సీఐటీయూ మండల కన్వీనర్ పెరమండ్ల బాబు గడ
నవతెలంగాణ-నెల్లికుదురు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ ప్రతులను, స్థానిక అంబేద్కర్ సెంటర్ నెల్లికుదురులో దగ్ధం చేస్తున్న ట్లు సీఐటీయూ మండల కన్వీనర్ పెరుమాండ్ల బాబు గౌడ్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడు బిల్లును వ్యతిరేకిస్తూ నిజ ప్రతులను దగ్ధం చేశామని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కార్మికులు రక్త తర్పణ చేసి సాధించుకున్న 29 లేబర్ చట్టాలను అమలు చేయాలని అన్నాడు. నాలుగు లేబర్ కోడుల రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్మిక వర్గం అనేక రకాల పోరాటాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు నిర్వహించి నిరసనలు తెలిపినా ఉన్మాద కేంద్ర పాలకవర్గం పట్టించుకోనట్టు వ్యవహరించడం సరైంది కాదని అన్నారు.
29 చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లతో కార్మికునికి చట్టరీత్యా సంక్రమించే హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా నేటి నుండి అమలుకు తీసుకొస్తోందని వెల్లడించారు. దీనివలన కార్మికుని శ్రమను దోచి కార్పోరేట్ శక్తులకు కార్మిక శక్తిని ధారా దత్తం చేసి శ్రామిక వర్గాన్ని బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కారం రవి, ఐలేష్, సురేష్, ఉప్పలయ్య, వెంకన్న, ఐలయ్య, వీరస్వామి, శ్రీను, మహేందర్, శేఖర్, బిక్షపతి, నరేష్, పూజారి, హరీష్, హెచ్ వెంకన్న, మొదలగున వారు పాల్గొన్నారు.


