Sunday, May 10, 2026
E-PAPER
Homeమానవిబరువు తగ్గాలంటే…

బరువు తగ్గాలంటే…

- Advertisement -

అధిక బరువును తగ్గించుకొని ఫిట్​గా మారడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. చక్కటి పోషకాహారం తీసుకోవడం, డైటింగ్, వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇవి కూడా ఎలా పడితే అలా కాకుండా బ్యాలన్స్​డ్​గా చేసినప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి 30-30-30 రూల్​ చక్కగా పనిచేస్తుందని సూచిస్తున్నారు. ఆ నియమం ఏమిటో.. బరువు తగ్గించడంలో ఇది ఎలా సహాయపడుతుందో ఈరోజు తెలుసుకుందాం!

ఇలా అనుకుంటే అలా ఎవరు బరువు తగ్గలేరు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇందుకు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టచ్చు. అయితే అప్పటి వరకూ ఆగే ఓపిక లేని వాళ్లు క్రాష్​ డైట్లు పాటిస్తూ కఠినమైన వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని ఇబ్బంది పెడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తప్ప మరే ప్రయోజనం ఉండదంటున్నారు. ఇక మరికొందరైతే ఆహార నియమాలు లేదంటే వ్యాయామాలు ఇలా ఏదో ఒకటి పాటిస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తుంటారట. నిజానికి ఇలాంటి అసమతుల్యత వల్ల బరువు తగ్గకపోగా, ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే బరువు తగ్గాలంటే ఆహార నియమాలు, వ్యాయామం, ఎలా తింటున్నాం.. ఈ మూడూ అంశాలు ముఖ్యమే అంటున్నారు. ఇవి కూడా బ్యాలన్స్​డ్​గా పాటించినప్పుడే బరువు తగ్గుతామని తెలియజేస్తున్నారు. మంచి పోషణ, క్రమమైన శారీరక వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ, తగినంత నిద్రతో కూడిన జీవనశైలి ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుందని CDC పేర్కొంది.

క్యాలరీలు తగ్గించాలి
బరువు తగ్గాలంటే.. మనం తీసుకునే ఆహారంలోని క్యాలరీల శాతం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. మనం రోజు ఖర్చు చేసే స్థాయి కంటే ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం వల్ల అవి కొవ్వుగా రూపాంతరం చెందుతాయని హెచ్చరిస్తున్నారు. ఇలా శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయి క్రమంగా బరువు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. కాబట్టి, బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వారు తమకు రోజువారీ కావాల్సిన క్యాలరీల కంటే 30 శాతం తగ్గించి తీసుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ కేలరీలు తిని, శారీరక శ్రమ ద్వారా ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తే, బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

అరగంట వ్యాయామం
తీసుకునే ఆహారంలో క్యాలరీలు తగ్గించడంతో పాటు శరీరంలోని అదనపు కొవ్వు నిల్వలు కరగాలంటే వ్యాయామం చేయాలంటున్నారు నిపుణులు. అయితే, కొంతమంది టైం లేదనో, ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుందనో వ్యాయామం చేయకుండా ఉంటారట. దీనివల్ల ఆశించిన ఫలితం దక్కదని పేర్కొంటున్నారు. అందుకే 30-30-30 రూల్​లో భాగంగా రోజూ కనీసం 30 నిమిషాలు ఎక్సర్​సైజ్​కి టైం కేటాయించాలని సూచిస్తున్నారు. దీనివల్ల జీవక్రియల రేటు పెరిగి, శరీరంలో నిల్వ ఉన్న ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుందని సలహా ఇస్తున్నారు. వారానికి 150 నుంచి 300 నిమిషాల మధ్య వ్యాయామం చేసే వారితో పోలిస్తే, తక్కువ శారీరక శ్రమ చేసే వ్యక్తులు కాలక్రమేణా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నేషనల్‌ ‌లైబ్రరీ ఆఫ్‌ ‌మెడిసెన్‌ పేర్కొంది. ఈ క్రమంలో బరువు, శరీరాకృతిని బట్టి నడక, జాగింగ్, ఈత వంటి సులభమైన వ్యాయామాలతో మొదలు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్, పుషప్స్, కార్డియో ఇలా కాస్త కఠినమైన వ్యాయామాల్ని సాధన చేయాలని సలహా ఇస్తున్నారు. ఇక కార్డియో, ఏరోబిక్స్ కలిపి సాధన చేస్తే బరువు తగ్గడం సులభమవుతుందని వివరిస్తున్నారు. అలాగే, కండర సామర్థ్యం పెరుగుతుందంటున్నారు.

ఒంటికి పట్టేలా
చాలా మంది భోజనం చేసేటప్పుడు టీవీ చూడడం, ఫోన్ చెక్ చేయడం, సోషల్ మీడియాలో చాటింగ్ లాంటివి చేస్తుంటారు. దీనివల్ల ఏకాగ్రత అంతా ఆయా గ్యాడ్జెట్స్ పైనే ఉంటుందట. ఫలితంగా, ఎంత తింటున్నాం? కడుపు నిండిందా? అన్నది కూడా తెలియదంటున్నారు నిపుణులు. ఇంకా ఆకలేస్తోందంటూ మోతాదుకు మించి ఆహారం తీసుకుంటామని చెబుతున్నారు. తద్వారా బరువు పెరగడానికి ఇదీ ఓ కారణమని తెలియజేస్తున్నారు. అందుకే తినేటప్పుడు ఏకాగ్రత అంతా మనం తీసుకునే ఆహారంపైనే పెట్టాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో 30 నిమిషాల పాటు గ్యాడ్జెట్స్ అన్నీ పక్కన పెట్టి, భోజనానికి సమయం కేటాయించమని సలహా ఇస్తున్నారు. ఈ సమయంలో తీసుకునే ఆహారం రుచిని ఆస్వాదిస్తూ, నెమ్మదిగా నములుతూ తినడం వల్ల.. ఆయా పదార్థాల్లోని పోషకాలు అనేవి శరీరానికి అందుతాయట.

ఇవి ముఖ్యమే
బరువు తగ్గడానికి పాటించే ఆహార నియమాల్లో భాగంగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. కడుపు నిండినట్లుగా ఉండి ఎక్కువ సమయం ఆకలేయదంటున్నారు నిపుణులు. తద్వారా ఏది పడితే అది తినకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు. ఫలితంగా బరువు అదుపులో ఉంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. చక్కెరలు, ప్రాసెస్డ్ ఫుడ్స్​ను ఎంత దూరం పెడితే అంత మేలట. ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్, గ్రెలిన్ వంటి హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇవి ఏమైనా తినాలనే కోరికల్ని పెంచుతాయని చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడి దరి చేరకుండా జాగ్రత్తపడడం మంచిదని పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -