Tuesday, July 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రతి చిన్నారికీ ఆల్బెండజోల్‌ ‌మాత్ర

ప్రతి చిన్నారికీ ఆల్బెండజోల్‌ ‌మాత్ర

- Advertisement -

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహారం, ఏకాగ్రత లోపిస్తుంది
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
జాతీయ నులిపురుగుల నివారణ మందుల పంపిణీ ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా 96.81 లక్షల మంది చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు
నవతెలంగాణ-సిటీబ్యూరో

ప్రతి చిన్నారికీ ఆల్బెండజోల్‌ ‌మాత్రం అందాలని, చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలో ఒకటి నుంచి 19 ఏండ్ల వయస్సు గల ప్రతి చిన్నారినీ నులిపురుగుల నివారణ కార్యక్రమం పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం-2026 సందర్భంగా హైదరాబాద్‌‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌తో కలిసి మంత్రి విద్యార్థులకు ఆల్బెండజోల్‌ ‌మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 33 జిల్లాల్లో ఒకటి నుంచి 19 ఏండ్ల వయస్సు గల 96,81,855 మంది చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. నులిపురుగుల సమస్య చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యపై ప్రభావం చూపుతుందని చెప్పారు. నులిపురుగుల కారణంగా రక్తహీనత, పోషకాహార లోపం, కడుపునొప్పి, విరేచనాలు, శారీరక బలహీనత, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.
ఏ చిన్నారీ మాత్ర తీసుకోకుండా మిగిలిపోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహాయంతో నడిచే, ప్రయివేటు పాఠశాలలు, ప్రీ-స్కూల్స్, మదర్సాలు, జూనియర్ కళాశాలల ద్వారా ఆల్బెండజోల్ మాత్రలను అందిస్తున్నట్టు తెలిపారు. విద్యా వ్యవస్థకు వెలుపల ఉన్న ఒకటి నుంచి 19 ఏండ్ల వయస్సు గల చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మాత్రలు అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో 10,28,013 మంది చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని, నిర్దేశిత మోతాదు ప్రకారం పిల్లలకు అందించాలని మంత్రి సూచించారు. గైర్హాజరైన, అనారోగ్యంతో ఉన్న లేదా మాత్ర తీసుకోలేకపోయిన చిన్నారుల కోసం ఈ నెల 20న మాప్-అప్ డే నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సంగీతా సత్య నారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ విజయ నిర్మల, హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ‌శ్రీధర్‌, వైద్యులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -