ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తోంది గనుక నిరోధించేందుకు తాము దాడులకు దిగినట్లు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మార్చి నెల ప్రారం భంలో ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశాడు. అంతకు ముందు 2025లో కూడా దాడులు చేసి అణు స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరోసారి ఎనిమిది నెలలకే దాడులకు దిగాడు. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఇరాన్ పై దాడులతో ట్రంప్ రేపిన చిచ్చును ఆరనివ్వకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. జూలై 11న మరోసారి ప్రారంభమైన దాడులు-ప్రతిదాడులు మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలు. అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి కుట్రలకు వ్యతిరేకంగా 2022 ఫిబ్రవరిలో రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఇంకా ముగియలేదు. ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చి పశ్చిమదేశాలు ఇంకా ఎగదోస్తూనే ఉన్నాయి. గత శతాబ్దిలో ఎనిమిదేండ్ల పాటు ఇరాన్-ఇరాక్ యుద్ధం జరిగింది. అమెరికా తీరుతెన్నులు చూస్తుంటే ప్రస్తుత సంక్షోభం కూడా వాటి సరసన చేరుతుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కనీసంగా అమెరికా పార్లమెంటుకు నవంబరు మూడవ తేదీన జరిగే ఎన్నికలు ముగిసేవరకైనా రిపబ్లికన్ పార్టీ ఓట్ల కోసం ట్రంప్, అక్టోబరు నెలలో ఇజ్రాయిల్‌లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తన పార్టీని గెలిపించేందుకు నెతన్యాహు లెబనాన్ మీద దాడులను కొనసాగించే వైఖరి కనిపిస్తోంది. ఈ ఇద్దరు నేతల దుర్మార్గాలకు ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు పడుతూ లేస్తూ మనవంటి దేశాల్లో సామాన్యులను నానా ఇబ్బందులు పెడుతున్నాయి.
ఎప్పుడు స్టాక్‌మార్కెట్ కుప్ప కూలుతుందో ఎందరు ఎంత సొమ్ము పోగొట్టుకుంటారో తెలియని అయోమయం నెలకొన్నది. సంక్షోభాలు, యుద్ధాలు కొనసాగితే అమెరికా కార్పొరేట్లకు కాసుల పంట పండుతుంది. అందుకే అవి నిత్యం ఎక్కడో ఒకచోట చిచ్చు పెట్టేందుకు చూస్తుంటాయి. అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకా ప్రయాణానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇరాన్‌కు అప్పగించారు. జూన్ 17న కుదిరిన ఒప్పందం ప్రకారం అరవై రోజుల పాటు వాణిజ్య నౌకల రవాణా మీద ఎలాంటి సుంకాలు విధించకూడదు. దాన్లో భాగంగా ఏ నౌక అయినా తమకు వివరాలు తెలిపి, తాము సూచించిన మార్గంలో ప్రయాణించాలని ఇరాన్ ప్రకటించింది. అయితే కొన్ని నౌకలు దీనికి భిన్నంగా ఎటువైపు వెళ్లేదీ తెలియనివ్వకుండా సంకేతాలను పంపే వ్యవస్థలను కట్టివేసి ప్రయాణిస్తుండటంతో, అలాంటి నౌకలు హెచ్చరికలను ఖాతరు చేయకపోవటంతో ఇప్పటికి మూడుసార్లు కొన్ని నౌకల మీద ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. వాటిని సాకుగా చూపి అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నది. దానికి ప్రతిగా గల్ఫ్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ కూడా ధీటుగా ప్రతిదాడులు చేస్తున్నది. ఈ క్రమంలో ఇరాన్‌తో ఇక చర్చలేవీ లేవన్న ట్రంప్ వెంటనే మాట మార్చి సాంకేతిక అంశాలపై ఉంటాయని చెప్పాడు. పాకిస్తాన్, కతార్, ఈజిప్టు రంగంలోకి దిగి మరోసారి చర్చల కోసం రావాలని ఇరు పక్షాలనూ కోరుతున్నాయి. అదేమీ తేలకుండానే అమెరికా రెచ్చగొట్టుడు కారణంగా హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
తాము కూడా దిగ్బంధనాన్ని తిరిగి కొనసాగించి ఇరాన్‌కు నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించాడు. అంతేకాదు హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల మీద వాటిలోని సరకు విలువలో ఇరవై శాతం పన్ను విధిస్తానని కూడా ప్రకటించాడు. అంతకు ఇరాన్ పన్ను వసూలు చేస్తానని చెబితే వ్యతిరేకించిన పెద్దమనిషి ఇప్పుడు తానే ఆపని చేస్తానని చెప్పాడు. హార్ముజ్ జలసంధి అమెరికా చేతుల్లోకి పోతే మనం దిగుమతి చేసుకొనే చమురుకు ఇరవై శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఎంత ఖర్చు పెరిగినా జనం మీద మోపేదే గనుక మన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులెవరూ ట్రంప్ ప్రకటన మీద నోరెత్తటం లేదు. 9తమ దుష్ట చర్యలను సమర్ధించుకొనేందుకు అమెరికా-ఇజ్రాయిల్ కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయి.వాటిలో తాజాగా చెప్పిందేమిటంటే డోనాల్డ్ ట్రంప్‌ను అంతం చేసేందుకు ఇరాన్ కుట్ర చేసింది. తనను చంపేందుకు చూస్తున్నట్లు అంకారాలో జరిగిన నాటో సమావేశాల్లో డోనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పాడు.ఆ కుట్రను ఇజ్రాయిల్ నిఘావర్గాలు కనిపెట్టి ట్రంప్‌కు తెలియచేశాయట, మరి అమెరికా సిఐఏ ఏం చేస్తున్నట్లు ? జనం చేత ఇలాంటి పిట్టకతలను నమ్మించటం కూడా సులభమే, ఎందుకంటే తమ సుప్రీమ్ నేత, ఇతర ఉన్నత సైనికాధికారులను అకారణంగా చంపి, దాడులు చేస్తున్న తరువాత ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా! బదులు తీర్చుకుంటామని నేతలు ప్రకటించిన నేపధ్యంలో అలాంటిదేదో జరిగి ఉంటుంది లెమ్మని సామాన్యులు అనుకోవటం సహజం. ఇరాన్ మీద అమెరికా దాడులు, దాని అధినేతలను లేపేస్తామని పదే పదే చెప్పటం, ఆంక్షలతో ఆర్థికంగా ఇబ్బందులు పెట్టటం ఈ రోజు కొత్తగా ప్రారంభించినవి కాదు, 1979 నుంచి కొనసాగుతున్నాయి.
అందువలన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు గనుక, జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలు తీసేందుకు ఇరాన్ ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా ఇంతవరకు ఇరాన్ అలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. రోజువారీ దాడులు, ప్రతిదాడులు ఎదుటి పక్షాన్ని ఏ విధంగా దెబ్బతీసిందీ ఆయా దేశాలు చేస్తున్న ప్రకటనల వార్తలు తెలిసిందే. ఇరాన్ అణు, మిలిటరీ సామర్ధ్యాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు ట్రంప్ ఇప్పటి వరకు నలభై నుంచి యాభైసార్ల వరకు చెప్పి ఉంటాడు. అయినా అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడులు ఎలా చేయగలుగుతున్నదన్న అంశం అనేకమందికి అంతుబట్టటం లేదు. ‘తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు పుట్టుకు వస్తాడన్న’ లోకోక్తి తెలిసిందే. తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు. మానవుడి పరిణామ క్రమంలో అవసరాలే అనేక నూతన ఆవిష్కరణలకు దోహదం చేశాయి. ఇది ఇరాన్‌కూ వర్తిస్తుంది. వియత్నాంపై రెండున్నర దశాబ్దాల పాటు జపాన్, ఫ్రాన్సు, అమెరికా సామ్రాజ్య వాదులు భీకరదాడులు చేశారు. వారి మిలిటరీ, ఆయుధ సామర్థ్యాన్ని గెరిల్లా పోరాట పద్ధతులను అనుసరించి కమ్యూ నిస్టులు ఎదిరించి నిలవటమే కాదు, 1975లో అమెరికన్లు దొరికిన విమానాలు, హెలికాప్టర్లను పట్టుకొని పారి పోయేట్లు చేశారు.ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల చేతిలోనూ అమెరికాకు అదే పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇరాన్‌లో కూడా అమెరికాకు అదే జరుగుతోంది.
అడవులు, కొండలు, గుట్టల్లో గెరిల్లా పద్ధతి వేరు. సముద్రంలో కూడా ఇరాన్ ఆ విధానాన్ని అనుసరిస్తున్నది. ఆత్మరక్షణ-ప్రతిఘటన దాడి పద్ధతులను అభివృద్ధి చేసుకొన్నది. దీనికి ఇతర దేశాల అనుభవాలు నేర్పిన పాఠాలతో పాటు చైనా, రష్యా అందచేస్తున్న సహకారం కూడా తోడు కావటం, ఈ పరిణామాలను అమెరికా, ఇజ్రాయిల్ పసికట్టలేకపోవటం కనిపిస్తున్నది. గూఢచర్యంలో ఈ రెండు దేశాల తరువాతే మిగతావి అన్నట్లు అనేక మంది కీర్తించటం తెలిసిందే. అలాంటి తోపులనే ఇరాన్ తప్పుదారి పట్టించి తనను తాను కాపాడుకుంటున్నది, ప్రతిదాడులు చేయగలు గుతున్నది. తన డ్రోన్లు, క్షిపణులు ఎక్కడ ఉన్నదీ తెలియకుండా కాపాడుకోవటమే కాదు, ప్రయోగ కేంద్రాలను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ శత్రుల నిఘాను ఏమారుస్తున్నది. ఇరాన్ నౌకా దళాన్ని రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఒకసారి నాశనం చేశారు, తరువాత మరోసారి విధ్వంసం కావించారు. తాజాగా మూడవసారి అమెరికా మరికొంత నష్టం కలిగించింది. అయినా స్వల్ప ఖర్చుతో చిన్న పడవలతో హార్ముజ్ జలసంధిలో అమెరికాను ముప్పుతిప్పలు పెట్టటంలో ఇప్పటివరకు ఇరాన్ జయప్రదమైంది. ఇరాక్‌తో ఎనిమిది సంవత్సరాలు జరిగిన యుద్ధ సమయంలో చమురు టాంకర్లపై జరిగిన దాడులు ఒక పాఠాన్ని నేర్పాయి. శ్రీలంక మిలిటరీపై ఎల్‌టిటి తీవ్రవాదులు పడవలతో సాగించిన పోరు నుంచి నేర్చుకున్నారు.
ఇప్పుడు రష్యా దాడులను ప్రతి ఘటిస్తున్న ఉక్రెయిన్, పీపుల్స్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మారిటైమ్ మిలీషియా పేరుతో ఒక దళాన్ని ,చైనా నిర్వహిస్తున్నది.ఈ దళ సభ్యులు దక్షిణ చైనా సముద్రంలో రోజువారీ చేపలు పట్టేవారిగా, శత్రుదేశాల ఓడల కదలికల మీద నిఘా వేసేవారిగా, అవసరమైతే చిన్న చిన్నదాడులు చేసేందుకు చైనా మిలిటరీ సహకారంతో నడిపిస్తున్న చిన్న చిన్న పడవల అనుభవమూ ఇరాన్‌కు పనికి వచ్చింది. ఈ దళంలోని పడవలు చైనా తనవిగా చెబుతున్న సముద్ర జలాల్లో ప్రవేశించి చేపలు పడుతూ చైనా సార్వభౌమత్వాన్ని పదే పదే ఇతర దేశాలకు గుర్తు చేస్తుంటాయి,విదేశీ నౌకలకు చికాకులు కలిగిస్తుంటాయి. చైనా నౌకాదళం, తీరరక్షణ దళంతో పాటు దీన్ని చైనా మూడవ సముద్ర శక్తిగా ఇతర దేశాలు వర్ణిస్తాయి. 1979లో తమ తొత్తు షాను గద్దె దించి అధికారానికి వచ్చిన ఇస్లామిక్ శక్తులను దెబ్బతీసేందుకు 1980లో ఇరాక్‌ను రెచ్చగొట్టిన అమెరికన్లు ఇరాన్ మీద దాడులు చేయించారు. అవి 1988 వరకు కొనసాగాయి. ఇరాన్ చమురు ఎగుమ తులను దెబ్బతీయటం ఆ పోరు లక్ష్యాలలో ఒకటి. దానిలో భాగంగా టాంకర్ల మీద దాడులు,ప్రతిదాడులు జరగటంతో టాంకర్ల పోరుగా దాన్ని పిలిచారు. నాలుగు వందల చమురు టాంకర్ల మీద దాడులు జరగ్గా కొందరు సాధారణ పౌరులతో సహా రెండు వందల మందికి పైగా నావికులు మరణించారు. అప్పుడు కూడా హార్ముజ్ జలసంధిని దిగ్భంధనం చేసేట్లు ఇరాన్‌ను రెచ్చగొట్టినా ఆ నాడున్న పరిస్థితిలో అది జరగలేదు.
ఇలా ఎన్నింటినో అధ్యయనం చేసిన ఇరాన్ హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారైంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డులకు ఒక అధినాయకత్వం ఉన్నప్పటికీ ప్రాంతీయ విభాగాలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసి శత్రువులను దెబ్బతీసేందుకు ఏ పద్ధతి వీలైతే దాన్ని అమలు చేస్తే స్వేచ్చ ఇచ్చారు.శత్రువును దెబ్బతీయటమే అంతిమ లక్ష్యం. ప్రపంచ రవాణాలో పర్షియన్ గల్ఫ్ లేదా హార్ముజ్ జలసంధి ప్రధాన మైనది. ఇందులో సూయజ్ కాలువ ద్వారా తూర్పు మధ్యధరా సముద్రంతో హిందూ మహాసముద్రాన్ని కలిపే ఎర్ర సముద్రం కీలక పాత్ర పోషిస్తున్నది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం కావించేందుకు గతంలో ఇరాక్ ఎంతగానో రెచ్చగొట్టింది. అలా జరిగితే పశ్చిమ దేశాలన్నింటినీ రంగంలోకి దించాలన్నది అసలైన ఎత్తుగడ. అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు, మిత్రదేశాలు అమెరికా కోసం చేతులు కాల్పుకొనేందుకు సిద్ధంగా లేవని ఉక్రెయిన్ నేర్పిన అనుభవం, అదే హార్ముజ్ విషయంలో పునరావృతం అవుతుందని వేసిన అంచనా. ఇలా ఎన్నో పరిణామాల పూర్వరంగంలో ఇరాన్ ముందుకొచ్చి జలసంధిని దిగ్బంధనం కావించింది, అది టెహరాన్ ముందు చూపునకు నిదర్శనమైతే వాస్తవాలను గ్రహించలేక అహంకారానికి లోను కావటానికి అమెరికా తార్కాణంగా నిలిచింది. పశ్చిమాసియా సంక్షోభం ముగియటం అనివార్యం, అయితే ఎలా అన్నది ఇప్పుడే చెప్పలేము!
ఎం కోటేశ్వరరావు
8331013288



