Thursday, May 14, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తుపాకీ వీడి.. కలం పట్టి..

తుపాకీ వీడి.. కలం పట్టి..

- Advertisement -

– 40ఏండ్ల తర్వాత ఇంటర్‌ పరీక్ష రాసిన మాజీ మావోయిస్టు దేవ్‌ జీ!
– కోరుట్లలో రాసిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ
నవతెలంగాణ – కోరుట్ల

అతని చేతులు ఒకప్పుడు విప్లవ నినాదాలతో గోడల మీద రాతలు రాశాయి.. వ్యవస్థను మార్చాలని తుపాకీ పట్టాయి. కానీ కాలం గిర్రున తిరిగింది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత, ఇప్పుడు అదే చేతులు విద్యార్థిగా మారి కలం పట్టాయి. అసంపూర్తిగా మిగిలిన తన చదువును పూర్తి చేసేందుకు 60 ఏండ్ల వయసులో పరీక్షా హాల్‌లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు మాజీ మావోయిస్టు దేవ్‌ జీ అలియాస్‌ తిప్పిరి తిరుపతి.

1984-85 విద్యా సంవత్సరంలో కోరుట్ల జూనియర్‌ కళాశాలలో దేవ్‌ జీ ఇంటర్మీడియట్‌ చదువుతుండేవారు. ఆ సమయంలో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ) ఆర్గనైజర్‌గా పనిచేస్తూ విప్లవ భావజాలానికి ఆకర్షితులయ్యారు. ఆ క్రమంలో నమోదైన కేసులు, ఉద్యమ అవసరాల రీత్యా అడవి బాట పట్టారు. అప్పటికే అన్ని సబ్జెక్టులు పాస్‌ అయినప్పటికీ, సెకండియర్‌ తెలుగు పరీక్ష మాత్రం రాయలేకపోయారు. ఆ ఒక్క సబ్జెక్టు 40 ఏండ్ల పాటు ‘బాకీ’గానే ఉండిపోయింది. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలని దేవ్‌ జీ బలంగా నిర్ణయించుకున్నారు. ఇంటర్‌ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి పొంది బుధవారం కోరుట్లలో జరిగిన ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యారు. తనకంటే సగం వయసున్న విద్యార్థుల మధ్య కూర్చుని ఆయన పరీక్ష రాయడం చూసి తోటి అభ్యర్థులు, అధికారులు ఆశ్చర్యంతో పాటు అభినందనలు కురిపించారు. పరీక్ష రాసిన అనంతరం దేవ్‌ జీ తన మనసులోని మాటను పంచుకున్నారు. ‘చదువుకు వయసుతో సంబంధం లేదు. ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత ఎలాగైనా ఎల్‌ఎల్‌బీ చదవాలన్నదే నా ఆశయం.’ అని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -