Sunday, May 31, 2026
E-PAPER
Homeమానవిసెలవుల్లో ఇలా…

సెలవుల్లో ఇలా…

- Advertisement -

ప్రియమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు? ఎండల్లో జాగ్రత్త, టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉందని విన్నాను. నేను డాక్టర్ దగ్గరకు వెళ్లి వచ్చాను. మందులు ఇచ్చారు. వాడుతున్నాను. నాన్న! నీకు పిల్లల పెంపకం గురించి చెప్తున్నాను కదా. ఈ ఉత్తరంలో కూడా అదే ప్రస్తావన చేస్తున్న. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే వాళ్ళను కొంత వయసు వచ్చేవరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న. పిల్లలకు సెలవులు రాగానే ఏమీ తోచదు. అటువంటప్పుడు వాళ్లను ఖాళీగా ఉంచకుండా, దేనిపట్ల ఆసక్తి ఉందో గుర్తించి, నేర్చుకునేల ప్రోత్సహించాలి. లేదా ఈత, చెస్, సృజనాత్మక కళలను నేర్పించాలి. కొందరు పిల్లలకు ఇంట్లోనే ఉండటం ఇష్టం. అటువంటప్పుడు పుస్తకాలు చదవడం, పజిల్స్ పూర్తి చేయడం, క్రాఫ్ట్ వర్క్ చేయడం వంటివి చేయమని చెప్పాలి. నువ్వు చిన్నప్పుడు క్యారం బోర్డ్, లూడో, పాముపటం ఆడేదానివి. అలాగే చూసి బొమ్మలు గీయడం, పజిల్స్ పూర్తి చేయడం, ఫెయిరీ టైల్స్ పుస్తకాలు చదివేదానివి. కానీ ఈ మధ్య సెలవులు వస్తే చాలు టీవీ, మొబైల్స్ చూస్తున్నారు పిల్లలు. ఇది అసలు మంచి అలవాటు కాదు.

ఎండాకాలం సెలవుల్లో సమ్మర్ క్యాంప్స్ అని ఒక నెల రోజులు పెడతారు. అటువంటి వాటిల్లో చేర్పిస్తే మంచిది. చేర్చే ముందు వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారో వివరంగా తెలుసుకుని చేర్పించాలి. నిన్ను చిన్నప్పుడు చేర్పించాను. క్రాఫ్ట్ వర్క్ నేర్పుతాను అనేవాళ్ళు. ఏమీ నేర్పక పోగా, మీ అమ్మాయి నేర్చుకోవడం లేదని ఒక సారి, మరొకసారి వాళ్లే ఏదో ఒక క్రాఫ్ట్ వర్క్ చేసి మీ అమ్మాయి చేసింది అని చెప్పారు. నాకు తెలుసు వాళ్ళు ఏమీ చెప్పలేదని. ఈ అనుభవంతో చెప్తున్నా అన్నీ తెలుసుకుని చేర్పించమని. పిల్లలు ఆడుకోవడానికి పక్కింటికో, ఎదురింటికో వెళ్తుంటారు. ఒక్కోసారి ఆడుకుంటున్న బొమ్మలను తెచ్చేస్తుంటారు. ఒకరి వస్తువులు చెప్పకుండా తీసుకురాకూడదని, తెచ్చిన వస్తువును తిరిగి ఇచ్చేయాలని వారికి చెప్పాలి. ఇంట్లో పెద్ద వాళ్ళు పిల్లలను తీసుకుని వెళ్లి, వాళ్ళ పెద్ద వాళ్లకు ఆ వస్తువును తిరిగి ఇచ్చేస్తూ తెలియక తీసుకొచ్చారని, క్షమించమని అనాలి. పిల్లల ముందు ఇలా చేయడం వలన వారి మనసులో ఇతరుల వస్తువులు తీసుకుని రాకూడదు, ఇది తప్పు అనే భావన కలుగుతుంది. ఈ సెలవుల్లోనే వారి పనులు సొంతంగా చేసుకునేలా నేర్పించాలి. చిన్న చిన్న పనులు అలవాటు చేస్తే స్కూల్ తెరిచే నాటికి అలవాటుపడతారు. అన్నీ ఒకేసారి చెప్తే ఎవరికైనా కష్టమే. కాబట్టి నెమ్మదిగా ఒక్కో పని నేర్పించాలి. సరే నాన్న ఉంటాను. మరో ఉత్తరంలో మరికొన్ని విశేషాలు చెప్తాను.

ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -