Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండోరోజూ కొనసాగిన ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు

రెండోరోజూ కొనసాగిన ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల పట్టణంలో రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ రెండో రోజు గురువారం కూడా కొనసాగింది. పట్టణ సౌందరీకరణలో భాగంగా, ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ప్రధాన రహదారుల వెంబడి అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్లు, అక్రమ కట్టడాలను అధికారులు జేసీబీల సహాయంతో కూల్చివేశారు.

మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ పర్యవేక్షణలో టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టణంలోని కూరగాయల మార్కెట్ రోడ్డు నుండి జయపాల్ రెడ్డి ఆసుపత్రి గళ్ళి వరకు ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఇదివరకే హెచ్చరించినప్పటికీ, స్పందన లేని చోట కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రహదారులను ఆక్రమించే ఎవరినీ ఉపేక్షించేది లేదని, అక్రమ నిర్మాణాల వల్ల వాహనదారులకు, పాదచారులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ముందస్తు సమాచారం లేకుండానే హఠాత్తుగా కూల్చివేతలు చేపట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తగినంత సమయం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయితే, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ హెడ్ కె.సుమన, బిల్డింగ్ ఓవర్సీర్ సందీప్ రెడ్డి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -