అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే నాల్గవ తేదీన ప్రకటించ బడ్డాయి. వాటి ఫలితాలు చాలా లోతైన ప్రభావం చూపించేలా వున్నాయి. సహజంగానే ఈ కొత్త పరిస్థితి నుంచి ఉత్పన్నమయ్యే సవాళ్లను తక్కువగా చూడటమంటే అది మన వినాశాన్ని కొనితెచ్చుకోవడమే. మరీ ముఖ్యంగా మన లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్ వ్యవస్థ భవిష్యత్తుకు అది చాలా ముప్పవుతుంది. తమ పార్టీ సాధించిన దాని నుంచి వెంటనే ప్రయోజనం పొందడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనువెంటనే వేగంగా వేడుకలు ప్రారంభించారు. ఇది కేవలం ఎన్నికల పరమైన మార్పు మాత్రమే కాదని ఇది ప్రజల ఆలోచనా ప్రక్రియలో వచ్చిన మార్పు అని చెబుతున్నారు. ఆయన ఈ విధంగా నొక్కి చెప్పడంలో విడదీయరాని ఒక అంశమేమంటే కేరళంలో ఎల్‌డిఎఫ్ ఓడిపోవడం. గతంలో వామపక్షం 34 ఏళ్లు అప్రతిహతంగా పాలన చేసిన పశ్చిమ బెంగాల్‌లో మొదటిసారి బీజేపీ అధికారం చేపట్టడం. అస్సాంలో బీజేపీ విజయం, విస్తరణ కూడా ఏమంత తక్కువైన విషయం కాదు. అక్కడ అది వంద స్థానాలు దాటేసింది.కేరళం 2021 ఎన్నికలలో కేరళలో మళ్లీ అధికారంలోకి రావడం ద్వారా ఎల్‌డిఎఫ్ అనూహ్యమైనది సాధించింది.
రాజకీయ చైతన్యశీలమైన ఆ రాష్ట్రంలో ఓటింగు ప్రాధాన్యతలకు ఇది పెద్ద సంచలన మార్పు. అందువల్ల ప్రజా పరిపాలనలో రాష్ట్ర సమగ్రాభివృద్ధితో అద్భుతమైన రికార్డు వున్నప్పటికీ సహజంగా వుండే ద్విగుణీకత ప్రభుత్వ వ్యతిరేకతా లక్షణం, మార్పు చూడాలనే కాంక్ష బలంగా పనిచేశాయి. ఈ సవాలును వెనక్కు కొట్టేందుకై ఎల్‌డిఎఫ్ చేసిన సాహసోపేత ప్రయత్నం ఫలప్రదం కాలేక పోయింది. సంకుచితమైన అస్తిత్వవాద భావజాలం ప్రచారం చేసే శక్తుల ప్రభావం నుంచి మరింత మందిని బయటికి తెచ్చే ప్రయత్నం విజయం సాధించలేకపోయింది. కాంగ్రెస్ ప్రదర్శించిన అవకాశవాదం పాత్ర కూడా ఏమీ తక్కువది కాదు. అది అల్పమైన తన ఎన్నికల ప్రయోజనాల కోసం ఆ పార్టీ సీపీఐ(ఎం)-బీజేపీ మిలాఖత్ అయ్యాయని అసత్యాలతో నిందా ప్రచారం చేసింది. అందువల్ల మోడీ ఎన్నికల ఫలితాలకు ఎలాంటి భాష్యం చెప్పినా, స్వయం ప్రకటిత స్వయంసేవక్ సంఘ్ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ ఎలాంటి ఆశలు పెట్టుకున్నా వామపక్షం బలం కూడగట్టుకుని ఈ ఎన్నికల ఎదురుదెబ్బను అధిగమిస్తుంది. హిందూత్వ శక్తుల సవాలును తిప్పి కొడుతుంది.బెంగాల్ పాఠం ఇక పశ్చిమ బెంగాల్‌లో కథ మరింత దుర్మార్గమైంది. రాజకీయ చరిత్ర అధ్యయనం చేసిన వాళ్లు ఆరెస్సెస్ గానీ హిందూత్వ శక్తులు గానీ 1990 లలో ఏం చేశాయో చూసే వుంటారు.
వారు కాంగ్రెస్‌ను చీల్చి వామపక్ష వ్యతిరేక ప్రతిఘటనకు ఒక విస్తృత వేదికగా తృణమూల్ కాంగ్రెస్‌ను పెంపొందించారు. సరిగ్గా ఆ తృణమూల్ గత పదిహేనేళ్ల పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతే ఇప్పుడు హిందూత్వ శక్తులు బీజేపీ అధికారం చేజిక్కించుకోవడానికి మంచి భూమిక కావడం విచిత్రమైన వాస్తవం. సరిహద్దుల ఆవల నుంచి చొరబాటుదారులు వస్తున్నారనే సమస్యపై మతతత్వ ప్రాతిపదికన సమీకరణను దృఢతరం చేయడానికి పకడ్బందీగా ప్రచారం నడిచింది. బంగ్లాదేశ్ అంతర్గత పరిణామాలను కూడా ఆధారం చేసుకుని మైనార్టీ వ్యతిరేక భయోన్మాదం రెచ్చగొట్టబడింది. మత రాజకీయాలకు ఆమోద ముద్ర కల్పించిన తణమూల్ కాంగ్రెస్ ఎన్నికల అవకాశవాదం కారణంగా ఈ వ్యూహం ఫలించగలిగిందనేది కూడా నిజమే.అయితే ఎన్నికల సంఘం పాత్ర, వక్రబుద్ధితో కూడిన ప్రత్యేక సమగ్ర పరిశీలన ‘సర్’ తతంగం వీటి నుంచి సరైన పాఠాలు తీసుకోక పోతే బెంగాల్ కథ అసంపూర్ణమే అవుతుంది. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయానికి జంకనవసరం లేదు. ‘సర్’ ప్రక్రియ అనేది బీజేపీకి ఎన్నికల్లో లాభదాయకంగా మారడమే గాక సమాజానికి అస్తిత్వాలకు సంబంధించిన భవిష్యత్తును కూడా వేటాడే మరింత పెద్ద ప్రశ్నలను ముందుకు తెచ్చి నిలిపింది. ఎన్నికల సంఘం కొలబద్దగా తీసుకున్న 2002-03 ఓటర్ల జాబితాలలో వున్న 27 లక్షల మంది పరిస్థితి గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతున్నది.
ఎలాంటి పరీక్షకూ నిలవని ఒక సాఫ్ట్‌వేర్ ఆధారంగా ‘తీర్పు కోసం నిరీక్షణ’ అనే విపరీత విభాగంలో వారు పడిగాపులు పడివుంటున్నారు. రాజ్యాంగ బద్దమైన వారి ఓటు హక్కు నిరాకరించబడింది. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కూడా అయిన న్యాయ విచారణ ట్రిబ్యునల్ ప్రధాన న్యాయమూర్తి ఎన్నికలు ముగియగానే తీవ్ర నిరసనతో రాజీనామా చేసేశారు. తాము 1500 మంది ఓట్లను సంపూర్ణంగా నిర్ధారించగల్గినప్పటికి మొత్తం ఓట్ల సంగతి తేల్చడానికి కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. కేవలం ఎన్నికల సంఘం కారణంగానే ఇంతమందికి ఈ రాజ్యాంగ హక్కు నిరాకరించ బడిందనేందుకు ఇంతకన్నా దాఖలా మరేం వుంటుంది? దీన్ని చాలా తక్కువగా చెప్పాలంటే అపరిపక్వత అనీ, గట్టిగా చెప్పాలంటే దురుద్దేశ పూరితమనీ అనాలి. అస్సాంలో ముప్పు అస్సాంలో కూడా మున్నెన్నడూ ఎరగని రీతిలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ద్వారానే మతతత్వం రెచ్చగొట్టబడింది. రాష్ట్రంలో అత్యంత సున్నితమైన, క్లిష్టమైన జాతి మత వాతావరణంలో ఆయన పచ్చి విభజన ఎత్తుగడలకు పాల్పడ్డారు. ఈ ప్రయత్నం ఎంత బాహాటంగా నగ్నంగా సాగిందంటే రాజకీయ పక్షపాతాల పొడ కూడా లేని రాజ్యాంగ కోవిదులు, పౌర ప్రముఖులు దాన్ని సూటిగా ఖండిస్తూ ప్రకటన చేయవలసి వచ్చింది.
తమిళనాడు కొత్త మలుపుతమిళనాడు మరో విధమైన మార్పును చూసింది. రెండు ద్రావిడ పార్టీలతో సాగే సంప్రదాయ సమీకరణలను సవాలు చేసే కొత్త రాజకీయ శక్తి అందుకు కారణమైంది. ఈ కొత్త శక్తికి ప్రజల మద్దతు వున్నా అధికారంలోకి రానివ్వకుండా ఆరెస్సెస్-బీజేపీ నియమిత గవర్నర్ అడ్డుకున్నప్పటికీ భవిష్యత్తులో ఎలా వ్యవహరించేది చూడవలసి వుంది. సీపీఐ(ఎం) వామపక్షాలతో సహా ప్రజాస్వామిక శక్తులు సకాలంలో జోక్యం చేసుకోవడం వల్లనే దాన్ని అడ్డుకోవడం సాధ్యమైంది. అదే విధంగా ఈ కొత్త ప్రభుత్వం బీజేపీ మిత్రపక్షమైన ఎఐఎడిఎంకె కుటిల పథకాలకు గురికాకుండా కాపాడబడింది. సైద్ధాంతిక ఆధిపత్యం గొప్పల వెనక ఎవరున్నప్పటికీ మోడీ ప్రభుత్వం ఎన్నిక అనంతర పరిస్థితిని ఆసరాగా తీసుకుని తన నయా ఫాసిస్టు లక్ష్యాలను సాధించుకోవడానికి బరితెగించి ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సరికొత్త దాడి దెబ్బ కార్మికవర్గం పైన ఇతర శ్రామిక ప్రజానీకం పైన పడుతుంది. కొత్త లేబర్ కోడ్‌ల అమలు, వి.బి గ్రామ్‌జీ తీసుకురావడం ద్వారా గ్రామీణ ఉపాధి రద్దు ఇందుకు ప్రబలమైన ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి.వీధుల్లో పోరాటంభారత ఆర్థిక వ్యవస్థ, మరీ ముఖ్యంగా ఇంధన వ్యవస్థ ప్రమా దంలో వుందని ప్రధాన మంత్రి ఒప్పుకోవడం మరో కారుమేఘంలా కనిపిస్తున్నది. కడుపు కట్టుకోవడం, పొదుపు చర్యలు అంటూ వారు దానికి ఏవేవో పేర్లు పెడుతుంటారు. కాని ఎన్నో దర్జాలు వెలగబెట్టే ప్రధాని ఇలా చెప్పడం దారుణ హాస్యమే. అయినా సరే ఎన్నికల అనంతర నూతన పరిస్థితి అత్యంత తీత్రమైన సవాళ్లనే తెచ్చిపెడుతున్నది. ఇప్పుడు జీవనో పాధిని కాపాడుకోవడం, ప్రజల సంక్షేమం కోసం అత్యంత విశాల ఐక్యత ను పెంపొందించేందుకు, రాజ్యాంగ రక్షణకూ పోరాటం వీధుల్లోనే జరుగుతుంది. (మే 13, ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)



