ప్రకృతి మనిషికి అందించిన అత్యంత విలువైన వనరుల్లో నీరు మొదటిది. అలాంటి నీటి వనరులే నేడు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో జలాశయాలతో పాటు భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. ఇటీవల భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన నివేదికలో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయిందని చూపిన లెక్కలు భయపెడుతున్నాయి. వ్యవసాయంతో పాటు తాగునీటి అవసరాలకు కూడా భరోసాగా నిలిచిన జలాలు నేడు ప్రమాదకర స్థాయికి చేరుకోవడం రాబోయే నీటి సంక్షోభానికి స్పష్టమైన సంకేతం. భూగర్భజలాలు తగ్గిపోవడం అంటే పట్టణాలతో పాటు గ్రామాలకూ ప్రమాదమే. జులై రెండోవారం దాటినా వానల జాడలేదు. ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు ఆశించినంతగా లేవు. ఆకాశం వైపు కండ్లు కాయలు కాచేలా జనం ఎదురుచూస్తున్నారు. అడపాదడపా చినుకులు తప్ప పెద్ద వర్షాలు లేవు. రాష్ట్రంలో ఇరవై జిల్లాలు తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి. మేడ్చల్ – మల్కాజిగిరిలో అత్యధికంగా 48 శాతం, హైదరా బాద్‌లో 25 శాతం లోటు ఉంది. 17 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు గతేడాదితో పోలిస్తే భారీగా పడిపోయాయి. రాజధానిలో 9.96 మీటర్ల నుంచి 12.48 మీటర్లకు పడిపోయింది. నాగార్జునసాగర్, శ్రీరాం సాగర్, జురాల వంటి ఎనిమిది ప్రధాన రిజర్వాయర్లలో 12.92 శాతం నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది దేశంలోని అత్యంత అట్టడుగు స్థాయి. తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉందో అంకెలే ఉదాహరణ. ఇదే పరిస్థితి మరి కొద్దిరోజులుంటే వేసిన పంటలపైనా ఆశలు వదులుకోవాల్సిందే.
తాగునీటికీ ఇబ్బందులు తప్పవు.తెలంగాణలో తాగునీటి సరఫరా, వ్యవసాయం, పరిశ్రమలు, గ్రామీణ జీవన విధానం భూగర్భ జలాలపైనే ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. వరుసగా వర్షాలు తగ్గడం, పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాల రీఛార్జ్ లేకపోవడం, చెరువులు ఆక్రమణలకు గురికావడం వల్ల భూగర్భ జలాలు ప్రతి ఏడాది మరింత లోతుకు వెళ్లుతున్నా యని నిపుణుల అభిప్రాయం. ఒకప్పుడు 100 నుంచి 200 అడుగుల్లో లభించిన నీరు ఇప్పుడు 800 నుంచి వెయ్యి అడుగుల లోతులోనూ దొరకని పరిస్థితి. జలాశయాల్లో నిల్వలు తగ్గిపోతే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు బోర్లపై ఆధారపడాల్సి వస్తుంది. అవి కూడా ఎండిపోతే ట్యాంకర్లే దిక్కు. ఇలాంటి పరిస్థితులకు ప్రకృతి వైఫరీత్యాలే ఒక్కటే కారణం కాదు, కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరించిన విధానాలూ నష్టాన్ని తెచ్చాయి. ప్రకృతిని చెరబట్టేలా అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ అధిపతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్లే ప్రస్తుత పర్యావరణం సంక్షోభంలోకి చిక్కుకుంది. అడవులను, కొండలను, జలశయాలను పూర్తిగా ధ్వంసం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురిచింది.రాబోవు కాలంలోనూ వర్షాలు ఆశించి నంతగా ఉండబోవనేది భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా. జూన్‌లో మొదలైన ఈ పరిస్థితులు జులై, సెప్టెంబర్ మధ్య తీవ్రరూపం దాల్చి శీతాకాలం వరకు కొనసాగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక. గోదావరితో పాటు కృష్ణా బేసిన్‌లోనూ ఇలానే ఉంటుందని నిపుణుల వాదన.
వాతా వరణంలో జరుగుతున్న పరిణామాలను ముందస్తు అంచనా వేసినట్టు చెబుతున్నా.. ఆ దిశగా కేంద్రం అడుగులు పడుతున్నట్టు లేవు. సమస్య తీవ్రతను సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎల్‌నినోను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటున్న కేంద్రం నిధులు ఇవ్వకుంటే రాష్ట్రాలు ఎక్కడికి పోవాలి? కరోనా సమయంలోనూ రాష్ట్రాల మీదకు తోసేసి ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇప్పుడు కూడా కార్పొరేట్ల మెప్పుకోసం ఉపాధి, జలయుద్ధాలు చేసుకోవడానికి వెనుకాడటం లేదు. సమీప భవష్యత్తులో వానలు పడకపోతాయా సమస్య నుంచి తప్పించుకోకపోతామా అన్న ఆశతో ఆకాశం వంక ఎదురు చూస్తూ రైతులు కూడా అదే పని చేయాలని ప్రభుత్వాలు అనుకుంటే అంతకంటే బాధ్యతారాహిత్యం మరొకటి ఉండదు. నిపుణులు హెచ్చరించినట్టు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించాలి. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా సహాయ చర్యలకు ఉపక్రమించాలి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా పాలక, ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. సమస్య వచ్చినప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన అంశమంటూ వాదించేవారు మోడీ సర్కార్ నుంచి నిధులు రాబట్టాలి. దానికోసం రాష్ట్రప్రభుత్వం అఖిలపక్షాన్ని సమావేశపరచాలి. కేంద్రం వద్దకు తీసుకెళ్లాలి. ఉపాధి హామీ చట్టం కింద రాష్ట్రానికి అధికంగా నిధులు విడుదల చేయించాలి. మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలి. యుద్ధప్రాతిపదికన చిత్తశుద్ధితో ఈ చర్యలు చేపడితేనే సమస్య నుంచి బయటపడగలం.
జల సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


