- Advertisement -
- జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి భవనాల పరిశీలన
నవతెలంగాణ-కాటారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కోర్టుల ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నేపథ్యంలో కాటారం మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి – జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు స్థాపనకు సంబంధించిన ప్రక్రియ వేగం అందుకుంది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సూర్య చంద్రకళ శుక్రవారం కాటారంలో పలు భవనాలను పరిశీలించారు. స్థానిక న్యాయవాదులతో కలిసి కోర్టు నిర్వహణకు అనుకూలమైన భవనాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు సులభంగా చేరుకునే సౌకర్యాలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి అవసరమైన వసతులు వంటి అంశాలను ఆమె సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు ఆకుల రాములు, మెషినేని శ్రీనివాస్ రావు, అబ్దుల్ కలాం, రంజిత్ కుమార్, ఆరేళ్లి వెంకటస్వామి, రేపాల సంతోష్, ఇందారపు శివకుమార్, వల శ్రవణ్ రావు, పొలం సతీష్ తదితరులు కోర్టు ఏర్పాటుపై తమ అభిప్రాయాలు, అవసరాలను జడ్జి గారికి వివరించారు. గత కొంతకాలంగా కాటారం ప్రాంత ప్రజలు కోర్టు ఏర్పాటును కోరుతూ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. కోర్టు ఏర్పాటు ద్వారా ప్రజలకు న్యాయ సేవలు మరింత వేగంగా, సులభంగా అందుబాటులోకి రానున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



