Sunday, May 31, 2026
E-PAPER
Homeమానవికట్టుబాట్లకు తూట్లుపెట్టిన అహల్యబాయి

కట్టుబాట్లకు తూట్లుపెట్టిన అహల్యబాయి

- Advertisement -

లోకమాత, రాజ్యమాతగా నేడు మనం పిలుచుకుంటున్న అహల్యబాయి హోల్కర్ (1725 మే 31 – 1795 ఆగస్టు 13) నర్మదా నది ఒడ్డున, మధ్య భారతదేశంలో 18వ శతాబ్దంలో, ఇండోర్ కేంద్రంగా రాజ్యపాలన సాగించిన మహారాణి. ఆమె పరిపాలనలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. అప్పటి వరకు కొనసాగుతూ వచ్చిన మూఢాచారాలను, కట్టుబాట్లను తీవ్రంగా వ్యతిరేకించింది. అడుగడుగునా అభ్యుదయ భావాలతో ముందుకు సాగింది. నేడు ఆమె జయంతి సందర్భంగా ఆమె గురించిన మరిన్ని విశేషాలు నేటి మానవిలో…

ఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామానికి చెందిన మంకోజీ షిండే, సుశీలాభాయి దంపతులకు అహల్య బాయి జన్మించింది. మరాఠా సామ్రాజ్యాలలో ఒకటైన మాల్వా ప్రాంతపు హోల్కర్ సామ్రాజ్యానికి కోడలైంది. హోల్కర్ సామ్రాజ్యం ఒక శూద్ర సామ్రాజ్యం. ఇది వర్ణ వ్యవస్థలో నాలుగో వర్ణానికి చెందిన గొర్రెలు కాసుకునే ధన్గర్(కురుబా కుటుంబానికి చెందిన రాజ్య వంశం. మల్హర్ రావు హోల్కర్ ఈ రాజ్యాన్ని బాయిపించాడు. మల్హర్ రావు కొడుకైన ఖండేరావ్ ను అహల్యబాయి పెండ్లి చేసుకున్నది. ఆ విధంగా అహల్యబాయి తన పదవ ఏటనే మల్హర్ రావు కోడలుగా అడుగుపెట్టింది. ఖండేరావ్ విలాసవంతమైన జీవితంతో వినోదాలకు అలవాటుపడ్డాడు. రాజ్యపరిపాలన చేసేటందుకు సమర్థుడు కాలేకపోయిండు. అందువలన మల్హర్ రావ్ తన కోడలైన అహల్యబాయికి విద్యాబుద్దులు నేర్పించి తన వారసురాలిగా ప్రకటించి, పురాషాధీక్య సమాజాన్ని సవాలు చేసిండు. అట్లా అహల్యబాయి హోల్కర్ అమ్మతల్లుల పరంపరతో దాదాపు ముప్పై ఏండ్లు 1767 – 1795 వరకు పాలన సాగించింది.

మహిళా సైన్యాల ఏర్పాటు
1754లో కుంభేర్ యుద్దంలో ఖండే రావ్ హోల్కర్ మరణించినప్పుడు అహల్యబాయి సతీ సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది. అప్పుడు మల్హర్ రావ్ హోల్కర్ అడ్డుపడి సతీ చేయవద్దని ఆజ్ఞాపిస్తాడు. సతీ మన సాంప్రదాయం కానేకాదని మనం ధన్గర్ శూద్రకులస్తులమని (మూల వాసులమని) ఎరుక చెప్పి దోపిడివర్గాల సతిని నిరాకరించి వర్ణభ్రమలు తొలగిస్తాడు. అహల్యబాయి హోల్కర్ పాలనలో మహిళలకు తొలి ప్రాధాన్యమిచ్చి వారిలో చైతన్యం తీసుకువచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సైన్యాలను ఏర్పాటు చేసింది. ఆనాడు వితంతువులకు జరుగుతున్న అన్యాయాలను చూసి చట్టాలను సైతం మార్చి వారికి ఆస్తిహక్కులు కల్పించింది. మహిళలు స్వతంత్రంగా జీవించాలని చెప్పింది. మహిళాభివృద్దితో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలతో మనుపితృస్వామ్యంపై తిరుగుబాటు చేసింది.

చాకచక్యంగా వ్యవహరించి…
అహల్యబాయి ఫొటోలను కానీ, విగ్రహాలను గమనిస్తే ఆమె చేతిలో శివలింగం ఉంటుంది. అది ఈ నేల మూలవాసులు పశుపతిని(శివుని) కొలిచే శైవ సాంప్రదాయం. 12 శతాబ్దంలో వర్ణవివక్షపై తిరుగుబాటు చేసిన బసవన్న నిర్మించిన వీరశైవుల పద్దతి. వర్ణ, కుల, మత రహిత సమాజం కోరుకున్న తొవ్వ. అటువంటి తొవ్వలో అహల్యబాయి నడిచింది. ఆమె రాజ్యపాలన చేస్తున్నప్పుడు దోపిడి వర్గాల కుట్రలను ఎదురుకున్నది. ఒక శూద్ర, గొర్రెలు కాసుకునే కుంటుంబానికి చెందిన మహిళ పాలన చేయడం భరించలేని పీష్వా బంధువైన రాగోబా నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ యుద్దాలకు ఆహ్వానిస్తుండే వాడు. కానీ ఆమె బౌద్ధ బిక్షుబిక్షుల ఆలోచన విధానంతో చాలా చాకచక్యంగా వ్యవహరించి యుద్దం జరగకుండా ఆపింది.

ఆర్థికాభివృద్ధికై
ఒక శ్రామిక కులంలో పుట్టిన అహల్యబాయి తన రాజ్యపాలనలో శ్రామికుల నేపథ్యంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. భూములపై పన్ను తగ్గించి, కాలువలు, చెరువులు తొవ్వించి వ్యవసాయ అభివృద్ధికి పాటుపడింది. చేనేత పరిశ్రమను అభివృద్ది చేసి నేతన్నలకు మేలు చేసి, మహేశ్వరి చీరలకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అనాడు భీల్ తెగలయిన గిరిజనులను ఆదుకొని వారికి సాగు భూములిచ్చి, వారి వ్యాపార సంస్థలకు రక్షణ కల్పించింది. దర్గాలు, మసీదులు కట్టుకోవడానికి ఆమె ఎన్నో భూములను ఇనాంగా ఇచ్చింది. ఎన్నో దేవాలయాలను నిర్మించింది. ప్రజలకు మత స్వేచ్ఛకు తావునిచ్చి తన పాలనలో మత సామరస్యానికి పెద్దపీట వేసింది.

ఆమె దార్శనిక దృష్టి
అహల్యబాయి చివరిదాకా తన రాజ్యాన్ని అగ్రకులాల చేతులోకి పోకుండా కాపాడుకుంది. ఆమె తరువాత కూడా అగ్రకులాలకు రాజ్యం దక్కకూడదని ముందుచూపుతో తన వారసునిగా మరో గొర్రెల కాపరి కుటుంబానికి చెందిన తుకోజిరావ్ హోల్కర్ ను దత్తత తీసుకుంది. అతను అప్పటి దాకా సైన్యాదిపతిగా తన కొలువులోనే ఉండేవాడు. అహల్యబాయి అనంతరం మహారాజుగా రాజ్యబాధ్యతలు చేపట్టాడు. ఈ ఘట్టం చాలు ఆమె దార్శనిక దృష్టికి, చైతన్యానికి. ఈ విధంగా నిమ్న వర్గాలైన శూద్రుకులు, శ్రామికుల వైపు నిలబడింది. మరీ ముఖ్యంగా లింగ వివక్షతో పీడింపబడుతున్న స్త్రీల వైపు నిలబడింది. దోపిడి వర్గాల మూఢాచారాలను వ్యతిరేకిస్తూ వచ్చింది. కానీ ఆమెను చివరి వరకు బాధించిన విషయం తన అల్లుడు యశ్వంత్ రావ్ మరణిచినప్పుడు తన కూతురు ముక్తాబాయి ఎంత చెప్పినా వినకుండా సతీ అనే దూరాచారాన్ని పాటించిబాయి

పురోగతి వైపు నడిపించింది
బ్రాహ్మణోస్య ముఖమాసీద్ బాహూ రాజన్యః కృతః/ ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత (ఋగ్వేదంలోని పురుష సూక్తంలోని శ్లోకం). ఈ శ్లోకం బ్రహ్మ ముఖం నుండి పుట్టిన బ్రాహ్మణులు జ్ఞానం పొందాలని, భుజాల నుండి పుట్టిన క్షత్రియులు రాజ్యాలు పరిపాలించాలని, తొడల నుంచి పుట్టిన వైశ్యులు వ్యాపారాలు చేయాలని, పై మూడు వర్ణాలకు ఏ లాభం ఆశించకుండా సేవలు చేస్తూ శూద్రులు జీవించాలని ఉంది. ఇట్లాంటి వేదాలు, పురాణాలు, మనుస్మృతి వంటి శాస్త్రాలలో ఎన్నో శ్లోకాలు.. శూద్రులు రాజ్యాలు చేయరాదని, శూద్రులు పైవర్గాలకు సేవలు చేస్తూ బానిసలుగానే జీవించాలని ఉంది. స్త్రీలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవించరాదని ఒక పురుషుని అదీనంలో జీవితాంతం ఉండాలని పురాషాధీక్యతను ప్రదర్శించినాయి. హోల్కర్ సామ్రాజ్యం అందుకు భిన్నంగా అవతరించింది. అహల్యబాయి తన పాలనలో ఇట్లాంటి మూఢాచారాలకు, కట్టుబాట్లకు తూట్లు పెట్టి సమాజాన్ని పురోగతి వైపు నడిపించింది. అట్లాంటి లోకమాత అహల్యబాయి హోల్కర్ జీవితం మనందరికీ సదా ఆదర్శం. ఆచరణీయం.

చిక్కొండ్ర రవి, 9502378992

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -