Thursday, May 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగుజరాత్‌‌కు వంద శాతం..తెలంగాణకు 45 శాతమే

గుజరాత్‌‌కు వంద శాతం..తెలంగాణకు 45 శాతమే

- Advertisement -

గ్రాంట్ల విడుదలలో కేంద్రం వివక్ష‍
కేంద్ర మంత్రులను సీఎం కలిసినా కలగని నిధుల మోక్షం

బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట
విపక్ష‍ ప్రభుత్వాలున్న వాటిపై చిన్నచూపు
రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.22,782 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో వచ్చింది రూ.10,422 కోట్లు
రూ.12,359 కోట్లు మోడీ సర్కారు కోత
సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కేంద్రం
కాగ్‌ నివేదికలో గణాంకాలు వెల్లడి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిధులు తేవడం కోసమే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతోపాటు ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ కేంద్రం నుంచి గ్రాంట్లు, నిధులు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. కాగ్‌ ‌నివేదికలోని గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్చి నాటికి గుజరాత్‌‌కు రూ.20,010.78 కోట్ల గ్రాంట్లు విడుదల చేయాల్సి ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే మార్చి నాటికి రూ.20,006.37 (99.98 శాతం) కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంటే దాదాపు వంద శాతం గ్రాంట్లు విడుదలయ్యాయి.

తెలంగాణకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.22,782.50 కోట్లు రావాల్సి ఉన్నది. మార్చి నాటికి రూ.10,422.98 (45.75 శాతం) నిధులు మాత్రమే విడుదలయ్యాయి. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లలో రూ.12,359.52 (54.25 శాతం) కోట్లు మోడీ సర్కారు కోత విధించడం గమనార్హం. హిమాచల్‌ ‌ప్రదేశ్‌‌కు 94.68 శాతం నిధులు, చత్తీస్‌‌ఘడ్‌‌కు 90.96 శాతం నిధులు, అస్సాంకు 84.77 శాతం నిధులు, మధ్యప్రదేశ్‌‌కు 70.28 శాతం నిధులు, ఆంధ్రప్రదేశ్‌‌కు 62 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) ‌మార్చి నివేదికను విడుదల చేసింది. అందులో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ల వివరాలను ప్రకటించింది.

రూ.24,166 కోట్లు విడుదలయ్యేనా?
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) బడ్జెట్‌లో కేంద్ర గ్రాంట్లలో రూ.24,166 కోట్లు వస్తాయని అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.10,422.98 (45.75 శాతం) కోట్లు మాత్రమే వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.21,636.15 కోట్లు అంచనా వేస్తే రూ.7,913.08 (36.57 శాతం) కోట్ల నిధులే వచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.41,259.17 కోట్ల గ్రాంట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ రూ.9,729.91 (23.58 శాతం) నిధులు మాత్రమే విడుదలయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.41,001.73 కోట్ల నిధులు వస్తాయని అంచనా వేసింది. కానీ రూ.13,179.21 (32.14 శాతం) కోట్ల నిధులు మాత్రమే వచ్చాయి.

2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.38,669.46 కోట్ల గ్రాంట్లు విడుదలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ రూ.8,619.26 (22.29 శాతం) నిధులు మాత్రమే విడుదల కావడం గమనార్హం. అంచనా వేసిన నిధుల్లో కనీసం సగం కూడా ఇవ్వకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏటా వివక్ష‍ను చూపుతున్నది. అందుకు ఈ గణాంకాలే నిదర్శనం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అనేక దేశాల్లో ఆర్థిక సంక్ష‍ోభం వచ్చే అవకాశమున్నది. ఇటీవల ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా బంగారం కొనొద్దనీ, విదేశీ పర్యటనలు, పెట్రోల్‌, డీజిల్‌, వంట నూనెలు వాడకాన్ని తగ్గించుకోవాలనీ, పొదుపు చర్యలు పాటించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.24,166 కోట్ల గ్రాంట్లు ఎలా విడుదలవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు
ప్రతిపక్ష రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. గ్రాంట్ల విడుదలలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఎన్డీయే భాగస్వామ్య పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతిపక్ష‍ రాష్ట్రాలపై వివక్ష‍ చూపుతున్నది. గ్రాంట్ల విడుదలే ఇందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో విధంగా పరిగణించడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పన్నుల్లో వాటా ఇచ్చినట్టు గ్రాంట్ల విడుదలలోనూ అన్ని రాష్ట్రాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

నిధులు తేవడంలో కేంద్ర మంత్రులు విఫలం
తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ‌తెలంగాణకు ఎక్కువ నిధులను తేవడంలో, గ్రాంట్లను విడుదల చేయించడంలో వారు విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు విడుదల చేయకుండా, విభజన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బీజేపీ మతతత్వ విధానాలు, విభజన రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -