాక్‌లోని తమ రహస్య స్థావరం నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లను ఇరాన్‌లోకి పంపుతామని ఇజ్రాయిల్ ప్రతిపాదించిందని పేర్కొంది. అయితే ఇరాన్‌లో చిక్కుకున్న ఇద్దరు అమెరికన్ పైలట్ల ఆచూకీని అమెరికా సైన్యం సొంతంగానే గుర్తించి, వారిని కాపాడుకుంది. అమెరికా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించిన రోజున, దానికి మద్దతు ఇచ్చేలా, భద్రత కల్పించేలా ఇజ్రాయెల్ వైమానిక దాడులను నిర్వహించింది.
గొర్రెల కాపరి సమాచారంతో బండారం బట్టబయలు
అమెరికన్ మీడియా సంస్థ కథనం ప్రకారం, మార్చి మొదటివారంలో ఇరాక్‌లోని ఒక మారుమూల ఎడారి ప్రాంతంలో హెలికాప్టర్ల కదలికలు సహా అసాధారణ సైనిక కార్యకలాపాలు జరిగాయి. ఇదంతా ఒక ఇరాకీ గొర్రెల కాపరి చూశాడు. ఈ సమాచారాన్ని అతడు ఇరాకీ అధికారులకు ఇచ్చాడు. దీంతో వెంటనే దర్యాప్తు కోసం ఇరాకీ దళాలను అక్కడికి (ఇజ్రాయిల్ రహస్య స్థావరం వద్దకు) పంపారు. ఇరాకీ దళాలు ఆ స్థావరానికి చేరుకోకుండా నిరోధించడానికి ఇజ్రాయిల్ వైమానిక దాడులను నిర్వహించింది. ఈ దాడిలో ఒక ఇరాకీ సైనికుడు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.
ఆ స్థావరం అమెరికాదని
భావించిన ఇరాక్
ఇరాక్ భూభాగంలో ఇరాక్ సైనికులపై విదేశీ దళాలు దాడులు చేయడాన్ని ఇరాకీ ప్రభుత్వం ఆనాడు తీవ్రంగా ఖండించింది. తమ సైన్యంపై జరిగిన ఈ దాడి అత్యంత బాధ్యతా రహితమైందని ఇరాక్ కేంద్ర భద్రతా సంస్థ (జాయింట్ ఆపరేషన్స్ కమాండ్) డిప్యూటీ కమాండర్ ఖైస్ అల్ ముహమ్మదావి ఆనాడు మండిపడ్డారు. ఇరాక్ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే పలు విదేశీ శక్తులు ఎడారిలో సైనిక కార్యకలాపాలను నిర్వహించాయని ఆయన వెల్లడించారు. ఇది అమెరికా పనే అయి ఉండొచ్చని ఆ సమయానికి ఇరాక్ సర్కారు భావించింది. దీంతో అప్పట్లో అమెరికాపై ఐక్యరాజ్యసమితికి ఇరాక్ ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఇరాకీ దళాలపై దాడులు చేసిన బలగాలు ఏ దేశాలవి అనే దానిపై ఆనాడు ఇరాకీ, అరబ్ మీడియా అంతటా విస్తృతమైన ఊహాగానాలు చెలరేగాయి. ఇరాక్‌లో ఆ రహస్య స్థావరాన్ని నిర్వహించింది ఇజ్రాయిలే అని అమెరికన్ మీడియా సంస్థ కథనంతో ఎట్టకేలకు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఇరాన్ పై దాడుల కోసం ఇరాక్‌లో ఇజ్రాయిల్ రహస్య స్థావరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



