భారతదేశంలో క్రికెట్ ఒక భావోద్వేగం. కానీ నేడు ఐపీఎల్ ఆ భావోద్వేగాన్ని ఒక ”అమ్మకపు వస్తువు”గా మార్చేసింది. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభ కంటే, వారిపై వేసే ”వేలం పాట” ధరలే వార్తల్లో నిలుస్తున్నాయి. ఇది కేవలం క్రీడ కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి నిర్మించుకున్న ఒక రంగుల ప్రపంచం. క్రీడలను వినోదంతో కలిపి, వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పోర్ట్స్ లీగ్‌లలో ఒకటిగా ఎదిగింది. ఐపీఎల్‌లో ప్రతి సెకనుకు ఒక ధర ఉంది. ఆటగాడి జెర్సీ మీదే కాదు, అంపైర్ జెర్సీలపై కూడా పది రకాల కంపెనీల లోగోలు, బౌండరీ లైన్ దగ్గర కార్పొరేట్ బ్రాండ్లు, చివరికి అంపైర్ ఇచ్చే నిర్ణయం వెనుక కూడా ప్రకటనల హోరు కనిపిస్తోంది. ఇక్కడ క్రికెట్ అనేది కేవలం ‘కంటెంట్’ మాత్రమే, అసలు లక్ష్యం ప్రకటనల ద్వారా సామాన్యుడి జేబును ఖాళీ చేయడం. క్రీడా స్ఫూర్తి కంటే ‘వ్యూయర్-షిప్ రేటింగ్స్’ (ు=ూ) కోసం క్రీడను మలచడం ఆందోళనకరం.
2008లో ప్రారంభమైన ఐపీఎల్, 2026 నాటికి ఒక క్రీడా టోర్నమెంట్ స్థాయి నుండి పూర్తిస్థాయి ‘గ్లోబల్ కార్పొరేట్ ఎంటర్టైన్‌మెంట్’ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది. ఈ ప్రయాణాన్ని విశ్లేషిస్తే, ఆట తీరులో వచ్చిన మార్పులు కేవలం సాంకేతికమైనవి కావు, అవి మార్కెట్ శక్తుల ఒత్తిడి వల్ల కలిగినవి. ‘వస్తువు’గా మారిన క్రీడాకారుడు 2008లో ఆటగాళ్లు దేశం కోసం ఆడే గౌరవంతో ఉండేవారు. కానీ 2026 నాటికి ఆటగాడు ఒక బ్రాండ్‌గా, ఒక ‘కమ్మోడిటీ’గా మారిపోయాడు. వేలం పాటలు మనుషుల నైపుణ్యానికి ధర కట్టే సంతలుగా మారాయి. ఆటగాడి ఫిట్‌నెస్, ఫామ్ కంటే అతని ‘మార్కెట్ వాల్యూ’, ‘సోషల్ మీడియా ఫాలోయింగ్-లకే ఫ్రాంచైజీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇది క్రీడాకారుడిని ఒక స్వతంత్ర వ్యక్తిగా కాకుండా, కార్పొరేట్ లాభాల కోసం వాడే ఒక వస్తువుగా మార్చేసింది.
రీజినల్ మార్కెటింగ్ స్ట్రాటజీ
ప్రతి జట్టుకు ఒక నగరం పేరు (హైదరాబాద్, ముంబై, కోల్‌కతా…) పెట్టడం వెనుక ఉన్నది ప్రాంతీయ అభిమానం కాదు, అది కేవలం ‘రీజినల్ మార్కెటింగ్ స్ట్రాటజీ’. సామాన్య ప్రజల సెంటిమెంట్లను సొమ్ము చేసుకునే ప్రక్రియ ఇది. 2008లో ఇది కొంత సహజంగా అనిపించినా, 2026 నాటికి జట్లు తమ మూలాలను వదిలేసి, కేవలం గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాయి.
జూదంగా మారిన ఆట
2008లో క్రికెట్ విశ్లేషణలు సరళంగా ఉండేవి. 2026 నాటికి ‘డేటా అనలిటిక్స్’ పేరుతో ఆటగాడి ప్రతి కదలికను రికార్డ్ చేస్తున్నారు. ఇది ఆటగాడి సజనాత్మకతను చంపేసి, అతన్ని ఒక రోబోలా మారుస్తోంది. మరీ ముఖ్యంగా, ‘ఫాంటసీ లీగ్స్’ (ణతీవaఎ11 వంటివి) క్రీడను జూదంగా మార్చేశాయి. మధ్యతరగతి, పేద యువత తమ కష్టార్జితాన్ని ఈ యాప్‌లలో పోగొట్టుకుంటుంటే, ఆ కంపెనీలు ఐపీఎల్ స్పాన్సర్లుగా మారి వేల కోట్లు గడిస్తున్నాయి.
గ్లామర్ ఙర గ్రౌండ్ రియాలిటీ
ఐపీఎల్ మైదానాల్లో వినిపించే డీజేలు, చీర్ లీడర్లు, మెరుపులు అన్నీ సామాన్యుడిని అసలు సమస్యల నుండి మళ్లించే ‘వినోదపు మత్తు’. ఒకవైపు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియం బయట పేదరికం, నిరుద్యోగం తాండవిస్తుంటే, లోపల మాత్రం కత్రిమమైన సంబరాలు జరుగుతుంటాయి. 2008 నుంచి 2026 వరకు ఇది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది.
క్రికెట్ ప్రజాస్వామ్యీకరణ కాదు.. కేంద్రీకరణ
క్రికెట్ చిన్న దేశాలకు లేదా గల్లీ స్థాయికి చేరుతోందని ప్రచారం జరుగుతున్నా, వాస్తవానికి అధికారం మాత్రం కొద్దిమంది కార్పొరేట్ యజమానుల చేతుల్లోనే కేంద్రీకతమైంది. బీసీసీఐ సహా పెద్ద ఫ్రాంచైజీలే ప్రపంచ క్రికెట్ గమనాన్ని శాసిస్తున్నాయి. ఇది క్రీడలో ఉండాల్సిన సమానత్వ స్ఫూర్తికి విరుద్ధం. ఐపీఎల్ 2008లో 8 జట్లతో మొదలై ఇప్పుడు 10 జట్లతో నేటీకి విజయవంతంగా కొనసాగుతోంది. కానీ అనేక మార్పులతో సరికొత్తగా 2026 ఏడాదికి ఐపీఎల్ 19వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమై… అభిమానులను ఉర్రూతలు ఊగిస్తోంది. ఒకప్పుడు కేవలం ఆటగాళ్ల నైపుణ్యాన్ని చూసే క్రికెట్, ఐపీఎల్ పుణ్యమా అని ”గ్లామర్ ం బిజినెస్” ప్యాకేజీగా మారింది. క్రికెటర్లకు భారీ వేతనాలు అందడం నుండి, పెట్టుబడిదారులకు లాభాలు రావడం వరకు ఐపీఎల్ ఒక పక్కా కమర్షియల్ ఆటగా మారిపోయింది.
ఇక ఈ సీజన్ వస్తే (ఐపీఎల్ -2026) మార్చి 28న మొదలైన సీజన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఆరంభంలో అదరగొట్టిన పలు జట్లు ప్లేఆఫ్ రేస్‌కు వచ్చేసరికి మెయిన్ టీంలు వెనకబడిపోయాయి. పాయింట్ల పట్టికలో మొదటి నుంచి దిగువ స్థానానికి పడిపోయాయి. ఇప్పటికే ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జాయిట్స్ లీగ్ నుంచి నిష్క్రమించాయి. అదే బాటలో ఢిల్లీ కాపిటల్స్, కేకేఆర్ కూడా ఉన్నాయి. మొదటిలో వరస విజయాలతో మెరిసిన ఆర్‌ఆర్, పంజాబ్ కింగ్స్ ఇప్పుడు వరుస పరాజయాలతో తడబడుతున్నాయి. ఆర్సీబీ, ఎస్‌ఆర్హెచ్, గుజరాత్ జాయిట్స్ టాప్ బ్యాటింగ్, బౌలింగ్ తో ప్లేప్ రేసులో ముందున్నాయి. ఆరంభంలో తడబడుతూ… ఇప్పుడు వరస విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ రేసులో గట్టి పోటీని ఇస్తుంది.
ఆన్ క్యాప్డ్ ప్లేయర్స్-2026
వైభవ్ సూర్యవంశీ: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ కెరీర్‌ను గమనిస్తే, అతను ప్రస్తుతం 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) తరపున ఒక తిరుగులేని పరుగుల యంత్రంలా దూసుకుపోతున్నాడు. కేవలం 15 ఏండ్ల ప్రాయంలోనే సీనియర్ ఆటగాళ్లను తలదన్నే రీతిలో రికార్డులు సష్టిస్తున్నాడు. గత సీజన్ నుంచి సంచలన ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతూ ఇప్పటికే 404 పరుగులు చేసిన వైభవ్.. టాప్ క్లాస్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు.
ప్రియాంశ్ ఆర్య: అంతా వైభవ్, అభిషేక్ ఓపెనింగ్ గురించే ప్రస్తావిస్తారు కానీ.. వారిద్దరికీ ఏమాత్రం తీసిపోని ఆటగాడు ప్రియాంశ్ ఆర్య. వైభవ్ తరహాలోనే అత్యంత వేగంగా పరుగులు సాధించే బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు ఆర్య. ఇతని ఎదుగుదల చూస్తుంటే ఆధునిక క్రికెట్ ఎలా పూర్తిస్థాయిలో ‘పవర్ హిట్టింగ్’ వైపు మళ్లుతుందో అర్థమవుతుంది. ఇక్కడ నిలకడ కంటే ‘స్ట్రైక్ రేట్-,’ఇంపాక్ట్’కే కార్పొరేట్ యజమానులు విలువ ఇస్తున్నారు. వైభవ్, ప్రియాంశ్ లను ఒకరితో ఒకరిని పోటీలో ఉంచి, వారి నుంచి గరిష్టంగా ‘కమర్షియల్ వాల్యూ’ను రాబట్టే ప్రయత్నం లీగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఆటగాళ్లలో సహజమైన టెక్నిక్ కంటే, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ‘హిట్టింగ్’ నేర్చుకోవాలనే ఒత్తిడిని పెంచుతుంది.
ప్రభ్ సిమ్రన్ సింగ్: ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ టార్గెట్ (265)ను పంజాబ్ కింగ్స్ ఛేదించిందంటే.. ప్రభ్ సిమ్రన్ దూకుడే కారణం. మైదానం నలువైపులా షాట్లు కొట్టే ప్రభ్ 8 ఇన్నింగ్స్‌ల్లో 361 పరుగులు చేశాడు.
రఘువంశీ: కోల్‌కతా తరఫున ఈ సీజన్‌లో నిలకడగా ఆడుతోన్న ఒకే ఒక్క ప్లేయర్ అంగ్‌క్రిష్ రఘువంశీ. వన్‌డౌన్ లేదా సెకండ్ డౌన్‌లో వస్తూ కేకేఆర్ ఇన్నింగ్స్‌ను నిలబెడుతోన్న రఘువంశీ ఇప్పటి వరకు 268 పరుగులు చేశాడు. వీరితో పాటు నమన్ ధిర్, సమీర్ రిజ్వీ, ఆయుష్ మాత్రే, ఆయుష్ బదోని, సలీల్ అరోరా, కార్తిక్ శర్మ, అనికేత్ వర్మ.. ఇలాంటి యువ క్రికెటర్లూ ఉన్నారు. బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడ అదరగొట్టారు. అన్షుల్ కాంబోజ్ (17 వికెట్లు).. ఈయనతో పాటు ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడంలో స్పెషలిస్ట్‌లుగా మారారు.
ధర ఎక్కువ ఆట తక్కువ..
ఐపీఎల్ వేలంలో ఒక్కో ఆటగాడిపై కోట్లు కుమ్మరించడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కానీ, వేలంలో దక్కే ”ప్రైస్ ట్యాగ్” అనేది ఆటగాడికి ఒక వరం లాంటిదైతే, మైదానంలో అది ఒక పెద్ద శాపంగా మారుతోంది. ఐపీఎల్ వేలం జరిగినపుడు ఆయా జట్ల అవసరాలను బట్టి కొందరు ఆటగాళ్లకు వారి స్థాయికి మించి రేటు పలుకుతుంటుంది. ఈ క్రమంలో రికార్డులు బద్దలైపోతుంటాయి. అలా అనుకోకుండా కలిసొచ్చి భారీ ధర దక్కించుకున్న ఆటగాళ్లు.. ఆ సమయానికి చాలా సంతోషిస్తారు కానీ, మైదానంలోకి అడుగు పెట్టినపుడు మాత్రం తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. గత ఏడాది ఐపీఎల్ వేలంలో రికార్డు రేటు దక్కించుకుంది రిషబ్ పంత్. అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా రూ.27 కోట్ల రేటుతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ సొంతమయ్యాడు. కానీ రెండు సీజన్లలో పంత్ సాధారణ ప్రదర్శన చేస్తున్నాడు. ఇక ఈ సీజన్ వేలంలో అత్యధిక రేటు పలికిన కామెరూన్ గ్రీన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతణ్ని కోల్‌కతా రూ.24.2 కోట్లకు సొంతం చేసుకుంది. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించిన గ్రీన్, ఒక లైఫ్ దక్కడంతో దాన్ని ఉపయోగించుకుని 79 పరుగులు చేశాడు.
మిగతా మ్యాచ్‌లన్నింట్లో విఫలమయ్యాడు. లియామ్ లివింగ్‌స్టన్ ఆటతీరు ఘోరం. ఏకంగా రూ.13 కోట్లు పెట్టి ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ను తీసుకుంది ఎస్‌ఆర్‌హెచ్. లివింగ్‌స్టన్‌ను తుది జట్టులో ఆడించడంలో ఇబ్బంది ఉన్నప్పటికీ.. రెండు మ్యాచ్‌లలో బరిలోకి దించింది. దీనికి కారణం లివింగ్ స్టన్ అడిన మ్యాచ్ అతడి ఫౌమ్ పేలవంగా ఉండడమే… ఒక ఆటగాడిని కోట్లు పెట్టి కొన్నప్పుడు, అతను ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతాలు చేయాలని ఫ్రాంచైజీలు, అభిమానులు ఆశిస్తారు. ఈ విపరీతమైన ఒత్తిడి వల్ల సహజసిద్ధమైన ఆట దెబ్బతిని, తక్కువ స్కోర్లకే అవుట్ అవ్వడం లేదా బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు ఇవ్వడం జరుగుతోంది.
బెట్టింగ్
ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు, మైదానంలో ఫోర్లు, సిక్సర్ల హోరు ఎంత ఉంటుందో, బయట ‘బెట్టింగ్’ జోరు కూడా అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఈ బెట్టింగ్ ఉచ్చులో పడి ఎంతోమంది యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చాలామంది యువత ఐపీఎల్‌ను కేవలం ఒక ఆటలా కాకుండా, ”తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు” సంపాదించే మార్గంగా చూస్తున్నారు. మొదట్లో సరదాగా వందలతో మొదలయ్యే ఈ బెట్టింగ్, తర్వాత వేలు, లక్షలకు చేరుతుంది. ఒక్కసారి ఓడిపోతే, ఆ డబ్బును తిరిగి సంపాదించాలనే ఆరాటంలో మరిన్ని అప్పులు చేస్తారు. చివరికి ఆ అప్పులు తీర్చలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు ఆట చూడటంలో ఉన్న ఆనందం పోయి, ప్రతి బాల్‌కు గుండె వేగం పెరగడం మొదలవుతుంది. గెలిస్తే వచ్చే ఉత్సాహం కంటే, ఓడిపోతే వచ్చే నిరాశ, ఆందోళన మనిషిని మానసిక రోగిగా మారుస్తాయి.
దీనివల్ల చదువు మీద, కెరీర్ మీద దష్టి పూర్తిగా మళ్లుతుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో విచ్చలవిడిగా కనిపిస్తున్న బెట్టింగ్ యాప్‌లు కేవలం యూజర్ల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నాయి. ఆల్గారిథమ్స్ అన్నీ నిర్వాహకులకు లాభం వచ్చేలాగే డిజైన్ చేయబడి ఉంటాయి. ఇందులో గెలిచేది ఎప్పుడూ ‘యాప్’ యజమానులే తప్ప సామాన్యులు కాదు. ఈ బిట్టింగ్ లతో యువత ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు. దీని పట్ల ప్రభుత్వాలు కొన్ని కంటి తుడుపు చర్యలు చేప్పటిన అక్కడక్కడ అరెస్టులు చేసి చేతులు దులుపుకుంటున్నాయి. సరైన పద్ధతిలో నిఘా పెట్టడంలో ప్రభుత్వాల విఫలం అవుతున్నాయి. గతంలో సమ్మర్ వచ్చిందంటే తల్లిదండ్రులకు పిల్లలతో ఆడుకోవాలని, ఎంతో సంతోషంగా గడపాలని ఉండేది. కాని ఇప్పుడు సమ్మర్ వచ్చిందటే ఈ బిట్టింగ్ ల వల్ల పిల్లలను ఎక్కడ కోల్పోతామో అని ఆందోళన చెందుతున్నారు.
సామాన్యుడికి దూరమవుతున్న ఆట
ఒకప్పుడు రేడియోలోనో, వీధి చివర టీవీలోనో ఉచితంగా చూసిన క్రికెట్, ఇప్పుడు ఖరీదైన ‘సబ్‌స్క్రిప్షన్’ మోడల్‌లోకి వెళ్లిపోయింది. టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. క్రీడ అనేది అందరిదీ అన్న భావన పోయి, అది కేవలం ధనవంతుల వినోదంగా మారుతోంది. తొలినాళ్లలో ఐపీఎల్ అంటే హాట్‌స్టార్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ రిలయన్స్ రంగంలోకి దిగి హక్కులను చేజిక్కించుకోవడంతో హాట్‌స్టార్ భారీగా దెబ్బతింది. ఫలితంగా ఇప్పుడు మనం చూస్తున్న జీఱశీ-నశ్‌ీర్aతీలో విలీనం జరిగింది. దీనివల్ల డిజిటల్ మీడియా రంగంలో ఒకే ఒక ‘సూపర్ పవర్’ తయారైంది. పోటీ లేకపోతే భవిష్యత్తులో వినియోగదారుడిపై చార్జీల భారం విపరీతంగా పెరుగుతుంది.
ఐపీఎల్.. వాణిజ్యపరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. తమ అభిమాన జట్టు ఆట చూడడానికి ప్రేక్షకులు స్టేడియానికి తరలి వెళ్లడమే కాకుండా ఆట మొదలయ్యే సమయానికి టీవీలకు అతుక్కుపోయే ఫ్యాన్స్ కోకొల్లలు. ఈ క్రమంలోనే బడా వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయాలను, వాటి మార్కెట్ పెంచుకోవడానికి యాడ్ రూపంలో కోట్లు కుమ్మరిస్తున్నాయి. సెకన్ల వ్యవధిలోని యాడ్‌కు లక్షల కోట్లు వెచ్చించడానికి కూడా పలు కంపెనీలు వెనకాడడంలేదంటే అతిశయోక్తి కాదు. తినుబండారాల నుంచి మొదలు ఎలక్ట్రిక్ సాధనాల అమ్మకాలకు ఐపీఎల్ మ్యాచ్‌లను క్రయవిక్రయాల ప్లాట్‌ఫామ్‌గా వాణిజ్య సంస్థలు మార్చుకుంటున్నాయి.
అవినీతి మరకలు
మరోవైపు ఆట ముసుగులో అవినీతి రాజ్యమేలుతుందనే వాదన కూడా ఐపీఎల్‌కు ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు బడా బాబుల బ్లాక్ మనీ.. వైట్ మనీగా చేతులు మారుతున్నాయని క్రీడాభిమానులు వాపోతున్నారు. లలిత్ మోడీ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా మ్యాచ్ ఫిక్సంగ్ ఆరోపణలు ఎదుర్కొని అప్రతిష్ట పాలైంది ఐపీఎల్. చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌ఆర్ జట్లపై రెండేండ్లు ఐపీఎల్‌లో పాల్గొన్నకుండా వేటు పడింది.
గ్లామర్ ముసుగులో శ్రమ దోపిడీ
స్టార్ ఆటగాళ్లు కోట్లు సంపాదిస్తున్న మాట వాస్తవమే, కానీ ఈ వ్యవస్థ వెనుక ఉన్న అట్టడుగు స్థాయి శ్రమను ఎవరూ గుర్తించడం లేదు. స్టేడియంలలో పని చేసే రోజువారీ కూలీలు, సెక్యూరిటీ గార్డులు, గ్రౌండ్ సిబ్బందికి అందే ప్రతిఫలం చాలా తక్కువ. కార్పొరేట్ యజమానులు వేల కోట్లు గడిస్తుంటే, క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి దక్కేది నామమాత్రమే. ఇది సంపద కేంద్రీకరణకు ఒక స్పష్టమైన ఉదాహరణ.
ఐపీఎల్ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్ని ఇస్తుండవచ్చు, కానీ క్రీడను కేవలం ఒక ‘వ్యాపార వస్తువు’గా చూడటం వల్ల క్రీడలోని నైతిక విలువలు లోపిస్తున్నాయి. లాభమే పరమావధిగా సాగుతున్న ఈ ప్రయాణంలో, అసలైన క్రీడా స్ఫూర్తి కార్పొరేట్ చీకట్లలో మాయమవుతోంది. దీనిపై పునరాలోచన చేయాల్సిన సమయం ఇది.
కె.ఎలెందర్, 8187825004



