యుయస్పీసి స్టీరింగ్ కమిటీ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలసి ఐక్య పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో టీటీఏ అధ్యక్షులు ఎస్.హరికృష్ణ అధ్యక్షతన జరిగింది. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల వైఖరితో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక విద్యకు నష్టదాయకంగా ఉన్న జీవో25 ను సవరించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీఓ 2018కి అనుగుణంగా సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదని సమావేశం విమర్శించింది. టెట్ లో సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని, సబ్జెక్టు వారీ పేపర్లతో స్పెషల్ టెట్ నిర్వహించాలని, బీసీ, గిరిజన గురుకులాల టైంటేబుల్ మార్చాలని కోరింది. మోడల్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, 5 వాయిదాల కరువు భత్యం (డీఏ)ను వెంటనే ప్రకటించాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, ఎ వెంకట్(టీఎస్ యూటీఎఫ్) సిహెచ్ అనిల్ కుమార్, ఎన్ తిరుపతి(టీపీటీఎఫ్), ఎం సోమయ్య, టి లింగారెడ్డి (డీటీఎఫ్), కొమ్ము రమేష్ (బీటీఎఫ్), యానం విజయకుమార్, ఇటికాల రవీందర్(ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం), బి.కొండయ్య (ఎంఎస్ టీఎఫ్), లక్ష్మణ్(టీటీఏ), రవీందర్, లక్ష్మయ్య యాదవ్(టీపీటీఎఫ్) పాల్గొన్నారు.
ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై ఐక్య ఉద్యమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



