న్యూఢిల్లీ : ఫిఫా 2026 ప్రపంచకప్ మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సాకర్ సంగ్రామంపై యూరోప్, అమెరికా దేశాలతో పాటు ఆసియాలో అభిమానులు విపరీత ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణంగా, వరల్డ్‌కప్ ఆరంభానికి ముందుగానే ప్రసార హక్కుల ప్రక్రియ ముగుస్తుంది. 2018, 2022 ప్రపంచకప్ చైనా ప్రసారదారుతో ఫిఫా 2017లోనే ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, ఈ ఏడాది ప్రపంచకప్‌కు 30 రోజుల కౌంట్‌డౌన్ మొదలైనా.. ఈ ప్రక్రియలో ఎటువంటి పురోగతి లేదు. చైనాలో ప్రభుత్వ ప్రసారదారు చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ) హక్కులపై ఆసక్తి చూపించినా.. ఫిఫా భారీగా ఆశిస్తోంది. రూ.2850 కోట్ల బిడ్‌తో ఫిఫా బేరం మొదలుపెట్టి, ఇప్పడు రూ.1400 కోట్లకు దిగివచ్చింది. అయినా, ఈ ధరకు ప్రసార హక్కులు తీసుకునేందుకు సీసీటీవీ సిద్ధంగా లేదు. రూ.200-300 కోట్ల డీల్‌తో ప్రసార హక్కులు దక్కితే తీసుకుంటామని సీసీటీవీ చెబుతోంది. కానీ, ఫిఫా అధికారులు దీనిపై ఆలోచనలు చేస్తున్నారు. భారత్‌లోనూ ఇదే ప్రతిష్ఠంభన నెలకొంది. ప్రయివేటు ప్రసారదారులు రిలయన్స్ డిస్నీ (జియోస్టార్), సోనీ నెట్‌వర్క్‌లు తొలుత ఆసక్తి చూపించాయి. కానీ బిడ్ ధర రూ.900-1000 కోట్లు ఉండటంతో రెండు సంస్థలు వెనక్కి తగ్గాయి. రూ.200 కోట్ల వరకు చెల్లించేందుకు డియోస్టార్ ఆసక్తి చూపించినా, ఫిఫా నుంచి స్పందన లభించలేదని సమాచారం. ప్రయివేటు ప్రసారదారులు ప్రసార హక్కులకు బిడ్ దాఖలు చేయకపోవటంతో భారత్‌తో ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రభుత్వ ప్రసారదారు దూరదర్శన్‌లో ఉచితంగా ప్రసారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఫిఫా ప్రపంచకప్ అమెరికా, మెక్సికో, కెనడాలో జరుగుతుండగా.. మ్యాచ్ వేళలు భారత కాలమానం ప్రకారం అర్థ రాత్రి లేదా తెల్లవారుజామున ఉంటున్నాయి. దీంతో ప్రయివేటు ప్రసారదారులు వెనక్కి తగ్గుతున్నారు.
ఫిఫాకు ప్రసార హక్కుల సమస్య
- Advertisement -
- Advertisement -



