ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు తమ దృఢ సంకల్పం, ఆకాంక్ష, శ్రద్ధతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో విజయగాథ. అలాంటి స్ఫూర్తిదాయక జీవితమే మిన్ను జోషిది. కుటుంబం ఇచ్చిన మద్దతుతో, ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుంది. భారతదేశంలోని అత్యంత కఠినమైన సివిల్స్‌లో సత్తా చాటింది.
మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అధిగమించి ఉన్నత స్థాయి నైపుణ్యాలతో రాణిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్నేండ్లుగా సివిల్ సర్వీసెస్‌లో మహిళా అధికారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాంటి వారిలో ఒకరు మిన్ను జోషి. చిన్న వయసులో పెడ్లి చేసుకుని, ఒక బిడ్డకు తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగి పోయిన ఆమె నేడు కేవలం శ్రద్ధగల అధికారి మాత్రమే కాదు, ఆమె మొత్తం సమాజం గర్వించదగిన వ్యక్తిగా ఎదిగింది. సంకల్పం ఉంటే కలలను ఎలా సాకారం చేసుకోవచ్చో నిరూపించింది.
తండ్రి మరణంతో…
కేరళలోని పతనంతిట్ట అనే చిన్న గ్రామంలో మిన్ను జోషి పుట్టింది. మిన్ను తండ్రి పోలీసు. పోలీసుగా గౌరవ స్థానంలో ఉన్న తండ్రిని చూసి తాను కూడా మరింత ఉన్నతంగా ఎదగాలని కలకనింది. తండ్రి కూడా తన కూతురు ఐఏఎస్ అధికారి కావాలని ఎంతో కోరుకునే వారు. అయితే ఎంతో ప్రేమించిన తండ్రి అకాల మరణం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. తండ్రి మరణించడంతో 2012లో ‘డై-ఇన్-హార్నెస్’ (కారుణ్య నియామకం) పథకం ద్వారా ఆమెకు కేరళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా ఉద్యోగం వచ్చింది.
ప్రత్యేక గుర్తింపుకై…
తండ్రి లేకపోవడంతో ఆ తల్లి కూతురికి త్వరగా పెండ్లి చేయాలని నిర్ణయించుకుంది. అలా 21 ఏండ్లకే ఇస్రో అధికారి అయిన జోషి డి.జె.తో మిన్ను పెండ్లి జరిగింది. 23 ఏండ్లకు మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా ‘ఐఏఎస్’ డ్రీమ్‌ను విడిచిపెట్టలేదు. తల్లి కావడంతో సివిల్స్ ప్రిపరేషన్‌కు కొంత ఆలస్యమైంది. అంతేకాదు కేవలం కారుణ్య నియామకం ద్వారా వచ్చిన ఉద్యోగిగానే మిగిలిపోకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని దృఢంగా నిర్ణయించుకుంది. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ 26 ఏండ్ల వయసులో ఐఎఎస్ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించింది. దీనికోసం తీవ్రంగా శ్రమించింది.
నిరాశ చెందకుండా
భార్యగా, కోడలిగా, తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయినా తన కలను సాకారం చేసుకోవడం కోసం తనను తాను సంసిద్ధం చేసుకుంది. చనిపోయిన తండ్రి కలను సాకారం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. తన చదువు కోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఆమె దినచర్య ఎంతో కఠినంగా ఉండేది. ఉదయాన్నే శంకర్ లైబ్రరీకి వెళ్లి ‘ది హిందూ’ వంటి వార్తాపత్రికలు చదివేది. 2015లో శంకర్ ఐఏఎస్ అకాడమీలోనే ఆమె శిక్షణ తీసుకుంది. పగలు ఆఫీసు పనులు, రాత్రిపూట చదువు, అదే సమయంలో కుటుంబ బాధ్యతలు.. ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగింది. ఐదుసార్లు విఫలమైనప్పటికీ నిరాశనే ఏ మాత్రం తన దరికి చేరనీయలేదు. ఆమె ఇది కేవలం తన కలకోసం మాత్రం కాదని, మరణించిన తండ్రి సేవకు కొనసాగింపు అని భావించింది.
చివరకు సాధించింది
రెండేండ్ల తర్వాత మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. అయితే ఇంటర్వ్యూలలో విఫలమైంది. కానీ ఏ మాత్రం కుంగిపోలేదు. మళ్లీ పట్టువదలకుండా ప్రయత్నించింది. అలా ఆరో ప్రయత్నంలో 150వ ఆల్ ఇండియా ర్యాంకు సాధించి తన తండ్రి కలను, తన ఆశయాన్ని సాధించింది. ప్రస్తుతం మిన్ను జోషి మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో భట్కులి-తివాసా సబ్-డివిజన్‌కు అసిస్టెంట్ కలెక్టర్‌గా సేవలు అందిస్తుంది. ఉద్యోగం, వివాహం, పిల్లల బాధ్యతలు మోస్తూ కూడా సివిల్స్ వంటి కఠినమైన పరీక్షల్లో విజయం సాధించవచ్చని నిరూపించిన ఆమె ప్రయాణం, ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.



