Friday, May 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికార్పొరేట్‌ వలలో విద్య

కార్పొరేట్‌ వలలో విద్య

- Advertisement -

విద్య అనేది మనిషిని విజ్ఞానవంతుడిగా మార్చాలి.. కానీ నేడు అది విద్యార్థులను ‘మార్కుల యంత్రాలు’గా, తల్లిదండ్రులను ‘అప్పుల కుప్పలు’గా మారుస్తోంది. పవిత్రమైన బడిని వ్యాపార గల్లా పెట్టెగా మార్చిన కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో విద్యా వ్యవస్థ చిక్కి విలవిలలాడుతోంది. సరస్వతీ నిలయాలుగా వెలవాల్సిన విద్యాసంస్థలు నేడు ‘లాభాల ఫ్యాక్టరీలు’గా రూపాంతరం చెంది, అక్షరాలను అంగడి సరుకుగా విక్రయిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రయివేటు, కార్పొరేట్ సంస్థల అడ్డూఅదుపు లేని దోపిడీ పర్వం మొదలవుతోంది. అడ్మిషన్లు, డొనేషన్లు, రీ-అడ్మిషన్ల పేరుతో లక్షలాది రూపాయలను పిండుకుంటూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. చదువుకునే రోజులు పోయి.. చదువును కొనుక్కునే రోజులు వచ్చాయి. పాఠశాలలు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా, పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర సామగ్రిని తమ వద్దే కొనాలని నిర్బంధిస్తూ విద్యా విలువలను తుంగలో తొక్కుతున్నాయి.

విద్యాహక్కు చట్టం (ఆర్‌‌టీఈ) ప్రకారం దక్కాల్సిన ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లు కాగితాలకే పరిమితం కావడం, ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ కార్పొరేట్ శక్తులకు పరోక్షంగా కొమ్ముకాయడం అత్యంత విచారకరం ఈ కార్పొరేట్ మాయాజాలం నేడు పట్టణాల నుండి చాపకింద నీరులా పల్లెలకు విస్తరించింది. తమ పిల్లలు గొప్ప చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశపడే గ్రామీణ పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల బలహీనతను ఈ సంస్థలు పెట్టుబడిగా మార్చుకుంటు న్నాయి. కాయకష్టం చేసే సామాన్యుడు సైతం లక్షల రూపాయలు ఫీజులు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలోనే రెండు సంవత్సరాలకు గాను రెండు నుండి నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ర్యాంకుల హోరులో సామాన్యుడి కన్నీటి జోరు ఎవరికీ వినిపించడం లేదు.

అయితే, ఇంత భారీ మూల్యం చెల్లిస్తున్నా విద్యార్థులకు అందుతున్నది మాత్రం ‘యాంత్రిక విద్యే’. తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు విద్యార్థులను కేవలం మార్కుల యంత్రాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ శాస్త్రీయ విద్యా విధానానికి చోటు లేదు, కేవలం ‘బట్టీ పద్ధతి’కే పెద్దపీట వేస్తున్న పరిస్థితి ఉంది. కనీస వసతులు లేని ఇరుకు గదులు, గాలి వెలుతురు చొరని భవనాలు, ఆటస్థలం లేని ప్రాంగణాలు నేడు విద్యా సంస్థల ముఖచిత్రంగా మారాయి. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఎందరో విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులకే ప్రాధాన్యతనిస్తూ, సామాజిక శాస్త్రాలు (హెచ్‌ఈసీ, సీఈసీ)లను కనుమరుగు చేస్తున్న ఈ వ్యవస్థ, రేపటి సమాజానికి అవసరమైన బహుముఖ ప్రజ్ఞాశాలలను సమాధి చేస్తోంది.

వ్యవస్థ మారాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. ప్రతి పాఠశాల వసూలు చేసే ఫీజు వివరాలను పారదర్శకంగా బహిరంగ పరచాలి. నిబంధనలు అతిక్రమించే సంస్థల గుర్తింపును నిర్మొహ మాటంగా రద్దు చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న శాస్త్రీయ విద్యా విధానాన్ని మన పాఠ్యాంశాల్లో చేర్చాలి. అన్నిటికంటే ముఖ్యంగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, కార్పొరేట్ సంస్థలకు దీటుగా మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను పేదలకు ఉచితంగా అందించాలి. విద్యార్థిని ఒక యంత్రంగా కాకుండా, విలువలతో కూడిన మనిషిగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం, సమాజం కలిసి తీసుకోవాలి. అప్పుడే ఈ ‘కార్పొరేట్‌ చెరసాల’ నుండి చదువులమ్మకు విముక్తి లభిస్తుంది.

గడగోజు రవీంద్రాచారి
9848772232

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -