ఆ పదాలు తొలగించండి

– పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సూచన
న్యూఢిల్లీ: భారతీయ ఎవిడెన్స్‌ చట్టం స్థానంలో తీసుకొచ్చిన బిల్లులో ‘ఏ సమాచారాన్ని అయినా’ అనే పదాలను తొలగించాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ (హోం వ్యవహారాలు) ప్రభుత్వానికి సూచించింది. ఎవిడెన్స్‌ చట్టం స్థానంలో మోడీ ప్రభుత్వం భారతీయ సాక్ష్య బిల్లును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును పరిశీలించి, తగిన సూచనలు చేసేందుకు ప్రభుత్వం స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ‘ఏ సమాచారాన్ని అయినా’ అనే పదాలను అన్వయించుకోవడంలో అనేక తీవ్రమైన సంక్లిష్టతలు తలెత్తే అవకాశం ఉన్నదని కమిటీ అభిప్రాయపడింది. ఆధారాలను తారుమారు చేసే ప్రమాదం కూడా ఉన్నదని హెచ్చరించింది. దర్యాప్తు సందర్భంగా సంపాదించే ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ రికార్డుల ప్రామాణికతను, సమగ్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉన్నదని సిఫార్సు చేసింది. ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్లతో పాటు ఎవిడెన్స్‌ చట్టాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు బిల్ల్లుల్ని ఆగస్ట్‌ 11న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వాటిని 31 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి నివేదించారు. ఈ కమిటీ గత వారం తన నివేదికను ఆమోదించింది. ఈ మూడు బిల్లులపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ అసమ్మతిని తెలియజేశాయి. ఇవి కాపీ-పేస్ట్‌ బిల్లులని, వీటి రూపకల్పనలో తప్పులు ఉన్నాయని, బిల్ల్లుల్ని తొందరపాటుతో ప్రవేశపెట్టారని విమర్శించాయి.

Spread the love